Post date: May 13, 2011 12:22:4 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్, 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు.
వైఎస్ జగన్, విజయమ్మల గెలుపు ఘనకీర్తీ కడప మహాశయులకు దక్కుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని అంబటి అన్నారు.
16మంది మంత్రులు కడపలో మకాం వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించేందుకు కుట్ర పన్నినా ఫలితం లేకపోయిందన్నారు. మాజీ సీఎంతో పాటు కాబోయే సీఎంగా చెప్పుకుంటున్న చిరంజీవి కూడా ప్రచారానికి వెళ్లి మీసాలు మెలి తిప్పి, తొడకొట్టినా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందన్నారు. కాంగ్రస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రచారానికి వెళ్లిన మంత్రులు రాజీనామా చేయాలని అంబటి డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు లక్షల మెజార్టీ వస్తే తమ ఆస్తులు రాసిస్తామన్న మంత్రి డీఎల్, కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి తక్షణమే తమ ఆస్తులను తిరుపతి వెంకన్న హుండీలో వేయాలని అంబటి అన్నారు. కడప, పులివెందుల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై పెనుమార్పును తీసుకువస్తాయన్నారు.