Post date: Aug 25, 2011 5:0:43 AM
*సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినందున జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం
*సీబీఐ నివేదికను జగన్‌కు ఇచ్చి, ఆయన వాదనను ఎందుకు వినలేదు?
*సీబీఐ నివేదికను జగన్‌కు ఇవ్వటానికి ఉన్న అభ్యంతరాలేమిటి?
*అసలు సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికలు ఒకటా? రెండా?
*శంకర్రావు, టీడీపీ నేతల న్యాయవాదులకు ధర్మాసనం ప్రశ్నలు.. తడబడ్డ న్యాయవాదులు
*నివేదిక ఇవ్వకపోవటం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: రామ్‌జెఠ్మలానీ
*వాస్తవాలు బయటకు వస్తాయనే హైకోర్టు అడిగినా ప్రభుత్వం స్పందించలేదు: రోహత్గీ
*ఏ కోర్టును ఆశ్రయించాలో మీరే చెప్పాలి: తుల్సీ
జగతి పబ్లికేషన్స్, సాక్షి టీవీల్లో పెట్టుబడులు, తన ఆస్తులకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినందున, హైకోర్టు తీర్పుపై ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దల్వీర్భండారీ, జస్టిస్ దీపక్వర్మలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుబాటులో ఉన్న న్యాయ మార్గాలను ఉపయోగించుకుని న్యాయం పొందేందుకు పిటిషనర్ ప్రయత్నాలు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అంటే దీని ప్రకారం జగన్మోహన్రెడ్డి మున్ముందు తనకు అన్యాయం జరుగుతున్నదని భావించినప్పుడల్లా న్యాయపరిధి ఉన్న ఏ కోర్టునైనా ఆశ్రయించవచ్చు. అది సీబీఐ కోర్టు కావచ్చు.. హైకోర్టు కావచ్చు.. సుప్రీంకోర్టు కావచ్చు.
హైకోర్టు తీర్పుపై జగన్ ఏ అభ్యంతరాలనైతే లేవనెత్తారో.. సుప్రీంకోర్టు వాటిపైనే టీడీపీ నేతల తరఫు న్యాయవాదులకు పలు ప్రశ్నలు సంధించింది. ఒకానొక దశలో సుప్రీంకోర్టు ప్రశ్నలకు టీడీపీ న్యాయవాదులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించిన హైకోర్టు.. సీబీఐ నివేదికను పిటిషనర్ల (జగన్మోహన్రెడ్డి, తదితరులు)కు ఇచ్చి, నివేదికపై వారి వాదనలను విన్న తరువాత ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ నివేదికను జగన్‌కు ఇవ్వటానికి అభ్యంతరం ఏమిటని కూడా ప్రశ్నించింది.
రాష్ట్ర మంత్రి శంక్రరావు లేఖ, టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డిలు తమ తమ పిటిషన్లలో లేవనెత్తిన ఆరోపణల ఆధారంగా సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ హైకోర్టు ఈ నెల 10న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసిన జగన్.. వీటిలో హైకోర్టు తీర్పుపై తనకున్న అభ్యంతరాన్నింటినీ పొందుపరిచారు. అంతేకాక హైకోర్టు తీర్పుపై కొన్ని మౌలిక ప్రశ్నలను కూడా పిటిషన్లలో ప్రస్తావించారు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లపై బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో.. జగన్ తరఫున సీనియర్ న్యాయవాదులు రామ్‌జఠ్మలానీ, ముకుల్ రోహత్గీ, కె.టి.ఎస్.తుల్సీలు వాదనలను వినిపించారు.
హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చే విషయంలో సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని వారు వాదించారు. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను తమ క్లయింటుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అలా ఇవ్వటంలో హైకోర్టు విఫలమైందని.. నివేదికలోని అంశాలకు వివరణ ఇచ్చుకునే అవకాశం తమ క్లయింటుకు ఇవ్వకుండానే తీర్పు ఇచ్చిందని వారు పేర్కొన్నారు. పిటిషనర్ల అసలు ఉద్దేశాలను పూర్తిగా పరిశీలించకుండానే.. హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. జగన్ స్థాపించిన రాజకీయ పార్టీని బలహీనపరచటానికే.. పెద్ద పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు కోర్టును వేదికగా ఎంచుకున్నాయని ఆరోపించారు. కాబట్టి హైకోర్టు ఉత్తర్వులను నిలుపదల చేయాలని కోరారు. శంకర్రావు, టీడీపీ నేతల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎ.కె.గంగూలీ, ఉదయ్లలిత్లు వాదించారు.
దురుద్దేశాలను తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు...
మొదట వాదనలు ప్రారంభించిన రామ్‌జఠ్మలానీ.. ‘పిటిషనర్లు (శంకర్రావు, టీడీపీ నేతలు) ఏ ఉద్దేశంతో పిటిషన్లను దాఖలు చేశారో హైకోర్టు తెలుసుకోలేక పోయింది. పిటిషనర్లు రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేశారని జగన్మోహన్రెడ్డి పదే పదే చెప్పినా.. పిటిషనర్ల దురుద్దేశాలను తెలుసుకునేందుకు హైకోర్టు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను తమకు ఇవ్వాలని పదే పదే కోరినా హైకోర్టు అందుకు అంగీకరించలేదు. తమకు సహాయకారిగా ఉంటుందనే ప్రాథమిక విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పిన హైకోర్టు.. తరువాత ఆ నివేదికను పక్కన పడేసింది. నివేదికను మేం కోరితే దానిని పరిశీలిస్తున్నామని చెప్పింది. చివరకు నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా, పిటిషనర్ల ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, వాటి పట్ల సంతృప్తి చెందుతున్నామని చెప్పింది.
ఈ నిర్ణయానికి దేని ఆధారంగా హైకోర్టు వచ్చిందో ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ప్రాథమిక విచారణ నివేదికలోని అంశాల ఆధారంగా జగన్‌పై హైకోర్టు వివక్ష చూపిందనే అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా.. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టులో కేవియట్‌లను దాఖలు చేసి మరీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. 2011లో జగన్ రాజకీయ పార్టీని స్థాపించారు.. ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకే ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్‌లు తమ కక్ష సాధింపు చర్యలకు హైకోర్టును వేదికగా చేసుకున్నాయి. వీధిలో చేయాల్సిన పోరాటాలకు కోర్టులను వేదికగా చేసుకుని సాగిస్తున్నాయి. దీనినిబట్టి ఆ పార్టీల ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా తెలుస్తున్నాయి. కానీ ఈ విషయాలను హైకోర్టు ఏ మాత్రం పట్టించుకోలేదు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలనేవి క్రిమినల్ చట్టంలో ఉండవు. అలాంటపుడు క్రిమినల్ చర్యలు కోరుతూ ఎవరైనా పిటిషన్లు దాఖలు చేస్తే, వాటిని కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంపై వేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. క్రిమినల్ చర్యలు కోరుతూ వేసినటువంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కోర్టులు తోసిపుచ్చాలని ఆనాటి తీర్పులో సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది’ అని కోర్టుకు నివేదించారు.
హైకోర్టు తీర్పు తప్పు.. సీబీఐ దర్యాప్తూ తప్పు...
రామ్‌జఠ్మలానీ తన వాదనల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టారు. హైకోర్టు తీర్పు ఆధారంగా సీబీఐ చేస్తున్న దర్యాప్తునూ తప్పుపట్టారు. ‘ప్రాథమిక విచారణ నివేదికను సీబీఐ నుంచి తీసుకున్నాక రాష్ట్ర హైకోర్టు దాన్ని తెరిచి చదివింది. ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో వారికి మాత్రం ఆ నివేదిక మీద అభిప్రాయం చెప్పే అవకాశం కానీ, వివరణలు ఇచ్చే అవకాశం కానీ ఇవ్వలేదు. పెపైచ్చు పూర్తి స్థాయి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఇది ఏ మాత్రం సరికాదు. ఇలా ఆదేశించే సమయంలో హైకోర్టు సహజ న్యాయసూత్రాలను పాటించలేదు. వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు డజన్లకొద్దీ ఇచ్చిన తీర్పులను హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీనినిబట్టి హైకోర్టు ఏకపక్షంగా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు అనిపిస్తోంది. సమన్యాయ సూత్రాన్ని పాటించకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు.. దాని ఆధారంగా సీబీఐ జరుపుతున్న దర్యాప్తు కూడా తప్పు. సీబీఐ చేస్తున్న సోదాలూ తప్పు. 34 కంపెనీల్లో సోదాలు జరిపి భయభ్రాంతులకు గురిచేయాలనే ఆలోచన భరించలేనిది.
ఇదంతా గమనిస్తుంటే హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు పూర్తిగా రాజకీయ ప్రోద్బలంతోనే, రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్లు వేశారని బోధపడుతోంది. పిటిషన్లు ఎందుకు వేశారనే విషయాన్ని కనీస స్థాయిలో కూడా పరిశీలించకుండా నేరుగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించటం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. శంకర్రావు లేఖ రాసినపుడు అందులోని ఆరోపణల ఆధారంగా తాము ఒక అభిప్రాయానికి రాలేమని చెప్పిన హైకోర్టు.. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది. కానీ, ఆ ప్రాథమిక విచారణ నివేదిక అందిన తర్వాత మాత్రం దానిపై ఆధారపడటం లేదని హైకోర్టు చెప్పింది. అంతేకాక శంకర్రావు, టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై సంతృప్తి చెంది పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని స్పష్టం చేసింది. ఇలా చేయటం ఎంత వరకు సమంజసమో ఈ కోర్టు ఆలోచించాలి’ అని జఠ్మలానీ ధర్మాసనాన్ని కోరారు.
హైకోర్టు రికార్టులివ్వాలన్నా ప్రభుత్వం స్పందించలేదు..
అనంతరం జగన్ తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ దురుద్దేశాలను ఎండగట్టారు. మంత్రిమండలి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలను కేవలం రాజశేఖరరెడ్డికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఆయన మంత్రి మండలి సమిష్టిగా తీసుకున్నవే. ఆ నిర్ణయాలే ప్రభుత్వ ఉత్తర్వుల రూపంలో వచ్చాయి. ఇదే విషయాన్ని శంకర్రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో మంత్రిమండలికి సంబంధించిన నిర్ణయాల తాలుకు రికార్డులను ఇవ్వాలంటూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హైకోర్టు కోరింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వాధికారి కానీ స్పందించలేదు. దీనినిబట్టి ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశాలు ఉన్నాయో అర్థమవుతోంది. జగన్ కొత్త పార్టీ ప్రారంభించారు. ఆయనకు ప్రజల్లో బలం రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పుడు రికార్డులు ఇస్తే వాస్తవాలు బయటకు వచ్చి జగన్ నిర్దోషిగా తేలుతుంది. అది జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం హైకోర్టుకు రికార్డులను అందచేయలేదు.
తన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రోద్బలంతోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని శంకర్రావు స్వయంగా ఒప్పుకున్నారు. దీనినిబట్టి ఆయన దాఖలు చేసిన వ్యాజ్యం రాజకీయ ప్రయోజన వ్యాజ్యమని స్పష్టమవుతోంది. రాజకీయ పోరాటాలకు తమను వేదికలుగా చేసుకుంటుంటే హైకోర్టు చూస్తూ ఊరుకుంది. హైకోర్టు సీబీఐ ప్రాథమిక విచారణ నివేదిక కాపీలను ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అందచేయటానికి కూడా సంసిద్ధతను వ్యక్తం చేయలేదు. ఈ విషయంలో హైకోర్టు తీరు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపి, సీబీఐ నివేదికను కూడా తీసుకుని, ఆ కేసును జగన్ కేసుతో ముడిపెట్టి, జగన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించటం ఎంత వరకు సబబు?’ అని అన్నారు.
జగన్‌కు ఎందుకు కాపీ ఇవ్వలేదు..?
ఈ ఇద్దరు న్యాయవాదులు వాదనలు ముగించగానే ధర్మాసనం జోక్యం చేసుకుని.. హైకోర్టు తీరుపై పలు ప్రశ్నలు సంధించింది. ధర్మాసనం తరఫున జస్టిస్ భండారీ జోక్యం చేసుకుంటూ.. ‘సీబీఐ ప్రాథమిక విచారణ నివేదిక కాపీని జగన్‌కు ఇచ్చి, ఆయన వాదనలు విన్న తర్వాత కోర్టు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు?’ అని ప్రశ్నించారు. దీనికి శంకర్రావు తరఫు న్యాయవాది గంగూలీ బదులిస్తూ.. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను బయటకు వెల్లడిస్తే తమ ప్రతిష్ట దెబ్బతింటుందని, తమ సంస్థలకు నష్టం చేకూరుతుందని ప్రతివాదుల్లో కొందరు కోర్టును కోరారని చెప్పారు.
దీనికి ముకుల్ రోహత్గీ తీవ్రంగా స్పందించారు. నివేదిక వెల్లడించవద్దని కోరిన వ్యక్తులు ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులోనివారని, జగన్ ఆ కేసులో ప్రతివాది కాదని, అలాంటప్పుడు గంగూలీ తన వాదనలను తమకు వర్తింపచేయటం ఎంత మాత్రం సబబు కాదని తేల్చిచెప్పారు. తిరిగి జస్టిస్ భండారీ జోక్యం చేసుకుని.. హైకోర్టుకు సీబీఐ సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికలు ఒకటా? లేక రెండా? అనేది స్పష్టం చేయాలని గంగూలీని అడిగారు. రెండు నివేదికలు ఉన్నాయని గంగూలీ చెప్పారు. దీనిపై జగన్ తరఫు న్యాయవాదులు రామ్‌జఠ్మలానీ, ముకుల్ రోహత్గీ అభ్యంతరం తెలిపారు. ‘సీబీఐ రెండు నివేదికలు ఇచ్చిందని మీరు అఫిడవిట్ దాఖలు చేస్తే మేం ఇంతటితో వాదనలు ముగించి పిటిషన్లను ఉపసంహరించుకుని వెళ్లిపోతాం’ అని చెప్పారు. దీనికి ఏ విధంగా స్పందించాలో తెలియక గంగూలీ కాసేపు మౌనందాల్చారు.
ఈ సమయంలో టీడీపీ నేతల తరఫు న్యాయవాది ఉదయ్‌లలిత్ కల్పించుకుని.. సీబీఐ ఒకటే నివేదిక ఇచ్చిందని, అయితే దాన్ని జగన్ కేసులో కోర్టు చదవలేదని, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చదివిందని చెప్పారు. ఈ తరుణంలో ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘నివేదిక చదివిన తర్వాత హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారమే తీర్పు ఇచ్చిందా..? సీబీఐ నివేదికను జగన్‌కు ఇవ్వటానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి?’ అని గంగూలీ, ఉదయ్లలిత్లను ప్రశ్నించారు. దీనికి అంతకు ముందు చెప్పిన వాదననే తిరిగి గంగూలీ వినిపించారు. చివర్లో రామ్‌జెఠ్మలానీ స్పందిస్తూ.. ‘నిబంధనలను హైకోర్టు పట్టించుకోలేదు. సీబీఐ నివేదికను జగన్‌కు ఇవ్వకుండా దానిపై స్పందించే అవకాశం ఇవ్వకుండా తీర్పు ఇవ్వటం సరికాదు’ అంటూ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టారు.
హైకోర్టు తీర్పు పద్ధతి ప్రకారం లేదు: రోహత్గీ
హైకోర్టు తీర్పు ఒక పద్ధతి ప్రకారం లేదని రోహత్గీ అన్నారు. ‘కోర్టు ప్రభావితం అయ్యిందా, లేదా అని నేను ప్రశ్నించటం లేదు. ఒకే వాస్తవాన్ని ఐదు ముక్కలుగా విభజించి ఒకదానికి, మరొకదానికి పొంతన లేని విధంగా హైకోర్టు విశ్లేషణ చేసింది. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదిక లేకుండా ఏ విషయం నిర్థారించలేమని హైకోర్టు మొదట చెప్పింది. తరువాత ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, కాబట్టి సీబీఐ నివేదికను పరిగణనలోకి తీసుకోవటం లేదని తీర్పులో పేర్కొంది. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను తాము చదివాం కానీ దాని ఆధారంగా నిర్ణయానికి రావటం లేదని మరోసారి చెప్పింది.
నివేదికను చదివిన తర్వాత ప్రాథమిక ఆధారాలున్నట్లుగా భావించామని ఒకసారి చెప్పింది. అసలు జగన్ కేసులో ప్రాథమిక విచారణ నివేదికను తాము ఉపయోగించుకోలేదని, ఆ నివేదికను చదివి మళ్లీ సీల్డ్ కవర్లో ఉంచామని పేర్కొంది. ఇలా పరస్పర భిన్నమైన వ్యాఖ్యలను హైకోర్టు చేసింది. ఈ అంశాన్ని ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైకోర్టు తీర్పులోని పేరా 52లో ‘‘ఇరు పక్షాల మధ్య రాజకీయ వైరం ఉందన్న దాంట్లో సందేహం లేదు’’ అనే వ్యాఖ్యలు చేస్తూనే.. రాజకీయ ప్రోద్బలంతో దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయాలంటూ విశ్వనాథ్ చతుర్వేది కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. అదే సమయంలో శంకర్రావు, టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ.. పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తూ తీర్పు ఇవ్వటం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు.
మేమెక్కడికి వెళ్లాలో చెప్పండి?
ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టే నేరుగా సీబీఐని ఆదేశించటంతో, సీబీఐ చర్యలను సవాల్ చేయాలంటే తాము ఎక్కడికి వెళ్లాలో చెప్పాలని జగన్ తరఫు సీనియర్ న్యాయవాది కె.టి.ఎస్.తుల్సీ సుప్రీంకోర్టును కోరారు. ‘హైకోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది.. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ని సవాల్ చేయాలన్నా, మేం తదుపరి చర్యల నిలుపుదలకు వెళ్లాలన్నా ఏ కోర్టుకు వెళ్లాలి, ఏ విధంగా కోర్టులను ఆశ్రయించాలో చెప్పండి. సుప్రీంకోర్టు పిటిషన్లను తోసిపుచ్చింది అనగానే సహజంగా ఒక నెగిటివ్ ముద్ర పడుతుంది, ఆ ముద్ర మా క్లయింట్ (జగన్)పై పడకుండా, అలాగే విచారణ సాగిస్తున్న సంస్థ సీబీఐ మీరిచ్చే ఆదేశాలకు ప్రభావితం కాకుండా దర్యాప్తును సాగించేలా చూడండి’ అని ధర్మాసనాన్ని తుల్సీ అభ్యర్థించారు. దీనికి కోర్టు స్పందిస్తూ, ఎవరైనా సరే నిబంధనల ప్రకారం చట్ట పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుందే తప్ప, వాటికి భిన్నంగా వెళ్లరాదని సీబీఐని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించింది. అందరి వాదనలూ విన్న ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తు ప్రారంభించినందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమంటూ జగన్ పిటిషన్లను తోసిపుచ్చింది.
‘పిటిషనర్లు (శంకర్రావు, టీడీపీ నేతలు) ఏ ఉద్దేశంతో పిటిషన్లను దాఖలు చేశారో హైకోర్టు తెలుసుకోలేక పోయింది. పిటిషనర్లు రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేశారని జగన్మోహన్రెడ్డి పదే పదే చెప్పినా.. పిటిషనర్ల దురుద్దేశాలను తెలుసుకునేందుకు హైకోర్టు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను తమకు ఇవ్వాలని పదే పదే కోరినా హైకోర్టు అందుకు అంగీకరించలేదు.
- సుప్రీంకోర్టులో జగన్ తరఫు న్యాయవాది రామ్‌జెఠ్మలానీ