Post date: Aug 19, 2011 5:47:3 AM
సిబిఐ సోదాలపై రామోజీరావుకు చెందిన ఈటివి-2 టీవీ చానెల్ వార్తా ప్రసారాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి డైలీ ఎద్దేవా చేసింది. రామోజీ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలంటూ ఆడిపోసుకుంది. ఎల్లో సిండికేట్‌లో భాగమైన ఈటీవీ - 2, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, స్టూడియో - ఎన్, టీవీ -9 చానెళ్లు వాస్తవాలకు వక్రభాష్యాలు చెబుతూ జనంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని సాక్షి డైలీ మండిపడింది. ఈ మేరకు శుక్రవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలో దాదాపు 13 శాటిలైట్ చానెళ్లుండగా ఆ చానెళ్లు మాత్రమే వార్తలను వక్రీకరించాయని ఆడిపోసుకుంది. సాక్షి తప్పు పట్టిన స్టూడియో - ఎన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తోంది.
తాజా పరిణామాలు ఈటీవి - 2వారిలో, ఆ చానెల్ యజమాని రామోజీరావులో కొత్త ఉత్సాహం నింపినట్టున్నాయని, భారీ బహిరంగ సభలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయని ఈటీవీ2 సిబిఐ సోదాలు జరిగిన పలు చోట్ల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడం ఇందుకు నిదర్శనమని సాక్షి డైలీ తన వార్తాకథనంలో వ్యాఖ్యానించింది. జగన్‌ను టార్గెట్ చేసుకుని గతంలో ఈటీవి2 ప్రసారం చేసిన వార్తాకథనాలను కూడా గుర్తు చేసింది. క్యాంటిన్‌కు చెందిన ఖాళీ గిన్నెలను కూడా కీలక డాక్యుమెంట్లుగా ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి వర్ణించిందని వ్యాఖ్యానించింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ చానెల్ బురద చల్లుతూనే ఉన్నదని విమర్సించింది.
జర్నలిజంలో ఎవరూ వాడని పదాలను అలవోకగా వాడగలిగే సత్తా ఉన్న స్టూడియో - ఎన్ ఉచ్చు బిగిసిందంటూ కథనాలు ప్రసారం చేసిందని, ఏ పదానికి ఏ అర్థమో కూడా తెలియని ఈ చంద్రబాబు చానెల్ గురువారం ఉదయం నుంచి జగన్‌పై బురద చల్లడంలో నిమగ్నమైందని సాక్షి విమర్సించింది.