Post date: May 14, 2012 5:49:51 AM
ఎమ్మిగనూరు ఉపఎన్నికల ప్రచారంలో సీఎంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు.
జగన్ కోసం 7 గంటల నిరీక్షణ..
జగన్ రాక కోసం ఎమ్మిగనూరులో జనం ఏడు గంటలపాటు ఎదురు చూశారు. జగన్ ఉదయం 12 గంటలకు ఎమ్మిగనూరు చేరుకోవాల్సి ఉన్నా.. అడుగడుగునా ప్రజలు పోటెత్తడంతో అనుకున్న సమయం కంటే ఆలస్యమైంది. అయినా జనం జగన్ రాక కోసం ఎదురుచూసి ఘనస్వాగతం పలికారు.
‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అవినీతి గురించి మాట్లాడుతున్నారు.. నా ఇంటి గురించి కూడా మాట్లాడారు.. నా ఇంట్లో 74 రూములు ఉన్నాయట. నేను ఈరోజు ఆయన్ను అడుగుతున్నా.. నా ఇంట్లో నేనేమైనా హోటల్ నడుపుతున్నానా..? మీకేమైనా కనిపిస్తుందా..? నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడతారా..?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కై తన కులం, మతం, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఈ ఇద్దరికీ ఒకటే చెబుతున్నా.. నా మతం మానవత్వం. పేదవాడి కోసం తపించే, తాపత్రయపడే కులమే నా కులం..’’ అని ఉద్ఘాటించారు.
పాలక, ప్రతిపక్ష నేతలు ప్రతిరోజు జగన్, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడడమే తప్ప ప్రజల గురించి మాట్లాడడం మర్చిపోయారని విమర్శించారు. ‘‘కిరణ్, చంద్రబాబునాయుడు ప్రతిరోజూ జగన్ అది చేశాడు.. ఇది చేశాడు.. వైఎస్ రాజశేఖరరెడ్డి అది చేశాడు.. ఇది చేశాడు.. అని మాట్లాడడమే తప్ప.. మేం ప్రజలకు ఇది చేశాం.. ఇది చేయబోతున్నాం... అని మాట్లాడే పరిస్థితే లేదు’’ అని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రెండోరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జగన్ పర్యటించారు.
ఉదయం 9.30 గంటలకు ఎర్రకోట సమీపంలోని సెయింట్ జాన్స్ కాలేజీ నుంచి బయలుదేరి.. ముగతి, నందవరం, హాలహర్వి, ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్‌షోలు నిర్వహించారు. పలుచోట్ల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయం.. బతికున్న చంద్రబాబుకు ఒక న్యాయం అన్నట్టుగా సీబీఐ విచారణ సాగుతోందని దుయ్యబట్టారు. పాలక, ప్రతిపక్ష నేతల కుతంత్రాలు సాగకపోయేటప్పటికి చివరికి సాక్షి పత్రిక, సాక్షి టీవీలను మూయించేందుకు అంతా ఏకమయ్యారని చెప్పారు. వీరి నీచ రాజకీయాలను పైనుంచి ఆ దేవుడు గమనిస్తున్నాడని, వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రేమించే ప్రతి గుండె ఒక్కైటె .. ఆ తుపానులో వీరంతా కొట్టుకుపోతారని అన్నారు.
రైతులు, కూలీల గురించి పట్టించుకునే నాథుడే లేడు..
గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతున్నా రాష్ట్రంలో వారిని పట్టించుకునే నాథుడే లేడని జగన్ విమర్శించారు. చేనేత కార్మికులు, కూలీలు, విద్యార్థుల కష్టాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. పంట పెట్టుబడి కోసం రూ.5 వడ్డీతో అప్పు చేసిన రైతులు కనీసం వడ్డీ కూడా చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఒక్కరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రతిపక్ష పార్టీ అయినా తమకు అండగా నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని రైతులు ఎంతో ఆశగా చూస్తే... చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కై పోయారన్నారు. వీరిద్దరు కలిసి చివరకు ఎమ్మెల్సీ పదవులు, ఆర్టీఐ కమిషనర్ పదవులను వాటాలుగా పంచుకుంటున్నారని విమర్శించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందిన తర్వాత ఏ ఒక్క రైతు ముఖంలోనూ చిరునవ్వు కనబడటం లేదని, గ్రామాల్లో నీరు, విద్యుత్ సమస్య ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ‘‘వైఎస్ మృతి తర్వాత చేనేత కార్మికులను ఆదుకునేవాళ్లే కరువయ్యారు.
వారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. చేనేత కార్మికుల రుణ మాఫీ కోసం వైఎస్ రూ.312 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు వారి గురించి ఆలోచించే తీరిక కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వారి సమస్యలపై ఎన్ని దీక్షలు చేసినా స్పందన లేదు’’ అన్నారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం రూ.137 ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్యూబిక్ మీటర్ ప్రకారం కొలతలు వేసి లెక్క కడుతున్నారని, దీంతో వారికి రోజుకు కనీసం రూ.60 నుంచి రూ.70లు కూడా రావడం లేదని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు సకాలంలో రాక పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తిప్పలు పడుతున్నా నేతలు నోరు మెదపడం లేదన్నారు.