Post date: Feb 11, 2011 1:36:33 PM
అబ్బాయ్ ప్రసాదూ, నువ్వు క్షేమమని తలుస్తా.. రోజూ టీవీల్లో చూస్తున్నా. నువ్వు ఏమాత్రం మారలేదు. అమ్మ బాగుందని అనుకుంటున్నా.. ఆవిడ గొడవ ఆవిడది..నీ గొడవ నీది. ! అక్కాబావా బాగున్నారని అనుకుంటున్నా..! పెద్దవాడ్ని అయిపోయా.. మీ నాన్నే ఉండుంటే ఇంకోరకంగా ఉండేది. నీకు మొన్నే నలభై నిండుంటాయి. ఎన్నాళ్ళిలా? పెళ్ళెప్పుడు చేసుకుంటావ్ ? మీ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలిసినవాడిగా కొన్ని మాటలు చెప్పడానికే ఈ ఉత్తరం రాస్తున్నా ...కాస్త ఓపిక చేసుకుని ఈ పెద్దోడి మాటలు మనసులో పెట్టుకో! మీ తాతకు ఎప్పుడూ ఒక దిగులుండేది..! మీ. నానమ్మ 'ఇందిర' కూడా పెళ్లి చేసుకుంటే ఆయన్నే(ఫిరోజ్ గాంధీ) చేసుకుంటానని ఒకటే మంకుపట్టు పట్టింది. చివరకు ఇష్టం లేకపోయినా సరే అన్నాడు మీ ముత్తాత. ఆపైన మీ నాయన్ని చదువుకోమని విదేశాలకు పంపితే ప్రేమాదోమా అంటూ 'పెళ్లి చేసుకుంటే మీ అమ్మనే(సోనియానే) చేసుకుంటానని పట్టుబట్టాడు.ఎస్ ! మీ బాబాయి(సంజయ్) మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా? ఒక పంజాబీ అమ్మాయిని(మేనకని) పెళ్లి చేసుకుంటానని మీ నానమ్మతో ఒకటే గొడవ. చివరకు అతను కోరుకున్న అమ్మాయినే చేసుకున్నాడు. మీ నాన్న..మీ బాబాయిలలో ఒక్కరైనా ఏ బ్రాహ్మలమ్మయిని చేసుకుని వుంటే బాగుందేదని అంటారు కానీ అలా జరగకపోవడం కూడా ఒకందుకు మంచిదే అయిందిలే! మీ ఫ్యామిలీ త్యాగాలన్నీ ఒక ఎత్తయితే...మీ కుటుంబంలో ఒక్కకరూ ఒక్కో భిన్న జాతి నుంచీ...మతం నుంచీ ...ఆ మాటకొస్తే ఒక్కో కులం నుంచీ వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని ఒక కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పిన అభ్యుదయ చరిత్ర మీది.
కానీ నువ్వొక్కడివే నాకు అర్ధం కావడంలేదు. మీ ఇంట్లో తరతరాలుగా అందరూ ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకుని కాపురాలు చేసి రాజ్యాలేలితే నువ్వేంటి ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి మాటే ఎత్తవు? ఆ మధ్య నువ్వు కూడా నీ స్పైన్ గర్ల్ ఫ్రెండ్ వెరోనిచా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావని పేపర్లలో చూసి కొంచెం కంగారుపడ్డాకానీ 'సర్లే ఏదో ఒకటి...ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావని' సరిపెట్టుకున్నా! ఇప్పుడా ఊసేలేదంటున్నారు. ఆ అమ్మాయిని నువ్వు వద్దనుకున్నావా లేక ఇంకో విదేశీ అమ్మాయి అని మీ అమ్మావాళ్ళు వద్ధన్నారా? ఒకప్పుడు నీలాంటి పెళ్ళికాని బ్రహ్మచారుల్నిబెండకాయల్తో పోల్చేవాళ్ళం. .ఇప్పుడు నువ్వు ఆ స్టేజీ కూడా దాటిపోతున్న దాఖలాలు. ఇంకో రెండేళ్ళుపోతే నీకు మళ్ళీ ఎలక్షన్ల గొడవ మొదలవుతుంది కదా... ఆ తరువాత నువ్వే ప్రధానమంత్రివని అనుకుంటున్నారుగా! అబ్బాయ్..ప్రసాదూ..! ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. మీ అమ్మ నీ పెళ్లి విషయంలో బాగా బెంగెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
నీ పెళ్లి నీ కుటుంబంలో అంత పెద్ద సమస్యగా మారింది. నీకు ఇప్పుడా గర్ల్ ఫ్రెండు గొడవలే లేకపోతే పాపం మీ అమ్మా..అక్కా కలిసి ఈపాటికి నీకు మ్యాచ్ ఫిక్సింగు చేసి ఆ మూడుముల్లూ వేయించేవాళ్ళు కదా? పోనీ ...నీ మనసులో ఇంకెవరైనా వున్నారా? ఒకవేళ వాళ్లకు చెప్పడం నీకు ఇబ్బందిగా వుంటే నాకు చెప్పు. నువ్వు రెప్పతెరిచి మూసేలోగా అదే అమ్మాయితో మ్యారేజీ ఫిక్స్ చేయిస్తా..! అయినా వయసు మంచిది కాదన్నారు. అందుకే ఇందాకే చెప్పాను..ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని..! అందుకే మీ పిన్ని( మేనక) మీ తమ్ముడికి పెళ్లి ఫిక్స్ చేసేసింది. వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని నీకు తెలుసుగా! ఎంతయినా నీ వరస తమ్ముడి పెళ్లి నీకంటే ముందు జరిగిపోతే నలుగురూ నవ్విపోరూ?
ఇదిగో అబ్బాయ్..! చివరిగా ఒక్క మాట..! నువ్వు పెళ్లి చేసుకోకుండా ప్రధాన మంత్రి అయితే ఊరుకునేది లేదు. మన దేశానికి ఆ మధ్య పెళ్ళికాని ఒక ప్రెసిడెంటూ(కలాం) ఇంకో ప్రధానమంత్రీ (వాజపేయి) ఏలినట్లు నువ్వుకూడా అదే పనిచేస్తే అస్సలు బాగుండదు. నా మాట విను.. ఇట్లా పెళ్లి చేసుకోకుండా ఊళ్ళుపూళ్ళూ పట్టుకుని తిరిగితే లేనిపోని సమస్యలోస్తాయి.ఇప్పటికే నీ గురించి బోలెడు గుసగుసలాడుతున్నారు. ఎవ్వరికీ మంచిదికాదు..! ఇక నీ ఇష్టం. ఆశీస్సులతో.. మీ పెళ్ళికాని మావయ్య
(సీనియర్ ప్రసాదు)