Post date: Apr 28, 2011 6:5:2 AM
అనర్హత వేటు వేయాలంటూ సీఎల్పీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తనకు శాసన సభ కార్యదర్శి నోటీసులు జారీ చేయడాన్ని ఎమ్మెల్యే కొండా సురేఖ హైకోర్టులో సవాలు చేశారు. డిప్యూటీ స్పీకర్ ఆయన పరిధి దాటి ఈ నోటీసులు జారీ చేశారని కోర్టుకు విన్నవించారు. ఈనెల 23న స్పీకర్ తనకు జారీ చేసిన నోటీసుల అమలును నిలి పివేయాలని కోరుతూ కొండా సురేఖ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో శాసన సభ కార్యదర్శి, న్యాయ, శాసనసభ వ్యవహారాల కార్యదర్శి, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నోటీసు ఆధారంగా తనపై ఎటువంటి అనర్హత చర్యలు తీసుకోకుండా ప్రతివాదులను నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును కోరారు. తాను ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, పార్టీ తీర్మానాలను వ్యతిరేకించలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ‘పత్రికల్లో వచ్చిన కథనాలు, వారు విన్న వాటి ఆధారంగా ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళీమోహన్‌లు నాపై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన ఆదేశాల మేరకు శాసన సభ కార్యదర్శి నాకు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి డిప్యూటీ స్పీకర్ ఆయన పరిధి దాటి నోటీసులిచ్చారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ లేదా చైర్మన్‌కు మాత్రమే ఉంటుంది. నాపై చర్యలు తీసుకునేందుకు డిప్యూటీ స్పీకర్‌కు ఎటువంటి అధికారం కానీ, పరిధి కానీ లేదు. ప్రస్తుతం అసెంబ్లీకి స్పీకర్ లేరు కాబట్టి, ఆ హోదాలో డిప్యూటీ స్పీకర్ పంపిన నోటీసులకు చట్టబద్ధత లేదు. డిప్యూటీ స్పీకర్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి నాకు జారీ చేసిన నోటీసులు పదోషెడ్యూల్లోని నిబంధనలకు విరుద్ధం.
సభ్యుడి అనర్హత విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనని జి.ఎస్.ఇక్బాల్ వర్సెస్ కె.ఎం.ఖాదర్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని నేను స్వచ్ఛందంగా వదులుకోలేదు. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఎన్నడూ వ్యవహరించలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నాకు జారీ చేసిన నోటీసుల ఆధారంగా నాపై అనర్హత చర్యలు తీసుకోకుండా ప్రతివాదులను నిరోధించడంతో పాటు నోటీసులను రాజ్యాంగ వ్యతిరేకంగా, పదో షెడ్యూల్లోని నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించాలి. నోటీసుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి’’ అని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించనున్నది.