Post date: Apr 15, 2011 5:56:21 AM
కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జగన్మోహన్రెడ్డి, విజయమ్మకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ(ఐయూఎంఎల్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు కరీముల్లా షేక్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మైనార్టీలు ముందడుగు వేయడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఫలితంగా ముస్లింలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత బాటలో నడుస్తున్న జగన్, విజయమ్మకు ముస్లింలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు లేని భారీ మెజారిటీతో వారిని గెలిపించి వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవాలని ముస్లిం మైనార్టీలకు విజ్ఞప్తి చేశారు. జగన్, విజయమ్మకు మద్దతుగా ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ముస్లిం లీగ్ సమాయత్తమవుతోందని తెలిపారు.