Post date: Apr 04, 2011 5:11:39 AM
నిబంధనలకు విరుద్ధంగా సెక్యూరిటీ సిబ్బంది నియామకం
వీరిదీ పోలీసులు ధరించే యూనిఫారమే..
పైగా స్టార్ గుర్తులు కూడా
{పైవేటు సెక్యూరిటీ ఏజెన్సీస్ నియంత్రణ చట్టానికి తూట్లు
ఏడాది జైలు శిక్ష, జరిమానాకు అవకాశం
చట్టం అమలును పట్టించుకోని పోలీసులు
హైదరాబాద్, న్యూస్‌లైన్:
ఐపీఎస్ కాదండీ.. ఆర్పీఎస్.. రామోజీ పోలీస్ సర్వీస్... ఐండియన్ పోలీసు సర్వీస్‌కు ప్రత్యామ్నాయంగా రాజగురువింద రామోజీ ఏర్పాటు చేసుకున్న సమాంతర పోలీసు వ్యవస్థ! నిజం.. ఎందుకంటే వీరంతా పోలీసు దుస్తులనే ధరిస్తారు. అంతేకాదు.. డీఎస్పీ, ఎస్సైల తరహాలో వీరి దుస్తులపై స్టార్ గుర్తులూ ఉంటాయి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలో రాష్ట్ర పోలీసు అకాడమీకి ఏమాత్రం తీసిపోని రీతితో.. ప్రభుత్వాధినేతలా ఫోజులిస్తూ.. రామోజీరావు గౌరవ వందనాలూ స్వీకరిస్తారు. అయితే.. ఇదంతా చట్టబద్ధమా? ఇలా పోలీసు దుస్తులు ఎవరు పడితే వారు వేసుకోవచ్చా? అంటే కచ్చితంగా ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే.. అయితే రాజగురువుకూ ఏ చట్టమూ వర్తిస్తేగా? ఏ కోర్టుకెళ్లినా ఆయన వాదించేదీ ఇదే.. ఎందుకంటే రామోజీ అంతా తన సొంత చట్టం ప్రకారమే నడుచుకుంటారు.. అందులో ఉన్నవన్నీ ఇదిగో ఇలాంటి 420 సెక్షన్లే..
ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీస్ చట్ట ఉల్లంఘన: సెక్యూరిటీ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించడం అవసరమని భావించిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీస్(నియంత్రణ) చట్టం-2005ని రూపొందించి, అమలు చేస్తోంది. ఈనాడు గ్రూపు సంస్థల యజమాని చెరుకూరి రామోజీరావు ఈ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. ఈనాడు, ఈటీవీ, రామోజీ ఫిల్మ్‌సిటీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్, కళాంజలి వంటి సంస్థల్లో నియమించుకున్న వేలాదిమంది రక్షణ సిబ్బంది నియామకం విషయంలో ఆయనకీ నిబంధనలేవీ పట్టలేదు.
ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం.. ఏ వ్యక్తి అయినా, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ అయినా లెసైన్స్ లేకుండా సెక్యూరిటీ గార్డును నియమించుకోరాదు లేదా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించరాదు. అంటే ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ ఏర్పాటు చేసుకోవాలన్నా, నియమించుకోవాలన్నా తప్పనిసరిగా లెసైన్స్ పొంది ఉండాలి. అందుకు తగిన అర్హతలు ఉండాలి. సిబ్బందిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ రక్షణ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, రాజగురువు సెక్యూరిటీ సిబ్బందిని ఉషోదయ పబ్లికేషన్స్ కింద నియమించుకున్నారు. ఏజెన్సీ ద్వారా కాకుండా సొంతంగా సిబ్బందిని నియమించుకుని, నిబంధనలను ఉల్లంఘించారు. ఉషోదయ పబ్లికేషన్స్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ వంటి పేర్లతో ఇతర సిబ్బంది నియామకం లాగానే సెక్యూరిటీ సిబ్బందినీ నియమించుకున్నారు. అయితే, దీనికి లెసైన్స్ ఉందో లేదో రామోజీకే తెలియాలి. లెసైన్స్ లేకపోవడం నేరం. పైగా వీరందరూ పోలీసులు ధరించే యూనిఫారాన్ని ధరిస్తారు. ఇదీ శిక్షార్హమే.
సెక్షన్ 21 ప్రకారం..
ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీస్(నియంత్రణ) చట్టం-2005లోని సెక్షన్ 21 ప్రకారం ఏ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు లేదా సూపర్వైజర్.. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, పోలీసు, ఇతర సాయుధ బలగాలకు చెందిన యూనిఫారంను గానీ, దాన్ని పోలిన దుస్తులనుగానీ ధరించరాదు. అలా ధరిస్తే సంస్థ యజమానితో పాటు, ధరించిన వ్యక్తికి కూడా ఏడాది జైలు శిక్ష పడుతుంది. శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. రామోజీరావు నియమించుకున్న వేలాది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి ఈ నిబంధనను ఉల్లంఘించి మరీ పోలీసు యూనిఫారంను కేటాయించారు. పైగా ఎస్సై, సీఐ, డీఎస్పీ ర్యాంకులను పోలి ఉండేలా యూనిఫారానికి స్టార్ గుర్తులు కూడా కనిపిస్తాయి. ఇదంతా దేనికీ? పోలీసులే తమ సంస్థలకు కాపలా ఉన్నట్టు దర్జా చూపించడానికా? లేక ప్రజలకు వారిని చూపి భయపెట్టాలనా? లేక ఏ చట్టమూ తనకు వర్తించదని చెప్పడానికా? లోగుట్టు రామోజీ రావుకే ఎరుక.
పోలీసులు
ఏమంటున్నారంటే..
ఈ వ్యవహారంపై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల నుంచి వివరణ కోరగా.. ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని, దీన్నుంచి ఎవరికీ మినహాయింపు లేదని తెలిపారు. ఈనాడు గ్రూపునకు కూడా మినహాయింపు లేదని స్పష్టం చేశారు. పోలీసులకు చెందిన ఖాకీ యూనిఫారం ధరిస్తున్నందున ఈనాడు సెక్యూరిటీ సిబ్బందిపైగానీ, ఈనాడు యాజమాన్యంపైగానీ కేసులు నమోదు చేశారా? అని ప్రశ్నిస్తే ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు.