Post date: Aug 02, 2011 6:10:18 AM
*దివంగత నేత వైఎస్ హయాంలో రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత
*సంక్షేమ పథకాల అమలు భేష్.. పేదరికం శాతమూ తగ్గింది
*ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రస్తుత రాష్ట్ర సర్కారు
వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకాల మృతిలో రాష్ట్రంలో ప్రగతి కుంటుపడిందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ‘వైఎస్ నాయకత్వంలో రాష్ట్రంలో స్థిరమైన రాజకీయ వాతావరణం ఉండేది. ఆయన ఆకస్మిక మృతి తరువాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది’ అని తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల అమలుకు బడ్జెట్ సపోర్టు రుణం మంజూరు చేయాల్సిన అవసరం లేదని బ్యాంకు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్కరణల రుణం-3 ప్రాజెక్టు అమలు పూర్తై సందర్భంగా ప్రపంచ బ్యాంకు ఫలితాల నివేదికను రూపొందించింది. వైఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఆర్థికంగా ప్రగతి సాధించడమే కాకుండా సామాజిక సంక్షేమ పథకాలు అమలూ బాగా జరిగిందని.. తద్వారా పేదరికం శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
‘ఆయన మృతి అనంతరం వివిధ రంగాల్లో అభివృద్ధి కుంటుపడింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో అనిశ్చితి పెరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ సుస్థిరతపై తీవ్ర ప్రభావాన్ని చూపింది’ అని తెలిపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సంస్కరణలను, విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడం రాజకీయంగా సాధ్యం కాదని కుండబద్దలు కొట్టింది. ‘దివంగత నేత హయాంలో రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమైంది. ఆర్థిక సంస్కరణలు కొంతవరకు అమలయ్యాయి. డెలివరీ మెకానిజాన్ని (పథకాలను అర్హులకు చేరవేసే వ్యవస్థ) కూడా పటిష్టం చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలను చేపట్టే స్థితిలో లేదు’ అని తేల్చి చెప్పింది.
నివేదికలోని ముఖ్యాంశాలివీ..
*వైఎస్ హయాంలో ప్రైవేటు రంగంలో గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మంచి అభివృద్ధి సాధించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 20.15 లక్షల యువతకు 2006-07, 2008-09 మధ్య కాలంలో వివిధ రంగాల్లో స్వల్పకాలిక శిక్షణ ఇచ్చారు. ఇందులో 1.75 లక్షల మంది యువతకు వంద ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించారు. ఆయన మరణం తర్వాత యువతకు శిక్షణ, ఉద్యోగాలు కల్పన కార్యక్రమం గణనీయంగా తగ్గిపోయింది.
*ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల కొనుగోళ్ల వ్యహారాల్లో అక్రమాలు, అవినీతిని నివారించేందుకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ బిల్లును తీసుకువచ్చేందుకు వైఎస్ అంగీకరించారు. ఆయన హయాంలోనే ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైంది. ఆయన అనంతరం గతేడాది అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా.. ఆమోదించలేదు. వైఎస్సార్ అకాల మృతితో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉద్యమం నేపథ్యంలో ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించలేని పరిస్థితిలో ప్రభుత్వముంది. ఈ బిల్లును ఆమోదించడం ప్రభుత్వానికి పెద్ద సవాలే.
*సామాజిక పింఛన్లను సంతృప్త (శ్యాచురేషన్) స్థాయికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 70.2 లక్షల సామాజిక పింఛన్లున్నాయి. సామాజిక పింఛన్లను 40.8 లక్షలకు పరిమితం చేయాలన్న ప్రపంచ బ్యాంకు సూచనలను వైఎస్ సర్కారు పట్టించుకోలేదు. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసింది.
*పేదలకు భూములను అందుబాటులోకి తేవడంలోనూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించింది. ఆరు దశల్లో 10.4 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. ఇందులో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే చెందాయి. ఆ భూములను ఉత్పాద కతగా తీర్చిదిద్దేందుకు ఉపాధి హామీ పథకాన్ని దీనికి జత చేశారు.
*చంద్రబాబు హయాంలో సంస్కరణల జాబితాలో చేర్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ సామాజిక బాధ్యత పేరుతో వైఎస్ సర్కారు వాటిని మినహాయించింది. రాష్ట్ర సహకార బ్యాంకు, ఎస్సీ, బీసీ సహకార ఆర్థిక సంస్థలు, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, ఆర్టీసీ, సింగరేణి కాలరీస్ వంటి సంస్థలను కొనసాగించాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. వీటిని ఆర్థికంగా మరింత పటిష్టపరుస్తామని ఆయన సర్కారు స్పష్టం చేసింది.
*గత కొన్నేళ్లలో రాష్ట్ర ద్రవ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. రెవెన్యూ రాబడి బాగా పెరగడంతో 2005-06 ఆర్థిక సంవత్సరంలో 12.9 శాతం వృద్ధి సాధించింది. అలాగే 2010-11 ఆర్థిక సంవత్సరంలో 15.5 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండు క్లిష్ట సమస్యలున్నాయి. రెవెన్యూ రాబడి, వృద్ధితోపాటు సబ్సిడీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విద్యుత్ సబ్సిడీ భారం భరించలేని స్థాయికి చేరుకుంది. మరింత సబ్సిడీ పెరగకుండా టార్గెట్ గ్రూపునకే(పేదలకే పరిమితం చేయాలంటూ) సబ్సిడీని పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలి. అయితే, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సబ్సిడీ సంస్కరణలు అమలు చేయడం కష్టమే.