Post date: Dec 15, 2011 6:31:58 AM
‘సాక్షి’ మీడియాను ఆదరిస్తున్న తెలుగింటి అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇంకో మూడు నెలలైతే ‘సాక్షి’ పత్రికకు నాలుగేళ్లు నిండుతాయి. మరో రెండు నెలలకు ‘సాక్షి’ చానెల్ పెట్టి మూడేళ్లవుతుంది. ఈ స్వల్ప కాలంలోనే మీ అందరి నిండు దీవెనలతో ‘ఇంతింతై... వటుడింతై’ అన్నట్టుగా సాగిన ‘సాక్షి’ ప్రస్థానాన్ని చూస్తే గర్వంగా ఉంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) లెక్కల ప్రకారం (జనవరి-జూన్ 2011) ‘సాక్షి’ పత్రిక సర్క్యులేషన్ పద్నాలుగు లక్షల యాభై వేలు. ‘ఇండియన్ రీడర్షిప్ సర్వే’ ప్రకారం (2011 క్యూ2) ప్రతి రోజూ ‘సాక్షి’ని చదువుతున్న పాఠకుల సగటు సంఖ్య దాదాపుగా కోటిన్నర. జాతీయ స్థాయిలో తొమ్మిదో స్థానం. ‘సాక్షి’ న్యూస్ చానెల్ కూడా టీఆర్పీ రేటింగ్ ప్రకారం తెలుగు న్యూస్ చానెళ్లలో అగ్రశ్రేణిలో కొనసాగుతోంది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన మీకు ఈ ‘సాక్షి’ ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు? మీ గుండె గొంతుకై వినిపించటం తప్ప! మీ గుండె చప్పుడై ధ్వనించటం తప్ప!!
మీకు తెలుసు... ఏ పరిస్థితుల్లో తెలుగు పత్రికా రంగంలో ‘సాక్షి’ ఆవిర్భవించాల్సి వచ్చిందో..! అప్పటి ఆధిపత్య మీడియా, దాని తోకలు పసుపు పార్టీతో కలగలిసి మాఫియా అవతారమెత్తిన చీకటి రోజులవి. వారంతా కలిసి తాము రాస్తేనే వార్త... దాచేస్తే కాదు అన్నట్టుగా మీడియా రంగాన్ని కలుషితం చేసిన రోజులవి. ఒక సంఘటన తాలూకు పూర్తి నిజానిజాలను ప్రజలకు తెలియకుండా ఒకవైపే చూపిస్తూ మరోవైపు దాచేస్తూ... ప్రజల సమాచార హక్కును ఎల్లో మీడియా పీక నులిమేస్తున్న తరుణంలో ‘సాక్షి’ పుట్టింది. నాణేనికి మరోవైపు చూపటం కోసం ‘సాక్షి’ పుట్టింది.
నిజాన్ని నిర్భయంగా చెప్పటానికి ‘సాక్షి’ పుట్టింది. ‘సాక్షి’ పుట్టాక జనానికి పూర్తి నిజానిజాలు తెలియటం మొదలైంది. చీకటి కోణంలో పడి కనిపించకుండా పోయిన కథలన్నీ కనిపిస్తున్నాయిప్పుడు. నాటి పాలకులూ - ఎల్లో మీడియా కలిసి జనం కళ్లకు గంతలు కట్టి సాగించిన అరాచకం, దుర్నీతి, దోపిడీ, దాష్టీకాలు వరసకట్టి జనం ముందుకొస్తున్నాయిప్పుడు. ఇదే ఎల్లో సిండికేట్ కంటగింపునకు కారణం. తెలుగు వార్తా ప్రపంచంలో తమ మాఫియా పాలన అంతమైందన్న కడుపు మంట. ఈ కడుపు మంటలోంచి పుట్టిందే ‘సాక్షి’ని అంతం చేయాలన్న కుట్ర. ఎల్లో సిండికేట్‌కు పెద్దన్నగా వ్యవహరిస్తున్న ‘ఈనాడు’కు ఇలాంటి కుట్రలు కొత్త కాదు.
తెలుగు మీడియా రంగంలో కొత్త గొంతు వినిపిస్తూ ఆరంభమైన ‘ఉదయం’ పత్రికపైనా ‘ఈనాడు’ ఇలాంటి కుట్రనే విజయవంతంగా అమలు చేసింది. ‘ఉదయం’ యాజమాన్యానికి మద్యం వ్యాపారాలుండటంతో.. వాటిని దెబ్బతీయటానికి ‘మద్య నిషేధ’ ఉద్యమాన్ని భుజానికెత్తుకుంది. సామాజిక బాధ్యత ముసుగులో ఉద్యమం నడిపించి నిషేధం అమల్లోకి వచ్చేలా చేశారు రామోజీరావు. ఫలితంగా ‘ఉదయం’ పత్రిక నిధుల్లేక అల్లాడి చివరికి మూతపడింది. లక్ష్యం నెరవేరిందనుకున్న రామోజీ.. ఫిలింసిటీలోని తన స్టార్ హోటళ్లలో మద్యం లేకపోతే వ్యాపారం జరగదని భావించి... నిషేధానికి మంగళం పాడేందుకు మరో కుతంత్రం దిగ్విజయంగా అమలు చేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం ప్రవహిస్తోందంటూ నిత్యం పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసి... ‘‘ఇలాంటి నిషేధం ఉంటేనేం...!! లేకుంటేనేం!!’’ అనే వాదనను తెరపైకి తెచ్చారు. ఆ రకంగా నిషేధాన్ని తొలగించడానికి రాజబాట పరిచారు.
‘సాక్షి’ విషయంలో కూడా ‘ఈనాడు’, దాని తోకలు, రాజకీయ రక్షకులు సరిగ్గా ఇలాంటి కుట్రకే తెరతీశారు. ఎంత దుష్ర్పచారం చేసినా ‘సాక్షి’ పాఠకాదరణ చెక్కు చెదరకపోవటంతో దాని ఆర్థిక మూలాలపై కన్నేసి... కుతంత్రాన్ని ప్రయోగించారు. జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చిన పెట్టుబడులే అక్రమమంటూ.. ‘సాక్షి’ మీడియాను టార్గెట్ చేశారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాల్ని ఓదార్చటానికి... వారికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల్ని సైతం ధిక్కరించి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టిన నాపై అప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు గుర్రుగా ఉన్నారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని నాపై చూపిస్తూ అక్కున చేర్చుకుంటున్న జనసంద్రాల్ని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు.
ఇదే అదనుగా ఎల్లో సిండికేట్ నేతలు కాంగ్రెస్ అధిష్టానంతో సాన్నిహిత్యం మొదలుపెట్టారు. అధికారాన్ని, అంగ, అర్థ బలాలను అడ్డం పెట్టుకుని ‘సాక్షి’ని, వైఎస్ కుటుంబాన్ని కేసుల్లో ఇరికించి లబ్ధి పొందే కుట్రలను అమలు చేశారు. ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లపై... ఏ రాష్ట్రంలోనూ ఇంతకు ముందెన్నడూ లేనంతటి రీతిలో దర్యాప్తు సంస్థల చేత వరుస దాడులు చేయించి వారిని భయోత్పాతానికి గురిచేశారు. పాలకపక్షం, ప్రతిపక్షం కలిసి ఆడుతున్న ఈ డ్రామా మీకందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అన్నిపక్షాలూ ఒక్కటై మాపై దాడిచేస్తున్న వైచిత్రి మీ కళ్లకు కడుతూనే ఉంది. ఈ ఆపత్కాలంలో మాకు నిజమైన ఊరట ఒక్కటే. ఎవరెన్ని కుట్రలు చేస్తున్నా ఒక్క పాఠకుడు కూడా ‘సాక్షి’ని వీడలేదు సరికదా... ఆ సంఖ్య మరింత పెరిగింది. ‘సాక్షి’కి మేమున్నామంటూ మీరు కురిపిస్తున్న ఈ ఆత్మీయతే మాకు కొండంత బలం.
మీకు తెలుసు.. పేజీల సంఖ్యలోగానీ, రంగుల్లోగానీ, టెక్నాలజీలోగానీ, అనుబంధాల్ని అందించటంలో గానీ తెలుగు పత్రికా రంగంలో ‘సాక్షి’తో ఏ పత్రికా పోటీ పడే పరిస్థితి లేదు. మొదటి నుంచీ ‘సాక్షి’ది వినూత్న ఒరవడే. ధర కూడా ఆరంభం నుంచీ పోటీ పత్రికలకన్నా తక్కువే. ఎన్నటికీ అలా ఇవ్వాలన్నదే ‘సాక్షి’ ఉద్దేశం కూడా. ప్రస్తుతం ‘సాక్షి’ రోజువారీ ధర రూ.2.50 పైసలు. అయితే కుట్రదారులు ఆర్థిక దాడుల్ని తీవ్రతరం చేయటంతో పాటు ఇన్వెస్టర్లను భయభ్రాంతుల్ని చేశారు. నిధులు రాకుండా అడ్డుకున్నారు. కొత్త ఇన్వెస్టర్లెవరైనా ‘సాక్షి’ వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడే రీతిలో టై సృష్టించారు. ‘సాక్షి’ని, దాని యాజమాన్యాన్ని వివిధ కేసుల్లో ఇరికించి న్యాయస్థానాల చుట్టూ తిప్పుతున్నారు. వీటన్నిటితో పాటు అప్పీలుకు నిలబడని కేసుల్ని కావాలని సృష్టించి మరీ బనాయిస్తున్నారు. ఐటీ శాఖలోని తమ అనుకూల అధికారుల్ని ఇందుకోసం పావులుగా ఉపయోగిస్తున్నారు.
ఆచరణ సాధ్యంకాని డెడ్లైన్లు విధిస్తూ వచ్చిన ఐటీ నోటీసుల్ని అనుసరించి ‘సాక్షి’ ఇప్పటికే రూ.25 కోట్ల వరకూ పన్ను చెల్లించింది. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు కూడా చేసింది. ఇంకా ఐటీకి సంబంధించి పలు కేసుల్లో న్యాయపోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో తుది గెలుపు తనదేననే అచంచలమైన విశ్వాసం ‘సాక్షి’కి ఉంది కూడా!! అయితే ఏ సంస్థకైనా ఆరంభంలో బయటి నుంచి నిధులు రావటం అత్యంత అవసరం. అందులోనూ భారీ ఎత్తున ఆవిర్భవించిన మీడియా సంస్థ లాభనష్టాల్లేని స్థితికి రావాలంటే (బ్రేక్ ఈవెన్) కనీసం ఐదారేళ్లు పడుతుంది. అందుకే ఇప్పుడు ‘సాక్షి’లోకి ఇన్వెస్ట్మెంట్లు రాకుండా చేయటం ద్వారా దాని గొంతు నులిమేయాలన్నది ఎల్లో సిండికేట్ కుట్ర. ఈ కుట్రల్ని విజయవంతంగా ఛేదిస్తూ వస్తున్న ‘సాక్షి’కి... ఇప్పుడు తన సొంత కాళ్లపై నిడబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్త ఇన్వెస్ట్మెంట్లు రాకపోయినా తట్టుకునేలా అంతర్గత వనరుల్ని పెంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకే... కష్టకాలంలోనూ మమ్మల్ని వెన్నంటి ఉన్న పాఠకులు కాస్తంత ధరాభారాన్ని భరించి సహకరిస్తారనే నమ్మకంతో ధరను పెంచాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఉన్న రూ.2.50 నుంచి మూడు రూపాయలకు పెంచుతున్నాం. ఆదివారాలు మాత్రం పాత ధరే (రూ.3.50) ఉంటుంది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం ఒక్కటే. ‘సాక్షి’ తన సొంత కాళ్లపై నిలబడగలగాలి. రాష్ట్రంలో మళ్లీ సమాచార అత్యయిక స్థితి రాకుండా తన గొంతును మరింత బలంగా వినిపించాలి. ఏ శక్తులూ ‘సాక్షి’ని మరే రకంగానూ దెబ్బ తీయలేని స్థాయికి చేరుకోవాలి.
ఎన్ని ఆర్థిక కుట్రలు చేసినా ఎదుర్కొనే బలం ‘సాక్షి’కి రావాలి. మీ అందరి సహకారంతో ఈ స్థాయిని సాధిస్తామనే సంపూర్ణ విశ్వాసం మాకుంది. ఈ కష్టకాలంలో మీరు తోడుంటే చాలు. ఎప్పట్లా మీ ఆదరణ కొనసాగిస్తే చాలు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.., కుతంత్రాలు ప్రయోగించినా ఎదురొడ్డి నిలబడే ధైర్యం మాకుంది. చిరకాలం మీకు తోడుగా, నీడగా మీ వెంటే ‘సాక్షి’ని నిలబెట్టే సత్తా మాకుంది. సకలజన శ్రేయస్సు కోసం మీ అడుగులో అడుగేస్తూ... అసత్యాలకు, అర్ధ సత్యాలకు తావులేని పావన నవజీవన సమాచార బృందావన నిర్మాణానికి మీతో కలిసి ‘సాక్షి’ని నడిపిస్తామనే నమ్మకం మాకుంది. సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని, మునుపటికన్నా మిన్నగా అండగా నిలుస్తారని సంపూర్ణ విశ్వాసంతో...
మీ
(వై.ఎస్.జగన్మోహన్రెడ్డి)