Post date: May 20, 2012 6:26:26 AM
చిదంబరాన్ని కలిసినందుకే బాబుపై దర్యాప్తు జరగడం లేదు
ప్రసాద్ చేసిన పాపమేంటి?
చంద్రబాబు చేసింది మీకుకనబడడం లేదా?చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డి కూడా ఈ రోజు అవినీతి గురించి మాట్లాడుతున్నారు
1978లో రెండెకరాలతో రాజకీయాల్లోకొచ్చిన బాబుకు ఇన్ని కోట్ల ఆస్తులెక్కడివి?
కోవూరు ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.1000 పంచింది మీరే కదయ్యా కిరణ్‌కుమార్‌రెడ్డీ?
అవినీతి మీరు చేసి.. నన్నెలా తప్పు పడతారయ్యా?
కాంగ్రెస్ పార్టీ పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరూ పూర్తిగా కుమ్మక్కైపోయారని, కుమ్మక్కై..చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చనిపోయిన మహానేతపై, బతికున్న చంద్రబాబుపై సీబీఐ చేస్తున్న దర్యాప్తు తీరే వారి కుమ్మక్కుకు నిదర్శనమని స్పష్టంచేశారు.
‘‘అయ్యా చంద్రబాబూ.. ఈ రోజు నీ మీద ఎందుకు సీబీఐ దర్యాప్తు జరగడం లేదూ అంటే.. కారణం రాత్రి పూట నువ్వు చిదంబరాన్ని(కేంద్ర హోం మంత్రి) కలుస్తున్నావు కాబట్టి! నా మీద విచారణ ఎందుకు జరుగుతోందీ అంటే.. నేను ఢిల్లీ పెద్దలకు తలవంచడం లేదు కాబట్టి!’’ అని జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ‘‘మీ తప్పులను ఎవరు చూసినా చూడకపోయినా పైన దేవుడు చూస్తుంటాడు. ఏదో రోజు ప్రజా ఉప్పెన వస్తుంది. ఆ ఉప్పెనలో కాంగ్రెస్, టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం..’’ అని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫున జగన్ శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని చర్చిసెంటర్లో జరిగిన రోడ్డుషోలో జనవాహినిని ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో చెప్పాలంటే.. ఇవాళ సీబీఐ దర్యాప్తు తీరును చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. దివంగత నేత తిరిగి రాలేడని, ఆయన తరఫున ఎవరూ మాట్లాడరని, ఆయన్ను అప్రతిష్టపాలు చేయడానికి సీబీఐ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒక ఉదాహరణ చెప్తున్నా.. ఇవాళ వాన్‌పిక్‌కు సంబంధించి ప్రసాద్ గారిని (నిమ్మగడ్డ ప్రసాద్) తీసుకుపోయి సీబీఐ జైల్లో వేసింది. అయ్యా సీబీఐవారూ.. ప్రసాద్ చేసిన పాపమేంటయ్యా? చంద్రబాబు చేసింది మీకు కనబడడం లేదయ్యా? ఆయనే కృష్ణపట్నం పోర్టిచ్చాడు.. కాకినాడ పోర్టిచ్చాడు.. గంగవరం పోర్టిచ్చాడు.. చివరకు వాన్‌పిక్ ప్రాజెక్టు కూడా చంద్రబాబే ఇచ్చాడయ్యా... ఇవన్నీ మీకు కనబడడం లేదాయ్యా? అని అడుగుతున్నా.
ఉపాధి కోసం భూములివ్వడం తప్పా?
సీబీఐ విచారణ ఎలా ఉందంటే.. వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించి.. వేలాది మందికి ఉపాధి కల్పించడానికి వైఎస్ భూములు లీజుకిస్తే తప్పు పడుతోంది. వేలాది మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో రెండు పెద్ద సంస్థలకు 75 ఎకరాల చొప్పున 25 ఏళ్లపాటు వైఎస్ రాజశేఖరరెడ్డి లీజుకు ఇచ్చారు. ఎకరం రూ.15 లక్షల విలువైన భూమిని రూ.8 లక్షలకే ఇచ్చారని వైఎస్‌ను సీబీఐ తప్పుపడుతోంది. రాష్ట్రంలో మరొక వైపు ఎమ్మార్ కేసునూ సీబీఐ విచారిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున విలాసవంతమైన బంగ్లాలు, గోల్ఫ్‌కోర్సు, ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మించడానికి 535 ఎకరాల భూమిని ఎమ్మార్‌కు చంద్రబాబు ధారాదత్తం చేశారు. ఎకరం రూ.4 కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.29 లక్షలకే అప్పగించేశారు. అదీ పరిశ్రమలు స్థాపించడానికీ కాదు.. వేలాది మందికి ఉపాధి కల్పించడానికి కూడా కాదు.. శ్రీమంతులు కర్ర, బాలు, గుంతతో ‘గోల్ఫ్’ ఆట ఆడుకోవడానికట.. విలాసవంతమైన విల్లాలు కట్టుకోవడానికట. ఇది మాత్రం సీబీఐకి కన్పించదు. సీబీఐ కనీసం చంద్రబాబు వైపు కన్నెత్తి కూడా చూడదు. కానీ చనిపోయిన వైఎస్ మీద మాత్రం అభాండాలు వేస్తారు.
అవినీతిపై చంద్రబాబా మాట్లాడేది?
చివరకు చంద్రబాబు ఈ రోజు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. రెండెకరాలతో రాజకీయాల్లోకొచ్చిన నీకు.. ఈ రోజు ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పగలవా బాబూ? ఇదే చంద్రబాబు అవినీతి గురించి పిల్లల దగ్గరకెళ్లి లెక్చర్లిస్తున్నారు. అయ్యా చంద్రబాబూ తొమ్మిదేళ్లు పాలిం చావు... ఆ తొమ్మిదేళ్లలో ఎప్పుడైనా పిల్లల దగ్గరకెళ్లావా? వెళ్లి వారి కష్టాలు చూశావా? వారిని చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నావా?
నేనేమైనా హోటల్ నడుపుతున్నానా?
ఇవాళ రాజకీయాలు ఎంతగా చెడిపోయాయీ అంటే. చివరకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అవినీతి గురించి మాట్లాడతారు. నా ఇంట్లో 70 రూములున్నాయంట.. నేను అడగదలచుకున్నా.. అయ్యా నేనేమైనా హోటల్నడుపుతున్నానా.. 70 రూములు ఉండడానికి? మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కోవూరులో ఓటుకు రూ.1000 పంచింది నేను కాదు కదయ్యా.. మీరే కదయ్యా అని అడుగుతున్నాను. ఓటుకు రూ.1000 ఒకరు పంచుతారు.. రూ.500 మరొకరు పంచుతారు. మద్యాన్ని ప్రతి గ్రామంలో ఇద్దరూ కూడా సెలయేరులా ప్రవహింపచేస్తారు. చేస్తూ.. అవతలి వ్యక్తివైపు వేలు చూపించి అవినీతిపరుడంటారు.. చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు మీరిద్దరూ అవినీతిపరులు.. నేను ఏ రోజూ సీఎం స్థానంలో కూర్చోలేదు.. ఏ ఐఏఎస్‌కూ ఫోన్చేయలేదు.. ఏ రోజూ కూడా ఫలానా పనిచేయమని ఏ మంత్రికీ ఫోన్చేయలేదు.. నన్నెలా తప్పుపడతారయ్యా మీరు? అవతలి వ్యక్తివైపు వేలు చూపించేటపుడు. నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తున్నాయని గుర్తుంచుకోండి.
పార్టీలో చేరిన ప్రముఖులు
మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య, మాజీ మంత్రి పాలేటి రామారావు, వడ్డెర ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు రాఘవులు శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా శనివారం మాత్రమే ఒంగోలులో ప్రచారం చేసేలా తొలుత ఖరారైన జగన్మోహన్రెడ్డి పర్యటనను మరో రోజు పొడిగించారు. ఆదివారం కూడా ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారు