Post date: May 06, 2011 12:21:35 PM
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కడప ప్రజల ప్రేమాభిమానాలను వేలానికి పెట్టారు
హైదరాబాద్ నుంచి మంత్రులు మూటలకు మూటలు తెచ్చి పంచుతున్నారు
కడప ప్రజలు తమ ఓట్లతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి షాకివ్వాలని, డబ్బులతో ప్రజల ప్రేమాభిమానాలను కొనలేమని కాంగ్రెస్, టీడీపీ పెద్దలకు తెలిసి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ సొంతంగా ఏమీ చేయలేదని, పార్టీ చెబితేనే చేశారని కాంగ్రెస్ పెద్దలు ఓ వైపు చెబుతూనే.. మరోవైపు టీడీపీతో కుమ్మక్కై మహానేతపై హౌస్ కమిటీ వేశారని తీవ్రంగా విమర్శించారు. గురువారం ఆయన కడప పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. యువనేత వెంట మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఉదయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. రోడ్‌షోలో జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కడప ప్రజల ప్రేమాభిమానాలను వేలానికి పెట్టారు. *500, *1000 చొప్పున ఓటును కొనాలని ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ, హైద రాబాద్ నుంచి మంత్రులు కార్లలో డబ్బులు మూటలకు మూటలు తెచ్చి కడపలో పంచి పెడుతున్నారు. వారు ఎంత నీచరాజకీయానికి ఒడిగట్టినా కడప ప్రజల గుండెల్లో ఆ దేవుడు పుట్టించిన ప్రేమకు మాత్రం వెలకట్టలేరు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా నాకు హంగు, ఆర్భాటాలు లేవు. అధికారం కూడా లేదు. కులాల వారీగా విడగొట్టి లేని ప్రేమను ఒలకబోయటం నాకు రాదు. నాకు తెలిసిందల్లా దివంగత మహానేతలా పేదవారి ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే తపన మాత్రమే. ఇంతకాలం ప్రజల్ని పట్టించుకోని పెద్దలంతా ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తూ మాయమాటలు చెప్పి, నోట్ల కట్టలు చేతిలో పెడుతున్నారు. ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. డబ్బులు తీసుకున్నా సరే.. మీ మనస్సాక్షి చెప్పినట్లే ఓట్లు వేయండి. మీరు వేసిన ఓట్లకు సోనియాగాంధీ షాక్ తినాలి. రాజకీయం అంటే డబ్బుతో కొనుగోలు చేసేది కాదని, లెక్కిచ్చి(డ బ్బిచ్చి) ఏ ఒక్క వ్యక్తి అభిమానాన్నీ కొనలేమని ఈ పెద్దలకు తెలిసి రావాలి. వైఎస్ఆర్ రెక్కల కష్టం మీద కాంగ్రెస్ పార్టీ గట్టెక్కింది. రాష్ట్రంలోను, కేంద్రంలోను చక్రం తిప్పుతున్న సోనియాగాంధీకి ఆ స్థాయి దక్కడం కూడా దివంగత నేత వైఎస్ఆర్ పుణ్యమే’.
ఎల్లో మీడియా, బాబు, శనిగ్రహం సోనియాల కుట్ర
‘ఒక తల్లి, ఒక కొడుకును కట్టడి చేయడానికి ఓవైపు ‘ఈనాడు’ రామోజీరావు, మరోవైపు ఆంధ్రజ్యోతి పత్రిక.. ఇంకోవైపు టీవీ-9 వారికి తోడుగా చంద్రబాబు, మరో పెద్ద శనిగ్రహం సోనియాగాంధీ కలసి కుట్రలు చేస్తున్నారు. ముస్లిం సోదరులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయడానికి అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. అబద్ధపు ప్రసారాలు చేస్తున్నారు. ఒక్క అబద్ధాన్ని నిజమని చెప్పడానికి ‘పాడిందే పాటరా.. ’అన్నట్లు పదేపదే చెబుతున్నారు. రాజకీయ అవసరాల కోసమే ఎల్లో మీడియా ఇలాంటి సమాచారాన్ని ప్రజలకు వడ్డిస్తోంది. ఎవరెన్ని చేసినా ఆ దేవుని దయ, నాన్నను ప్రేమించే ప్రతి గుండె ఆశీస్సులు నాకు, నా తల్లి విజయమ్మకు రక్షణ కవచాలుగా ఉన్నాయి. కడప జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలను డబ్బుతో కొనగలిగే వారు ఇంకా పుట్టలేదు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు, ఆయన విధానాలను కొనసాగించేందుకు నా తల్లి బయటకు వచ్చి ఎండను లెక్కచేయకుండా గడప గడప తిరుగుతోంది. నా తల్లిని, నన్ను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి’.