Post date: Aug 25, 2011 5:4:38 AM
ఈ పరిస్థితిని చూసి న్యాయవాదిగా సిగ్గుపడుతున్నా
శక్తిగా ఎదుగుతున్న జగన్‌ను నిరోధించడానికే ఈ కుట్ర
వ్యవస్థలో ఒక శక్తిగా ఎదుగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిరోధించడానికి కొందరు న్యాయవ్యవస్థను వాడుకుంటున్నారని, న్యాయవాదిగా ఈ పరిస్థితిని చూసి సిగ్గుపడుతున్నానని హైకోర్టు న్యాయవాది గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను నాశనం చేయడానికి రాజకీయ వ్యవస్థ ప్రయత్నిస్తోందని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘చనిపోయిన వ్యక్తి మీద నేరం మోపడం కాదు.
అవినీతి జరిగిందని భావిస్తే మంత్రివర్గం మీద కేసులు పెట్టాలి. అవినీతి జరిగిందా లేదా అన్నది నిరూపించాల్సిన బాధ్యత కేబినెట్‌దే. అవినీతి జరిగిందని నిరూపణ అయినప్పుడు, అవినీతిని ప్రేరేపించాడని భావించినప్పుడు జగన్‌ను నిందితునిగా చేర్చాలి. అంతేకాని వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్‌ను కలిపి కేసు నమోదు చేయడం ఎంత మాత్రం తగదు’’ అన్నారు. త్వరగా దర్యాప్తు ప్రారంభించడంద్వారా కేసు తీవ్రతను తెలియజెప్పేందుకు సీబీఐ ప్రయత్నించిందన్నారు. సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు ప్రకటించడం ఊహించిందేనని చెప్పారు. నేరం చేయలేదని భావించినప్పుడు సీఆర్పీసీ 482 కింద వ్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు కదా అని సూచిస్తోందని, కోర్టు దృష్టితో చూస్తే ఇది సరైనదేనని ఆమె తెలిపారు.
కేసులు నిలబడవు: జగన్‌తో సహా ఎవరిపైనా కేసులు కోర్టుల్లో నిలబడవని గాయత్రి తెలిపారు. ‘‘10 రూపాయల షేర్‌ను 360 రూపాయలకు కొనడం తప్పేంకాదు. అది కొనే వారి ఇష్టం. నేను వెయ్యి రూపాయలకు కొంటాను. ఎవరు నన్ను అడ్డుకుంటారు? ఒకవేళ అవినీతి జరిగినట్లు భావిస్తే అప్పట్లో మంత్రివర్గ సభ్యులందరినీ బాధ్యులను చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేదు? అడ్వొకేట్ జనరల్ కౌంటర్ ఎందుకు వేయలేదు? వీటన్నిటినీ చూస్తే ప్రభుత్వ దురుద్దేశం స్పష్టమవుతోంది. పాలకపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పుడు వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే. జగన్ టార్గెట్ చేయడం వదిలేసి ప్రభుత్వం తీరుపై స్పందించాలి. సీఎం తనకిష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నా కేబినెట్ బాధ్యత వహించదా? తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇద్దరు వ్యక్తులు తమను ప్రభావితం చేశారని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల అన్నారు. వ్యక్తులు ప్రభావితం చేసే స్థితిలో ప్రభుత్వాలు ఉంటే ఎలా?’’ అని నిలదీశారు.
చట్టం పాలకపార్టీలకు చుట్టం: న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి
చట్టం పాలకపార్టీలకు చుట్టంగా మారింది. ప్రధాన మంత్రి, సోనియాగాంధీల ఆదేశాల మేరకే సీబీఐ పనిచేస్తోంది. ఓ కేసులో సీబీఐ 2001లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే 2004లో చార్జిషీట్ దాఖలు చేశారు. జగన్ కేసులో ఆగమేఘాల మీద దర్యాప్తు చేస్తోంది. రోజుల వ్యవధిలోనే చార్జిషీట్‌ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.