Post date: Apr 21, 2011 5:48:42 AM
తమ పార్టీ ఎన్నికల గుర్తు గురువారం సాయంత్రానికి రానుందని, గుర్తు వచ్చిన వెంటనే యువత, అభిమానులు, కార్యకర్తలు ఎన్నికల గుర్తును ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంటు అభ్యర్థి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన బుధవారం మైదుకూరు నియోజకవర్గ పరిధి బ్రహ్మంగారిమఠం మండలంలోని పలుగ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వప్నాలైన తొమ్మిది సంక్షేమ పథకాలే తమ పార్టీ అజెండా అని చెప్పారు. కడప జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పుతో ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రానున్నాయని స్పష్టం చేశారు.
ఉపఎన్నికల్లో పోటీ పడుతున్న తనను, తన తల్లిని కట్టడి చేసేందుకు తెలుగుదేశం, కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కయ్యారని, అనేక కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఏడు వేలమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బైండోవర్ కేసులతో వేధిస్తున్నారన్నారు. ఎన్నికలు జరిగే వేళ పార్టీ నాయకులను, కార్యకర్తలనుట్రబుల్ మాంగర్స్ (ఓటింగ్ ప్రక్రియకు ఆంటకం కలిగించే వారు) పేరుతో అరెస్టు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి ఓటింగ్‌లో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో పది మంది మంత్రులను దించారని, వీరి మీద హైదరాబాద్ నుంచి మరో నలుగురు మంత్రులు అజమాయిషీ చేస్తున్నారన్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే జిల్లాలో మంత్రులు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్ అభిమానుల గుండెచప్పుడులో వారు కొట్టుకు పోతారని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ మనమే తెచ్చుకుందామని జగన్ పిలుపునిచ్చారు. బ్రహ్మంగారి మఠంలో రాత్రి 9 గంటలకు జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పేదలకు 20 కిలోలు మాత్రమే ఇస్తున్న బియ్యాన్ని 30 కిలోలకు పెంచాలన్న వైఎస్ఆర్ ప్రతిపాదనను ఎందుకు అమలు చేయలేద ని, కొత్త రేషన్‌కార్డులను ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మన ప్రభుత్వం వచ్చాక వైఎస్ ప్రతిపాదనను అమలు చేసుకుందామన్నారు.
జగన్ ప్రచారంపై డేగకన్ను
వైఎస్ఆర్ జగన్ ఎన్నికల ప్రచారంపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. రెండు షాడో టీములు, ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం జగన్ కాన్వాయ్‌లో నాలుగు వాహనాలను సీజ్ చేశారు. జగన్‌తో పాటు ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు రోడ్‌షోలో పాల్గొన్నారు.
విజయమ్మ ఇంటింటి ప్రచారం
ఓటర్లను తికమక పెట్టేందుకు పది మంది జగన్‌లు, అయిదుగురు విజయలక్ష్మిలతో కాంగ్రెస్, టీడీపీలు నామినేషన్లు వేయించాయని, అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ, కుమార్తె షర్మిల, కోడలు వై.ఎస్.భారతి పిలుపునిచ్చారు. మన గుర్తు మారుతుందని, మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఓటర్లలో చైతన్యం కలిగించారు. వేంపల్లెలో బుధవారం విజయమ్మ, షర్మిల తిరుమల థియేటర్ వెనుక ప్రాంతం, బిడాలమిట్ట, కళాశాల నగర్, ఇమామ్ నగర్, వడ్డెరవీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వీరికి ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. తొండూరు మండలంలోని బూచుపల్లె, బోడివారిపల్లె, భద్రంపల్లె, కొత్తపల్లెలో వైఎస్ భారతి ప్రచారం చేశారు.