Post date: May 02, 2011 5:45:57 AM
అర్ధరాత్రి పూట పోలీసులు వేధిస్తే..
అవసరమైతే లింగాల పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తాం
{పచారాన్ని మానుకుని.. ముట్టడిలో నేనే ముందుంటా
బయటి వ్యక్తులతో రాళ్లదాడి చేయించిన బాబుపై కేసు పెట్టకుండా.. గ్రామస్తులపై కేసా?... అర్ధరాత్రి పూట అరెస్టు చేస్తామని మహిళలను పోలీసులు బెదిరిస్తున్నారు
కడపలో ఓటింగ్ శాతం తగ్గించడానికి కాంగ్రెస్, టీడీపీ కలిసి కుట్ర పన్నుతున్నాయి... ఇందులో భాగంగానే కోమన్నూతల గొడవ
బాబు, పోలీసులపై కోర్టులో కేసుపెట్టి కొట్లాడదాం
యువనేతకు అపూర్వ రీతిలో కోమన్నూతల వాసుల స్వాగతం
దివిటీలతో ఎదురేగి.. దిష్టి తీసి.. తిలకం దిద్దిన మహిళలు
అర్ధరాత్రి వేళ వచ్చి మహిళలను అరెస్టు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, కోమన్నూతల ఆడపడుచులపై చేయి పడితే.. పులివెందుల తాలూకా అంతా లింగాల పోలీస్ స్టేషన్ ముందుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. పులివెందుల, కడపలో ఓటింగ్ శాతం తగ్గించేందుకు చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కై కుట్ర పన్నుతున్నారనడానికి శనివారం కోమన్నూతలలో జరిగిన ఘటనే నిదర్శన మని చెప్పారు. బయటి వ్యక్తులతో రాళ్ల దాడి చేయించిన చంద్రబాబుపై కేసు పెట్టకుండా.. గ్రామానికి చెందిన 24 మందిపై, అందులోనూ నలుగురు మహిళలపై కాంగ్రెస్ సర్కారు కేసు పెట్టడం దారుణమన్నారు. సిగ్గులేకుండా ఆడవాళ్లపై పౌరుషం చూపించి, వారిపై కేసులు పెట్టే నీచమైన స్థాయికి ఈ ప్రభుత్వం, చంద్రబాబు దిగజారాయని మండిపడ్డారు. ‘పోలీసులు రాత్రి వచ్చి ఏమైనా చేస్తే.. అవసరమైతే నేను ఓ రోజు ప్రచారం మానుకుంటా.. అవసరమైతే పోలీసు స్టేషన్ ముట్టడికైనా కలిసికట్టుగా పోదాం. మీ అందరి కంటే ముందు నేనే ఉంటా..’ అని కోమన్నూతల గ్రామస్తుల హర్షధ్వానాల మధ్య యువనేత ప్రకటించారు. చంద్రబాబుతోపాటు పోలీసు యంత్రాంగంపై సోమవారం కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో చంద్రబాబు రోడ్‌షో సందర్భంగా జరిగిన గొడవలకు 24 మందిని బాధ్యులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి ఆచూకీ తల్లిదండ్రులకు సైతం చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జగన్ ఆ గ్రామాన్ని సంద ర్శించారు. గ్రామశివారులో విద్యుత్ లేకపోవడంతో గ్రామస్తులంతా దివిటీలతో వచ్చి యువనేతకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ రచ్చబండ మీద నుంచి జగన్ ప్రజలనుద్దేశించి ఆవేశపూరితంగా మాట్లాడారు. ఆయన ప్రసంగానికి అడుగడుగునా హర్షధ్వానాలు చేస్తూ.. గ్రామస్తులు మద్దతు పలికారు. జగన్ ఏమన్నారంటే..
‘చంద్రబాబు ఈ గ్రామానికి వచ్చారు. మామూలుగా వచ్చినవారు మైకుతో వస్తారు. తనతోపాటు వాహనాల్లో రాళ్లను కూడా తీసుకుని వచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. రాళ్లను తీసుకురావడమే కాకుండా బయటి వ్యక్తులతో వచ్చారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఏజెంటు కూడా దొరకని ఊరు ఇది. అలాంటి ఊరుకు పథకం ప్రకారం ప్రచారానికి రావడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతోపాటు బయటివారిని తీసుకొచ్చి వాళ్లతో రాళ్లు వేయించారు. అంతేకాకుండా సిగ్గులేకుండా ఆడవాళ్లను తిట్టారు. ఇంత చేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబుపై కేసు పెట్టలేదు. పోలీసులు ఆడవాళ్లను తిట్టారు. 24 మందిపై కేసు పెట్టారు. అందులోనూ నలుగురు ఆడవాళ్లపై కేసు పెట్టారు. అర్ధరాత్రి వేళలో ఆ నలుగురు ఆడవాళ్లను అరెస్టు చేస్తారని చెబుతున్నారట. నేను చెబుతున్నా చంద్రబాబుకు..పోలీసు డిపార్ట్మెంటు వాళ్లకు.. అర్ధరాత్రి వేళవచ్చి ఆడవాళ్ల పై చేయి పడిందీ అంటే పులివెందుల తాలూకా అంతా స్టేషన్ ముందుంటాది.’
‘పోలీసు వాళ్లు అరెస్టు చేయాలంటే ఓ పద్ధతి ఉంది. బయటి జనాలను తెచ్చి.. వాళ్లతో రాళ్లతో కొట్టించిన వాళ్లపై కేసు పెట్టకుండా.. మన గ్రామస్తుల మీద.. మన ఆడవాళ్ల మీద కేసులు పెట్టడం నీచమైన సంస్కృతికి నిదర్శనం. అందుకే పోలీసు యంత్రాంగంపైన, చంద్రబాబుపైన మన గ్రామస్తుల తరఫున కోర్టులో కేసు వేసి కొట్లాడదాం. ఎంత దారుణమైన పరిస్థితిలో పోలీసు శాఖ ఉన్నదంటే ఆరుగురిని అరెస్టు చేసి తీసుకుపోయి.. ఆ ఆరుగురు ఎలాగున్నారు అని చూడాలని అడిగితే.. కనీసం ఎక్కడ ఉన్నారో చెప్పలేని స్థితిలో ఉన్నారు. మధ్యాహ్నం తమ పిల్లల కోసం భోజనం తీసుకుని తల్లిదండ్రులు వెళితే.. వారి పిల్లలను చూపించకుండా.. ఆ తల్లిదండ్రులను కొట్టిన నీచమైన స్థాయికి పోలీసులు దిగజారారు. సోమవారం కోర్టులో చంద్రబాబు, పోలీసులకు వ్యతిరేకంగా కేసు వేస్తాం. చివరికి విజయకుమార్ అనే ఎంబీఏ విద్యార్థిపైనా కేసు పెట్టారు. ఎంత అన్యాయమైన స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది అనడానికి ఈ సంఘటనే నిద ర్శనం. ఈ చంద్రబాబుకు, పోలీసు డిపార్టుమెంటుకు, ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక్కటే చెబుతున్నా... మీరు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్‌ను చెరిపివేయలేరు. చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు లేనిది మనకు ఉన్నది ఆ దేవుడి దయ. ఈ న్యాయపోరాటంలో విజయం మనదే. వీరికి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయే పరిస్థితి వస్తుంది.’
ఊరంతా వెంట నడిచి..
గ్రామస్తులంతా ఎదురేగి ఘనస్వాగతం చెబుతుండగా.. మహిళలు దిష్టి తీసి, తిలకం దిద్ది.. జగనన్నా.. రా అన్నా.. అంటూ ఆహ్వానం పలుకుతుండగా.. యువనేత జగన్ కోమన్నూతలలో అడుగుపెట్టారు. గ్రామ శివారులో విద్యుత్ దీపాలు లేకపోవడంతో గ్రామస్తులు దివిటీలు తీసుకుని వచ్చి.. ఆయనను మేళ తాళాలతో ఊరేగింపుగా గ్రామ రచ్చబండ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా యువనేతను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీ పడ్డారు. రచ్చబండ మీద నుంచి ఆయన చేసిన ప్రసంగానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లభించింది. అనంతరం ఊరంతా వెన్నంటి నడుస్తుండగా రోడ్ షో నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పార్టీ నేత వైఎస్ భాస్కరరెడ్డితో పాటు కోమన్నూతల గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.