Post date: Apr 24, 2012 10:8:28 AM
సర్కారుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బుట్టాయగూడెం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తుండడంతో ఆయా నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున భిక్షం వేసినట్లుగా ఇస్తోందన్నారు. ప్రతి పేదవాడికీ ఓ గూడు కట్టించాలని స్వప్నాన్ని చూసిన దివంగత నేత రాజశేఖరరెడ్డి తాను బతికున్నంతకాలం ఆ మేరకు పేదలకు ఇళ్లు కట్టించారన్నారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వం మహానేత స్వప్నాన్ని తెరమరుగు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న జగన్మోహన్రెడ్డి సోమవారం బుట్టాయగూడెం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఉదయం దుద్దుకూరు నుంచి బయలుదేరి కొమరవరం, కుమ్మరికుంట, రాచూరు, కాపవరం, నందాపురం, కె.బొత్తప్పగూడెం, కోయరాజమండ్రి, మెట్టగూడెం, కండ్రికగూడెం, కె.అంకంపాలెం, దొరమామిడి, బుట్టాయగూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలనుద్దేంచి మాట్లాడారు.
ఏ రైతు పరిస్థితి చూసినా
‘రాజశేఖరరెడ్డి సువర్ణయుగంలో పొగాకు ధర కేజీ రూ.120 పలికింది. ఇవాళ అదే పొగాకు ధర హైగ్రేడ్ అయితే రూ.110, లోగ్రేడ్ అయితే రూ.40 కూడా రావడంలేదు. సగటున 60, 70 రూపాయలు కూడా ధర రావడం లేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో పొగాకు రైతు సాగు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు’ అని జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. పత్తి వేసుకున్న రైతు నుంచి చెరకు రైతు దాకా అందరి పరిస్థితీ ఇలాగే ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో రైతన్నా ఎలా ఉన్నావని అడిగితే ఇవాళ ఉన్న స్థితిలో వ్యవసాయం చేసే కన్నా ఉరి వేసుకుంటే మంచిదని చెబుతున్నాడని ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. రైతు కూలీల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉందన్నారు. చదువుకుంటున్న పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉందని, రంగారెడ్డి జిల్లాలో వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజు రీయింబర్స్‌మెంటు అందక, ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు, రైతులకు అండగా బాలరాజు సహా 17 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి తమ పదవులను సైతం వదులుకున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల్లో పేదలు, రైతుల బాధలు పాలకులకు తెలిసొచ్చేలా ఓటేయాలని ప్రజలను కోరారు.
గంటగంటకూ కరెంటు పోతుందయ్యా
ఉదయం నుంచి రాత్రి 9.30 గంటల వరకూ గిరిజన గ్రామాల్లో అలుపులేకుండా తిరిగిన జగన్మోహన్రెడ్డికి ప్రతిచోటా రైతులు, మహిళలు, వృద్ధులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. దాదాపు ప్రతి చోటా జనం కరెంటు గురించి ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలకు నిన్న సాయంత్రం నీళ్లు పెట్టామని, ఇప్పటివరకూ నీళ్లు పెట్టే పరిస్థితి లేదని మెట్టగూడెం సమీపంలో గొర్రెల కాపరులు తమ ఇబ్బందిని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. చెరువులు ఎండిపోయాయని, బోరు నీరు పెడదామంటే కరెంటు ఉండడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ఆర్పాలెం వద్ద రోడ్డుపై రైతు సూర్యనారాయణ జగన్‌ను కలిసి గంటగంటకూ కరెంటు పోతోందని, తాము వేసుకున్న పంటలన్నీ ఎండిపోతున్నాయని మొరపెట్టుకున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఈ కష్టాలన్నీ పోతాయని జగన్ ధైర్యం చెప్పారు.
సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే: కాపవరంలో పామాయి ల్ రైతులు జగన్‌ను కలిసి ఆరు రాష్ట్రాల్లో ఈ పంటకు కనీస మద్దతు ధర ఇస్తుంటే ఒక్క మన రాష్ట్రంలోనే మద్దతు లేకుండాపోయిందని వాపోయారు. దీనిపై జగన్ స్పందిస్తూ సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే ఈ సమస్య రాదన్నా అని ఊరడించారు. అదే గ్రామంలో వర్జీనియా పొగాకు బ్యారన్‌లోకి వెళ్లి గ్రేడింగ్ విధానాన్ని పరిశీలించిన జగన్.. ధర ఎలా ఉందమ్మా అని అడిగి తెలుసుకున్నారు. కుమ్మరికుంటలో మహిళలు, రైతులు ఆయన్ను కలిసి.. ‘జీవనధార బోర్లకు దరఖాస్తులు చేసుకుని మా వాటా రూ.45 వేలు కట్టినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడంలేదన్నా..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరిద్దామన్నా అని ఆయన వారికి ధైర్యం చెప్పి ముందుకు కదిలారు. నూతిరామన్నపాలెంలో మల్లిన లక్ష్మి అనే మహిళ జగన్‌ను తనఇంటికి తీసుకెళ్లి అప్యాయంగా పెరుగన్నం తినిపించింది.