Post date: Apr 30, 2011 10:44:47 AM
ముఖ్యమంత్రి పదవికి మద్దతు కోరుతూ జగన్ కొందరు ఎమ్మెల్యేలను తన దగ్గరకు పంపారని ఆరోపిస్తున్న చిరంజీవి.., ఆయన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. పార్టీ పెట్టి పారాణి ఆరక ముందే దానికిపాతర వేసి, జెండాను సమాధి చేసిన వ్యక్తి చిరంజీవి అని దుయ్యబట్టారు.
‘‘సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులకొచ్చిన చిరంజీవి తొడగొట్టి కాంగ్రెస్‌పై, సోనియాపై సవాల్ చేశారు. అదే చిరంజీవి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. సోనియాగాంధీని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డిని తూలనాడుతున్నారు. ఈరోజు సోనియాగాంధీ ఏ పనిచేసినా చిరంజీవికి మహాద్భుతంగా కనిపిస్తోంది’’ అని ఎద్దేవా చేశారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కొనసాగుతున్నాయో లేదో వాటిద్వారా లబ్ధి పొందిన వారిని ప్రశ్నిస్తే వాస్తవాలు తెలుస్తాయి. చిరంజీవికి ఏం తెలుసు? వైఎస్ పథకాలు కొనసాగుతున్నాయని ప్రజలను భ్రమల్లో ఉంచడానికే వాళ్లు ప్రచారం చేస్తున్నారు’’ అని అన్నారు.
‘‘అసలు వారసత్వానికి పాకులాడుతున్నది సోనియాగాంధీ, రాహుల్‌గాంధీనే అని తెలుసుకోవాలి. సోనియా చెప్పినట్లు వింటూ కాంగ్రెస్‌లోనే ఉంటే ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతానని జగన్‌కు తెలుసు. అయినా ప్రజల మద్దతుతోనే సీఎం కావాలని ఆలోచిస్తున్న వ్యక్తి జగన్. 1984లో ఇందిరాగాంధీ చనిపోయిన తరువాత ఎంపీల పూర్తి మద్దతు లేకుండా రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రిని చేశారు. సోనియా కూడా వారసత్వంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధాని అవుదామని కలలు కంటున్నారు. వారసత్వం కోసం అర్రులు చాచేది నెహ్రూ ఫ్యామిలీ తప్ప మరొకటి కాదు. ఏ ప్రాంతానికి వెళ్లినా జగనే సీఎం కావాలని ప్రజలు చెబుతున్నారు. ఆయనకు ప్రజా మద్దతు ఉందన్న విషయాన్ని ఇది తేటతెల్లం చేస్తుంది’’ అని భూమన చెప్పారు.