Post date: Jul 10, 2012 6:53:53 AM
సస్పెండ్ చేస్తున్నట్టు హడావుడిగా ప్రకటించిన పార్టీ
విజయమ్మతో టీడీపీ ఎమ్మెల్యే నాని భేటీలో ఉండగానే నిర్ణయం.. టీడీపీ విస్తృత భేటీలో దీనిపైనే చర్చ
ఎమ్మెల్యేనూ బాబు ఆపలేకపోయారంటున్న నేతలు
జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలకు బాబు ఫోన్
ఆ తరవాత మీడియాతో మాట్లాడిన జూనియర్
బాబు పేరెత్తకుండా పావుగంట పాటు వివరణ
ఎన్టీఆర్, బాలకృష్ణలను ప్రస్తావించిన వైనం
కొడాలి నాని వెనక తాను లేనని స్పష్టీకరణ
చంచల్‌గూడలో వైఎస్ జగన్‌తో నాని భేటీ
కుమ్మక్కయిందెవరో, వెన్నుపోటెవరిదో
త్వరలో వెల్లడిస్తానని నాని ప్రకటన
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఉదంతం ఆ పార్టీలో సోమవారం రోజంతా కలకలం రేపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో నాని సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ సమావేశం పూర్తి కూడా కాకముందే ఆయనను సస్పెండ్ చేస్తూ టీడీపీ హడావుడిగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు ఎస్సెమ్మెస్‌ల రూపంలో సమాచారం పంపింది. టీడీపీ రెండు రోజుల విస్తృత స్థాయి సమావేశాలు మొదలైన రోజే చోటుచేసుకున్న ఈ ఉదంతంతో పార్టీ నేతలు కంగుతిన్నారు. సమావేశంలో కూడా వారు రోజంతా దీనిపైనే చర్చిస్తూ గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ ఇద్దరు నేతలు కలిసినా ఈ విషయమే ప్రస్తావనకు రావడం కన్పించింది. వారం క్రితమే అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా పిలిపించుకుని మాట్లాడటాన్ని గుర్తు చేసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా బాబు ఆపలేకపోయారన్న భావన వ్యక్తమైంది. ‘మీ దగ్గర నుంచి ఎవరెవరు వెళ్తున్నార’ంటూ పొరుగు జిల్లాల నేతలను ఆరా తీస్తూ గడిపారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంతో తనకు ఏ సంబంధమూ లేదని నానికి అత్యంత సన్నిహితుడైన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. నాని మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు... ఎవరిది వెన్నుపోటు వంటి వాస్తవాలన్నింటినీ త్వరలో వెల్లడిస్తానని ప్రకటించారు.
కృష్ణా జిల్లా నేతలతో బాబు భేటీ
పార్టీ నిబంధనలను అతిక్రమించారని భావించిన వారికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసి వివరణ కోరేది. నాని విషయంలో మాత్రం అలాంటిదేమీ లేకుండానే నేరుగా సస్పెండ్ చేశారు. విజయమ్మతో నాని భేటీ వార్త చానళ్లలో రాగానే పార్టీ రాష్ట్ర స్థాయి భేటీకి వచ్చిన కృష్ణా జిల్లా నేతలతో బాబు అత్యవసరంగా సమావేశమయ్యారు. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ ఎందుకు రాలేదంటూ ఆరా తీశారు. ఆలస్యంగా బయల్దేరడమే కారణమని నేతలు వివరించారు. నాని వంటి నేతల గురించి పట్టించుకోవద్దని, ఒకరు పోతే ఆ నియోజకవర్గంలో పది మంది నేతలను తయారు చేసుకుందామని వారికి బాబు ధైర్యం చెప్పారు. నాని విషయం తెలియగానే బాబు తన బావమరిది నందమూరి హరికృష్ణతో ఫోన్లో చర్చించారు. ఒకరిద్దరు విలేకరులు కూడా హరికృష్ణకు ఫోన్ చేశారు. నానితో తమది సినిమా బంధమేనని, అంతకంటే ఏమీ లేదని ఆయన చెప్పారు. బాబు నేరుగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన మామ, తన మేనకోడలు భర్త నార్నె శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం.
దాంతో షూటింగ్ నిమిత్తం ఇటలీ వెళ్లే హడావుడిలో ఉన్న ఎన్టీఆర్, సోమవారం మధ్యాహ్నం ఉన్నపళాన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నాని తన సన్నిహితుడే అయినా ఆయన పార్టీ వీడటం వెనక తన ప్రమేయం లేదని చెప్పారు. అయితే 15 నిమిషాల పాటు విలేకరులతో మాట్లాడిన ఆయన, ఒక్కసారి కూడా బాబు పేరు ప్రస్తావించలేదు. తన తాత ఎన్టీఆర్, బాబాయి బాలకృష్ణల పేర్లు ప్రస్తావించారు. టీడీపీని ‘నా, మా పార్టీ’ అని పలుమార్లు చెప్పారు! నాని పార్టీని వీడతారని గతంలోనే నిర్ణయానికి వచ్చిన బాబు, కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యేలు రావి శోభనాద్రి, రావి వెంకటేశ్వరరావులను ప్రత్యేకంగా తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. 2004లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుకు ప్రత్యేక కారణాల వల్ల సీటివ్వలేకపోయానన్నారు. ఈసారి తప్పకుండా ఇస్తానని చెప్పారు. కానీ బాబు హామీలను ఆయన నమ్మలేదని, ‘ఇప్పుడు నాని వెళ్లిపోతున్నాడు కాబట్టి గతంలో టికెటివ్వని మేం మీకు గుర్తుకొచ్చాం. మీ మాటలెవరు నమ్ముతారు?’ అంటూ వెళ్లిపోయినట్టు సమాచారం.
నానిది వెన్నుపోటు: టీడీపీ
కొడాలి నాని రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని, తన దైవం అని చెప్పుకునే ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారని టీడీపీ విమర్శించింది. కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, వైవీబీ రాజేంద్రప్రసాద్, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకర్, శ్రీరాం తాతయ్య, గద్దె రామ్మోహన్, పంచుమర్తి అనూరాధ, బుద్దా వెంకన్న, దాసరి ప్రసాద్, బొత్సల అర్జున్, కొల్లు రవీంద్ర తదితరులు సోమవారం విలేకరులతో మాట్లాడారు. నాని రూ.30 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. కృష్ణా జిల్లా ప్రజలకు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ైవె ఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లొద్దని, వెళ్తే మళ్లీ ముఖం చూపించొద్దని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు నానే తమకు చెప్పారన్నారు. గుడివాడలో టీడీపీకి ఎదురులేదని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా నానికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ‘‘టీడీపీ కల్పించిన గౌరవ ప్రతిష్టలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాని తాకట్టు పెట్టారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి నమ్మక ద్రోహానికి పాల్పడ్డ వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. నాని పరిస్థితీ అంతే’’నన్నారు.
వంశీ గైర్హాజరు
జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడిగా ముద్రపడ్డ విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ టీడీపీ విసృ్తత భేటీకి, బాబుతో సమావేశానికి వచ్చినా విలేకరుల సమావేశంలో మాత్రం పాల్గొనలేదు. దీనిపై నేతలను ప్రశ్నించగా విలేకరుల సమావేశ వేదికపై స్థలాభావమే కారణమన్నారు. దేవినేని ఉమ వల్లే నాని పార్టీని వీడారన్న ప్రచారంపై ఉమను ప్రశ్నించగా మౌనమే సమాధానమైంది.
జగన్‌తో నాని భేటీ
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఉదయం 9.45 సమయంలో ఆయన నేరుగా విజయమ్మ ఇంటికొచ్చి ఆమెతో కాసేపు సమావేశమయ్యారు. విజయమ్మకు సంఘీభావం తెలిపారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాతో కలిసి నాని చంచల్‌గూడ జైలుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ములాఖత్ ద్వారా జగన్‌ను కలిశారు. ఆయనతో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. జగన్‌ను తాను వ్యక్తిగతంగానే కలిశానని, అన్ని విషయాలూ త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. టీడీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు బదులివ్వడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. జగన్ డబ్బులతో గాలం వేశారన్న టీడీపీ ఆరోపణలను విలేకరులు ప్రస్తావించగా, ఎవరికి ఎవరు డబ్బులిచ్చారు, ఎవరు కుమ్మక్కయ్యారు, ఎవరు వెన్నుపోటు పొడిచారనే విషయాలను త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూలంకషంగా వివరిస్తానన్నారు. టీడీపీని వీడారా అనే ప్రశ్నించగా, సస్పెండ్ చేశాక పార్టీ నుంచి బయటకు వెళ్లినట్టేగా అని బదులిచ్చారు. నాని రాక సమాచారంతో చంచల్‌గూడ వద్ద మీడియా కిక్కిరిసిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా ములాఖత్‌లో జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాని ఆయన భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు.