Post date: Sep 05, 2011 3:48:1 PM
దేశంలో ప్రస్తుత పరిస్థితులు 1975 నాటి ఎమర్జన్సీ రోజులను తలపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి పేర్కొన్నారు. యుపిఎ ప్రభుత్వం సిబిఐని ఎలా వినియోగించుకుంటుందో వివరిస్తూ దేశంలోని ప్రతిపక్ష నేతలకు ఆయన ఒక లేఖ రాశారు. కొందరిని స్వయంగా కలిసి పరిస్థితిని వివరించారు. యుపిఎ పాసిస్టు విధానాలను ఎండగట్టాలని వారిని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలోని అన్ని పార్టీలు కలసికట్టుగా పోరాడాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో యుపిఎ పరాజయం తప్పదని సర్వేలు తెలుపుతున్నాయని వివరించారు. ది హిందూ, ఇండియా టుడే లాంటి పత్రికలు ఇదే విషయాన్ని ప్రచురించాయన్నారు. ఆంధ్రప్రదేశ్.లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు చెప్పాయని తెలిపారు. అందుకే తన రాజకీయ ప్రత్యర్థులను సమూలంగా నాశనం చేసేందుకు యుపిఎ ప్రభుత్వం తన ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. భవిష్యత్.లో దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం అన్నారు. అందుకే చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ తన ప్రత్యర్థులను సమూలంగా నాశనం చేయాలని కుటిల ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు.
తనకు సంబంధించిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవారు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందారన్న ఆరోపణలపై సిబిఐ అధికారులు కేసులు నమోదు చేశారని తెలిపారు. అసలు ఈ అక్రమాలు జరిగాయా? జరిగితే ఎలా జరిగాయి? అనే విషయాలను ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా చెప్పలేదన్నారు. ఒకవేళ అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే పెట్టుబడిదారులను పిలిచి విచారించవలసి ఉందన్నారు. కానీ ఇక్కడ సిబిఐ రివర్స్ పద్దతిలో పని చేస్తోందని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనంత తానుగానే నిర్ధారణకు వచ్చిందన్నారు. యుపిఎ ప్రభుత్వం పెట్టుబడిదారులను వేధిస్తోందని తెలిపారు. తనకు వ్యతిరేకంగా స్టేట్.మెంట్ ఇవ్వకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వారిని హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తనని కేసుల్లో ఇరికించడానికి సిబిఐ ప్రయత్నిస్తోందన్నారు. తనని నిర్మూలించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. అవినీతి అనే నెపంతో తనలాంటి రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తోందన్నారు. బాబా రామ్.దేవ్.తో చర్చలకు నలుగురు కేంద్ర మంత్రులు వెళ్లారని, కాంగ్రెస్ ట్రాప్.లో పడకపోవడంతో ఆయనని వేధిస్తున్నారని చెప్పారు. ఆయనపై ఫెమా కేసు కూడా పెట్టించారని తెలిపారు. ప్రముఖ
గాంధేయవాది అన్నా హజారే బృందంలో ఉన్న వారిని కూడా నోటీసుల పేరుతో వేధిస్తున్నారని వివరించారు.
సిబిఐ కేసు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరుగలేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పవలసి ఉందన్నారు. ఒకవేళ అక్రమాలు జరిగాయని భావిస్తే వారిని పిలిచి సిబిఐ విచారించవలసి ఉందన్నారు. అవినీతి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే తనతో సహా ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్యపై ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నా, ఆయనపై సిబిఐ
కేసుని ఎత్తివేసి, గవర్నర్ పదవిని కట్టబెట్టారని తెలిపారు.
తన తండ్రి మరణం తరువాత టిడిపి మెరుగు పడుతుందని చంద్రబాబు భావించారని, అయితే ఆ పార్టీ పునాదులు కదిలిపోయాయన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకొని రాజకీయాల నుంచి తనను లేకుండా చేయాలని
ప్రయత్నిస్తున్నారని తెలిపారు.