Post date: Apr 29, 2011 5:22:57 AM
బాబు, రామోజీ, రాధాకృష్ణ, రవిప్రకాశ్ రాష్ట్రానికి శనిలా పట్టారు
చెప్పిన అబద్ధాన్నే చెప్పి విషం కక్కుతున్నారు
ప్రజాబలం లేని బీజేపీతో నేనెందుకు పొత్తు పెట్టుకుంటాను
కమలాపురం రోడ్‌షోలో వైఎస్ జగన్
‘నేను బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోనని ఒకటి, రెండు, మూడు, నాలుగు... వందసార్లు చెప్పినా ‘ఈనాడు’, తోకపత్రిక ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నాయి. వీటికి టీవీ-9 నడుపుతున్న రవిప్రకాశ్ కూడా జత కలిశారు. ఈ మీడియా వక్రీకరణ కుట్రదారుల పన్నాగంలో భాగమే’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన గురువారం కమలాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. చెన్నూరు, కమలాపురం మండల కేంద్రాల్లో భారీఎత్తున హాజరైన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఈనాడు అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ-9 రవిప్రకాశ్ రాష్ట్రానికి శనిలా పట్టారని, వీరికి కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తోడయ్యారని విమర్శించారు. ఈ పచ్చ పత్రికలు చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇదంతా ప్రతిపక్షం,పాలకపక్షం కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింలను దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో బీజేపీకి గతఎన్నికల్లో కేవలం 1800 ఓట్లు మాత్రమే వచ్చాయని, అలాంటి పార్టీతో తాను ఎలా పొత్తు పెట్టుకుంటానని, పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి దుష్ర్పచారాన్ని ప్రజలు, ముస్లిం సోదరులు ఎప్పటికప్పుడు గమని స్తూనే ఉన్నారన్నారు.
‘నష్టమైనా, కష్టమైనా ఇచ్చిన మాట మీద నిలబడాలని, మాట ఇస్తే మడమ తిప్పకూడదని దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. కడపలో జరుగుతున్న ఈ ఉపఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య కావని, ఇది మహా యుద్ధమేనని అన్నారు. కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు జిల్లాలో తిష్టవేసి కులాల వారీగా ప్రజలను విడగొట్టి డబ్బులు పంచుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పోలీసులతో బైండోవర్ కేసులు పెట్టిస్తున్నారని, వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా దివంగత మహా నేతను ప్రేమించే ప్రతి హృదయం ఆశీస్సులు ఉన్నంతకాలం తనను, తన తల్లి విజయమ్మను ఏమీ చేయలేరని ఉద్వేగభరితంగా చెప్పారు. ఫ్యాను గుర్తుకు ఓటేసి తమను ఆశీర్వదించాలని కోరారు.