Post date: Apr 15, 2011 6:7:56 AM
జాతి హృదయ స్పందన స్పష్టంగా వినిపిస్తున్నా...
యూపీఏ సర్కారు వెనకడుగు వేస్తోంది
హజారే డిమాండ్లను కేంద్రం అంగీకరించాలి
జన లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హజారే డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అన్నా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకముందు శుక్రవారం జగన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘రాజకీయ అవినీతిపై అంకుశంలా ఉపయోగపడుతుందనుకున్న లోక్‌పాల్ బిల్లును నీరుగార్చే యత్నాలను చూసి ఆగ్రహించిన గాంధేయవాది హజారే నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో నిరశన దీక్ష చేస్తున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పౌర సమాజం, ముఖ్యంగా యువత ఆయనకు మద్దతుగా కదం తొక్కుతోంది. జాతి హృదయ స్పందన ఇంత స్పష్టంగా వినిపిస్తున్నా యూపీఏ ప్రభుత్వం హజారే డిమాండ్లను అంగీకరించటంలో వెనకడుగు వేస్తోంది. అవినీతిని అరికట్టడమే తమ లక్ష్యమని చెప్పుకుంటున్న యూపీఏ సర్కారు.. జన లోక్‌పాల్ పేరిట పౌర సమాజం తెచ్చిన ప్రత్యామ్నాయ బిల్లును ఎందుకు కాదంటోందో అర్థం కాని విషయం. ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హజారే సాగిస్తున్న దీక్షకు నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను’ అని జగన్ పేర్కొన్నారు. హజారే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిన అనంతరం శుక్రవారం రాత్రి ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. లోక్‌పాల్ బిల్లుపై ప్రభుత్వాన్ని కదిలించిన హజారేకు అభినందనలు తెలిపారు.