Post date: Apr 27, 2011 5:26:15 AM
రాజశేఖరుడి సాక్షిగా మాట తప్పను
మన ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ పాలన
రాజకీయ విలువలు మంటకలిశాయి
రోడ్‌షోలో జగన్మోహన్రెడ్డి
దివంగతనేత వై.ఎస్ రాజశేఖర రెడ్డి అందించిన స్వర్ణయుగాన్ని మళ్లీ చూడాలంటే మన పార్టీని మనమే అధికారంలోకి తీసుకువద్దామని, రాజన్న రాజ్యాన్ని స్థాపించుకుందావుని కడప పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. పేదోడికి న్యాయం చేయడంలో రాజశేఖరుడి సాక్షిగా మాట తప్పనని జగన్ స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం దువ్వూరు, చాపాడు మండలాల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ ‘రామరాజ్యం నేను చూడలేదు కానీ, మహానేత వైఎస్ పాలన ఏంటో చూశాను. అలాంటి పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీతోనే సాధ్యమవుతుంది’ అని పునరుద్ఘాటించారు. ఇందుకు మీరంతా పార్టీకి వెన్నంటి నిలబడాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం రాజకీయ ప్రమాణాలు దిగజారిపోయాయని, రాజకీయనాయకులు విలువలు పాటించడం లేదని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక మాట ఇస్తే.. కష్టమైనా నష్టమైనా మాటమీద నిలబడాలని.. మాట ఇస్తే మడమ తిప్పకూడదనే ఉద్దేశం నాయకుల్లో కనిపించడంలేదన్నారు. ఆరోజు తాను రాజీనామా చేయకపోయింటే విశ్వసనీయత అనే పదాన్ని ఆరడుగుల గుంత తీసి ప్రతి రాజకీయనాయకుడు పూడ్చివేసే పరిస్థితి వచ్చేదన్నారు. ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కనిపించకుండా చేసేవాళ్లన్నారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ పేదోడికి న్యాయం చేయాలని రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారంచుట్టి పావురాల గుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాయడంతో వందలాది గుండెలు ఆగిపోయాయని స్మరణకు తెచ్చారు. ప్రాణాలు వదిలిన వారిని ఓదార్చాలని పావురాలగుట్ట సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడ్డానని, ఎన్ని అవంతరాలు ఎదురైనా మడమతిప్పలేదని, చివరకు ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. ప్రతిపేదోడి మోములో చిరునవ్వు చూడాలని, ప్రతి పేదోడు ఉన్నత చదువులు చదవాలని, కనీసం కుటుంబం నుండి ఒక్కరైనా డాక్టర్ కావాలని, ఇంజనీరు కావాలని పరితపించిన వ్యక్తి దివంగత నేత వైఎస్సార్ అని అన్నారు. ‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కోట్లు సంపాదించాడు. అయినా అతని అవినీతిపై కోర్టులో ఎవరూ కేసు వేయలేదు. అతనిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీలు వేయడం లేదు. కేవలం నన్నూ, నా తల్లిని ఓడించేందుకు చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యాడని జగన్ నిప్పులు చెరిగారు. తమను ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌నుంచి మూటల కొద్దీ డబ్బులు ఇక్కడకు తరలిస్తున్నారన్నారు. తమ అనుచరులపై అన్యాయంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. యుపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తనపై శంకరరావుతో కేసు వేయించారని, తనను పార్టీ నుంచి పొగపొట్టి బయటకు పంపారన్నారు.
మనదే గుర్తు?
అవ్వా, తాతా మనదే గుర్తు? గుర్తు తెలిస్తే చేతులెత్తండి.. అంటూ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అడిగారు. మన గుర్తు ఫ్యాన్ అంటూ ప్రతి పల్లెలో ఓటర్లందరూ చేతులెత్తారు. మూడు రోజుల కిందటే మనకు కొత్త గుర్తువచ్చింది. ఆ గుర్తు ఏంటో ఒక్కరు పదిమందికి చెప్పాలి. ఆపదిమంది ఇంకొంతమందికి చెప్పాలి. ఇలా ఫ్యాన్ గుర్తు అందరి హృదయాల్లో నిలిచిపోవాలని జగన్ కోరారు. ప్రతి అవ్వ, తాతలో ఇప్పడున్న చిరునవ్వుకంటే. చక్కటి చిరునవ్వు రావాలి. సువర్ణ యుగం సాధించుకోవాలి. మన పార్టీ గెలవాలి. మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను, తన తల్లిని ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు.