Post date: Apr 23, 2011 12:15:52 PM
కడప, పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా కొంత మంది పోలీసు అధికారులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ ఫిర్యాదు చేసింది. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న ఆ పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిందిగా కోరింది.
ఈ మేరకు పార్టీ నేతలు అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, శివకుమార్ శుక్రవారం సచివాలయంలో భన్వర్‌లాల్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణకు చెందిన కారులో పాతిక లక్షల రూపాయలను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తీసుకువెళ్లారని, అయితే మంత్రి డీఎల్ ఫోన్ చేయడంతో తిరిగి ఆ డబ్బులను ఇచ్చేశారని ఆయన వివరించారు. ఈ విషయంపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఈఓను కోరామన్నారు.
మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
పది నుంచి పదిహేను మంది మంత్రులు కడపలో తిష్ట వేసి అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అంబటి తెలిపారు. కొంత మంది సీఐ, ఎస్ఐలు అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని, పేర్లతో సహా ఈ విషయాన్ని డీజీపీతో పాటు సీఈఓ దృష్టికి తీసుకువెళ్లామని, వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాల్సిందిగా కోరామని ఆయన వివరించారు. పోలీసుల అండతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు పోలింగ్‌కు ఓటర్లు రాకుండా చేయాలని అధికార పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. పోలీసు యంత్రాంగం ద్వారా జగన్, విజయమ్మ మెజారిటీని తగ్గించాలనే నీచమైన చర్యలకు అధికార కాంగ్రెస్, మంత్రులు పాల్పడుతున్నారని రాంబాబు పేర్కొన్నారు.
అధికార కాంగ్రెస్ డబ్బులు వెదజల్లుతోందని, పట్టుకున్న డబ్బులను కూడా పోలీసులు వదిలేస్తున్నారని ఆయన తెలిపారు. సాక్షి వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారనేది ఆరోపణే తప్ప వాస్తవం కాదని, వాస్తవమైతే బయట పడుతుంది కదా అని రాంబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బద్వేలు సీఐపై చేసిన ఫిర్యాదుపై నివేదిక తెప్పించుకున్నట్లు సీఈఓ తెలిపారని చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే నెపంతో వృద్ధుడనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా జమ్మలమడుగు రూరల్ సీఐ షరీఫ్ అతనిపై దాడికి పాల్పడ్డారని, బద్వేల్ రూరల్ ఎస్ఐ పురుషోత్తమరాజు అధికార పార్టీకి చెందిన డబ్బు పాతిక లక్షల రూపాయలను పట్టుకుని వదిలేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న కె.వేణుగోపాల రెడ్డిని ఖాజీపేట స్టేషన్ ఎస్ఐ వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే పోలీసు అధికారులను 20 మందిని కడపకు బదిలీ చేయించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు.