Post date: Aug 22, 2011 4:14:19 AM
ఎంపి లగడపాటి రాజగోపాల్ సోదరుడు లగడపాటి శ్రీధర్ కూడా జగన్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారని, అయితే సిబిఐ నిన్న రూపొందించిన ఎఫ్ఐఆర్.లో ఆయనకు సంబంధించిన సంస్థ పేరుని పేర్కొనలేదని, ఎంపి లగడపాటి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భజన చేస్తున్నందునే ఇలా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.
కాంగ్రెస్.కు అనుకూలంగా ఉన్నవారికి ఒక న్యాయం, వ్యతిరేకంగా ఉన్నవారికి ఒక న్యాయం పాటిస్తున్నారన్నారు. సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండేవాళ్లకు సిబిఐ అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్లు ఉందని దేశంలోనే ఉన్నతమైన సంస్థగా పేరుపొందిన సిబిఐ ఇలా వ్యవహరించడం మంచిదికాదని అన్నారు. లగడపాటి శ్రీధర్ సంస్థని కూడా ఎఫ్ఐఆర్.లో
చేర్చాలని అంబటి సిబిఐకి విజ్ఞప్తి చేశారు.
జగన్మోహన రెడ్డిని అణచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని జగురుతున్న ప్రయత్నాలను తగిన విధంగా ఎదుర్కొంటామన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుట్రని ప్రజాస్వామ్య పద్దతిలో ఎదుర్కొంటామన్నారు. జగన్కు అండగా ఉంటామని, పార్టీని రక్షించుకుంటామని ఆయన తెలిపారు