Post date: Aug 23, 2011 6:15:35 AM
దమ్ముంటే ఎన్నికలకు పోదాం.. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కవు.. కడప ఉపఎన్నికల ఫలితాలు పునరావృతం కాకతప్పదని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు రేణిగుంట నుంచి బస్సులో ఇడుపులపాయకు వెళ్తూ.. మార్గమధ్యంలో సోమవారం రాత్రి రాజంపేట వైఎస్సార్ సర్కిల్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం జరిగిన బహిరంగసభలో సురేఖ మాట్లాడుతూ.. ఎన్నికల్లో తామంతా వైఎస్సార్ బొమ్మతో పోటీ చేస్తామని, కాంగ్రెస్ వారు వైఎస్సార్ బొమ్మలేకుండా పోటీ చేయాలని సవాల్ విసిరారు. వైఎస్సార్‌పై అవినీతి ముద్ర వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్నిందని దుయ్యబట్టారు. ఎఫ్ఐఆర్లో మహానేత పేరు పెట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారని, ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు సరైన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.
వైఎస్సార్ ఆశీస్సులతో గెలుపొందిన వారు రాజీనామా చేసి, జగన్మోహనరెడ్డికి అండగా నిలవాలని, ధర్మయుద్ధంలో తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. స్పీకర్ తమ రాజీనామాలు ఆమోదించకపోతే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పారు. రాజంపేట ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ వల్ల ఎమ్మెల్యే అయ్యానని, ఆయనకే అవమానం జరుగుతుంటే జీర్ణించుకోలేకపోయానని చెప్పారు.