Post date: Apr 30, 2011 10:47:13 AM
సగం మంది మంత్రులు కడపలోమకాం వేశారని ధ్వజం
హైదరాబాద్ నుంచి డబ్బుసంచులు
టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఇంకా ఏం చేస్తారో!
‘ఓ తల్లీబిడ్డను ఇబ్బందుల పాలు చేసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారు. రోజుకో అబద్ధం చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి దిగుమతి అయిన మంత్రులు మూటల కొద్దీ డబ్బు తీసుకువచ్చారు. ప్రేమానురాగాలు.. ఆప్యాయతలను వెలకట్టి కొనేందుకు యత్నిస్తున్నారు. మాకు మద్దతు తెలుపుతున్న 9,800 మందిపై బైండోవర్ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కొంతమందిని స్టేషన్లో వేసికొడుతున్నార’ని కడప పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్.జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తంచేశారు.
పులివెందుల రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. పదిమంది జగన్‌లతో, ఆరుగురు విజయమ్మలతో నామినేషన్లు వేయించి ఓటర్లను తికమక పెట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై రోజుకో అబద్ధం చెబుతున్నారు. వారి లేనిది.. నాకు, నా తల్లికి ఉన్నది దేవుడి దయ.. వైఎస్ఆర్ ఆశీస్సులు.. మీ ప్రేమానురాగాలు.. నాన్నను ప్రేమించే ప్రతిగుండె నాకు తోడుగా ఉందని జగన్ ఉద్వేగంగా అన్నారు.
వైఎస్ కృషి ఫలితమే నేటి సోనియా అధికారం
దివంగత నేత రాజశేఖరరెడ్డి కృషి వల్లనే ఢిల్లీలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుని సోనియా చక్రం తిప్పగలుగుతుందని, ఆ కృతజ్ఞత కూడా లేకుం డా వైఎస్ కుటుంబాన్ని నిట్టనిలువునా చీల్చారని జగన్ ధ్వజమెత్తారు. వైఎస్‌పై కపటప్రేమ చూపిస్తూ, మరోవైపు ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకు మంత్రి శంకర్రావు వంటి వారితో కేసులు పెట్టిస్తున్నారన్నారు. ప్రతి పేదవాడి గుండెలో కొలువై ఉన్నారనే అసూయ తో వైఎస్ఆర్ను అభాసుపాలు చేసేందుకు ప్రతిపక్షంతో కుమ్మక్కై పది రోజుల పాటు అసెంబ్లీలో డ్రామా నిర్వహించి హౌస్ కమిటీ వేయించిందన్నారు.
ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాల్లో క్యాబినెట్‌లోని మంత్రులందరూ భాగస్వాములు కాదా? వారిపై ఎందుకు హౌస్‌కమిటీ వేయలేదు? చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలపై శతకోటి ఆరోపణలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతతోనే కుమ్మక్కై చనిపోయి రెండేళ్లయిన తర్వాత మహానేతపై హౌస్ కమిటీ వేయడం బాధాకరమన్నారు.
స్వర్ణయుగం రావాలి: ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నిండాలి..స్వర్ణయుగం సాధించుకోవాలంటే మనపార్టీ గెలవాలి...మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. మనగుర్తు ఏమిటో తెలిస్తే చేతులు ఎత్తాలని ఆయన అనగానే.. వేలాది చేతులు పైకిలేచాయి. మనగుర్తు ఫ్యాను గుర్తు అంటూ ఫ్యానును చూపిస్తూ.. ఓటర్లు నినాదాలు చేశారు. ఈ గుర్తును తెలియని పదిమందికి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను, తన తల్లిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.