Post date: May 07, 2011 6:41:42 AM
మంత్రులైనా, మరెవరైనా సహించేది లేదు.. జగన్ హెచ్చరిక
సాక్షాత్తూ మంత్రే దాడులకు తెగబడి ప్రజలను భయపెడుతున్నారు
తుడుములదిన్నెలో మంత్రి డీఎల్ బాధితులకు జగన్ పరామర్శ
దళితులపై దాడులు చేస్తే.. మంత్రులైనా, మరెవరైనా సరే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలతో ఎండగడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్‌సభ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. అర్ధరాత్రి వేళ వచ్చిన మంత్రి డీఎల్ అనుచరులు గ్రామంపై పడి మహిళలు, వృద్ధులపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మైదుకూరు నియోజకవర్గం తుడుములదిన్నె దళితవాడలో డీఎల్ అనుచరుల దాడిలో గాయపడిన బాధితులను జగన్ శుక్రవారం పరామర్శించారు.
డీఎల్‌కు ఏజెంటూ దొరకని పరిస్థితి: ఈ గ్రామ ప్రజలందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారు. కడప కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న డీఎల్.. 30 ఏళ్లుగా ఈ గ్రామంలో హవా నడిపించినప్పటికీ.. ప్రస్తుతం ఈ గ్రామంలో ఆయనకు కనీసం ఏజెంటు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పైగా ఇది ఆయన స్వగ్రామం సుంకేశులకుపొరుగున ఉన్న పల్లె. ఒక్కసారిగా ఈ పల్లె తన చేయి జారిపోవటాన్ని జీర్ణించుకోలేని మంత్రి బుధవారం అర్ధరాత్రి 10 కార్లలో 50 మంది అనుచరులతో వచ్చి ఊరిపై విరుచుకుపడ్డారు. మంత్రి వస్తున్నాడన్న సమాచారాన్ని ముందే పసిగట్టిన గ్రామంలోని పురుషులు ఇళ్లు వదిలి పరారయ్యారు. దీంతో రెచ్చిపోయిన ఆయన తన అనుచరులతో కలిసి వీరంగం వేశారు. ఇంటి తలుపులు పగులగొట్టి మహిళలను, వృద్ధులను బయటికి ఈడ్చుకొచ్చారు. తనకు ఓటు వేయకపోతే తన గ్రామం మీదుగా వె ళ్లనివ్వనని, ఎన్నికల తరువాత అంతు చూస్తానంటూ బెదిరిస్తూ వారిపై దాడి చేశారు. ఆ దేవుడే బుద్ధి చెబుతాడు: పత్రికల ద్వారా దాడి సమాచారం తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గ్రామానికి చేరుకొని ప్రతి బాధిత కుటుంబాన్నీ పరామర్శించారు. మీకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘సాక్షాత్తూ మంత్రిగారే గ్రామంపై దాడులకు తెగబడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. అర్ధరాత్రి వేళ వచ్చిన మంత్రి, ఆయన అనుచరులు ఊరిపై పడ్డారు. ఆయన రాకను గమనించిన పురుషులు భయపడి ఊరు విడిచి వెళ్లిపోయారు. మంత్రి అనుచరులు ఇంట్లో ఉన్న మహిళలను, వృద్ధులను బయటికి లాగి దాడి చేశారు. చంపుతామని బెదిరిస్తూ, బండబూతులు తిడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేశారు. దళితులపై జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ జీవించే హక్కు దేవుడు కల్పించాడు. అధికారంతో చేస్తున్న అరాచకాలను దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడే వారికి తగిన బుద్ధి చెప్తాడు. మంత్రులైనా... మరెవరైనా దళితులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలతో ఎండగడతాం. ఒక్క తుడుములదిన్నె గ్రామం మాత్రమే కాదు.. నియోజకవర్గంలో ఎక్కడైనా అన్యాయంగా దాడులకు పాల్పడితే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి కాని, మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డికి గాని ఒక్క ఫోన్ కొడితే చాలు వెంటనే వచ్చి మీకు తోడు నిలబడతారు’’ అని అన్నారు.