Post date: Apr 28, 2011 5:58:30 AM
బైండోవర్ కేసులేఆయుధంగా పోలీసుల బెదిరింపులు
దేశంలో ముందెన్నడూ లేనంతగా కడపలో 9,802 మంది బైండోవర్
వారిలో 90 శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులే!
బైండోవరైన వారిలో మూడొంతుల మందిపై ఇంతవరకు ఏ కేసూ లేదు
దేశంలో ఎక్కడా లేనంతగా కడపలో 9802 మంది బైండోవర్
వారిలో 90 శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులే!
బైండోవరైన వారిలో మూడొంతుల మందిపై ఇంతవరకు ఏ కేసూ లేదు
కనీసం ధర్నాలు, నిరసన ప్రదర్శనల్లో పాలుపంచుకున్నవారు కూడా కాదు
కడప కేసులు చూసి విస్తుపోతున్న సీనియర్ పోలీసు అధికారులు
అక్కడ నేరాలు.. ఘోరాలేం జరిగిపోలేదు.. పోనీ శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించనూలేదు.. కనీసం చిన్నాచితకా గొడవలూ లేవు.. అయినా అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. ఏ క్షణాన ఏ పోలీసు వచ్చి కుళ్లబొడుస్తాడో.. స్టేషన్‌కు లాక్కెళ్లిపోతాడోనన్న ఆలోచన వారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్‌ను అభిమానించే ఏ గ్రామానికెళ్లినా ఇదే భీతావహ దృశ్యం. దేశ చరిత్ర మొత్తంలోనే ఇంతకుముందెన్నడూ లేనంతలా 9,802 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడమే.. ఇక్కడ ఖాకీ టెరర్క్రు నిదర్శనం!! ఈ కేసుల సంఖ్య స్వయానా ఎన్నికల సంఘమే మంగళవారం వెల్లడించింది. కేసులు నమోదైన వారిలో 90 శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే!! దీన్ని బట్టి చూస్తుంటే.. ఉప ఎన్నికల్లో జగన్‌కు జై కొడితే.. తర్వాత నీకు జైలేనని బెదిరించడానికే పోలీసులు ఈ బైండోవర్ కేసులునమోదు చేస్తున్నారన్నది విస్పష్టమవుతోంది.
ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడింది మొదలు కడప నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. ఏ కేసులూ లేకపోయినా పోలీసు స్టేషన్లకు పిలిపించి హెచ్చరికలు జారీ చేయడం, బూతులు తిట్టడం ప్రారంభించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో దాదాపు 10వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. వీరిలో మూడొంతుల మంది ఇప్పటిదాకా ఎలాంటి కేసులూ ఎదుర్కోలేదు. నేరాలకు పాల్పడిన వారు కాదు, హత్య, హత్యాయత్నం వంటి కేసుల్లో నిందితులు అంతకన్నా కాదు. అంతెందుకు ధర్నాలు, నిరసన ప్రదర్శనల్లోనూ పాలు పంచుకోలేదు. వీరు చేసిన తప్పల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి వైఎస్ జగన్‌కు జై కొట్టడమే! ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలకు విఘాతం కలుగకూడదని ప్రభుత్వం భావిస్తే.. గతంలో దౌర్జన్యాలకు పాల్పడిన, బాంబులు విసిరిన, వేటకొడవళ్లతో దాడులకు దిగిన వారిని బైండోవర్ చేయొచ్చు.. ఇక్కడ పరిస్థితి మాత్రం జగన్‌కు మద్దతివ్వడమే నేరమన్నట్లుంది.
మున్నెన్నడూ లేని రీతిలో
దేశంలో ముందెన్నడూ ఏ లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఇంత భారీ సంఖ్యలో బైండోవర్ కేసులు నమోదు కాలేదని పోలీసు ఉన్నతాధికారులే చెపుతున్నారు. ‘అక్కడ నమోదవుతున్న బైండోవర్ కేసులను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. నిన్న సాయంత్రం దాకా బైండోవర్ కేసుల సంఖ్య 9,800గా ఉంది. పోలింగ్ నాటికి మరెంత మందిని బైండోవర్ చేస్తారో’ అని ఓ సీనియర్ పోలీసు అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ‘నా 29 సంవత్సరాల సర్వీసులో ఇలాంటి అనుభవం చూడలేదు. ఐదు సాధారణ ఎన్నికలు, లెక్కలేనన్ని ఉప ఎన్నికల నిర్వహణల్లో పాలు పంచుకున్నాను. కేవలం పోలింగ్‌కు వారం రోజుల ముందు నుంచి మాత్రమే కేసుల్లో ఉన్నవారిని గుర్తించి.. అదీ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం, దొమ్మీ చేయడం, బాంబులు విసరడం వంటి కేసులు ఉంటే.. వారిని బైండోవర్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతోనే బైండోవర్లు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు’ అని మూడు జిల్లాల్లో పోలీసు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపురం నియోజకవర్గంలో 70 సంవత్సరాల పైబడిన ఓ వృద్ధురాలిని సైతం వదిలిపెట్టకుండా బైండోవర్ చేయడాన్ని ఆ అధికారి ఈ సందర్భంగా ప్రస్తావించారు. తీవ్రవాదులు లేదా నక్సలైట్ల కార్యకలాపాలు మచ్చుకైనా లేని జిల్లాలో వేల సంఖ్యలో బైండోవర్లు చేయడాన్ని ప్రైవేట్ సంభాషణల్లో పోలీసు అధికారులే తప్పుపడుతున్నారు. నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు చేయలేదని వారంటున్నారు.
నాడు కరీంనగర్లో నమోదైంది వెయ్యిలోపే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నినాదంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు సార్లు రాజీనామా చేసినపుడు జరిగిన ఉప ఎన్నికల్లో నమోదైన బైండోవర్ కేసుల సంఖ్య వెయ్యి లోపే. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బైండోవర్ కేసులు నమోదైన వారంతా నక్సలైట్ల ఉద్యమంలో పాల్గొన్నవారో లేదా వారితో సంబంధాలు ఉన్నవారేనని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. రెండోసారి కేసీఆర్ రాజీనామా అనంతరం పోటీ ప్రతిష్టాత్మకంగా జరిగినప్పుడు కూడా బైండోవర్ కేసుల సంఖ్య వెయ్యి లోపే. ఒకప్పుడు నక్సలైట్ల ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న జిల్లాలో పరిస్థితి ఈ రకంగా ఉంటే... కడపలో మాత్రం బైండోవర్ల సంఖ్య పదివేలకు దగ్గరలో ఉండటం గమనార్హం.
వారిపై కేసులున్నా.. లేనట్లే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగితేనే బైండోవర్ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న ఇతర పార్టీల వారి జోలికి మాత్రం వెళ్లడం లేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తలు, నేతలుగా చెలామణి అవుతున్న ఎందరో దొమ్మీకి పాల్పడటం, బాంబులు విసరడం, వేట కొడవళ్లతో దాడులు చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ అధికారులను కొట్టడం వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోలీసు అధికారి ఒకరు అందించిన సమాచారం ప్రకారం జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న దాదాపు 630 మందిని ఇప్పటిదాకా బైండోవర్ చేయనేలేదు. వీరిలో అధికంగా తెలుగుదేశం కార్యకర్తలే. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వీరిపై పోలీసులు ఈగ వాలనీయడం లేదు. మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల పరిధిలో తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తలనూ పోలీసులు పట్టించుకోలేదు. డబ్బులు పంపిణీ చేస్తున్నా.. వారిని కట్టడి చేయడం లేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 800 మంది కార్యకర్తలను బైండోవర్ చేయకపోగా వారిలో 48 మందికి గన్‌మెన్ సౌకర్యం కల్పించారు. మరోవైపు ఈ నాలుగు నియోజకవర్గాల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 3,800 మందిని బైండోవర్ చేశారు.
పులివెందులలో పోలీసుల అరాచకం
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పోలీసుల అరాచకాలు మితిమీరిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీకి మద్దతిచ్చేవారిపై అన్యాయంగా బైండోవర్ కేసులు నమోదు చేయడమే కాదు...రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోతున్నారు. పులివెందులలో అక్కడి అధికారుల అత్యుత్సాహం తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్‌లో సీనియర్ అధికారి ఒకరు అన్నారు. పై అధికారుల పేర్లు చెపుతూ స్థానిక అధికారులు అరాచకాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గానే పరిగణిస్తున్నామని వెల్లడించారు. బద్వేలు నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్లలో ఏ కేసులూ లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను బైండోవర్ చేసిన అధికారులు, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను మాత్రం కావాలనే స్వేచ్ఛగా వదిలేశారు. అడపా దడపా కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలపైన బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నా.. వారి స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకమూ లేకుండా చూసుకుంటున్నారు పోలీసులు! దీన్ని బట్టి జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు లోపాయకారీగా సహకరించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.