Post date: Aug 21, 2011 10:34:59 AM
రాజీనామాలు చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని.. జగన్ వర్గం ఎమ్మెల్యేలు అధికారికంగా ప్రకటించారు. రాజీనామాలు చేస్తారనే ఊహాగానాల మధ్య.. ఈ విషయాన్ని ధృవీకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమై.. రాజీనామాల నిర్ణయం తీసుకున్నట్లు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. సీబీఐ ముసుగులో వైఎస్ ను నేరస్తుడిగా చిత్రీకరిస్తుండటంతోనే ఈ రాజీనామాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. వైఎస్ మరణంపై ఎన్నో అనుమానాలున్నాయన్నారు. వైఎస్ వల్లే కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఆయన్ని అభిమానించే నేతలంతా దీన్ని ఎదుర్కొనేందుకే రాజీనామాలు చేస్తున్నామని సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ఇక ఒక్క క్షణం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండమని స్పష్టం చేశారు. ఎవరెవరు రాజీనామాలు చేస్తారో ఆయన చదివి వినిపించారు. ఇద్దరు ఎంపీలు మేకపాటి, సబ్బం హరి లతో పాటు.. మరో 28 మంది ఎమ్మెల్యేల సోమవారం రాజీనామాలు చేస్తారని సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ఇందులో ఇద్దరు తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యులున్నారు. తెలంగాణ కోసం ఇంతకుముందే ముగ్గురు రాజీనామాలు చేశారు. వారితో కలిపి.. మొత్తం ఇప్పటివరకు 28 మంది ఎమ్మెల్యులున్నట్లు తెలిపారు. కాగా సోమవారం నాటికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా బోస్ చెప్పుకొచ్చారు. మరోవైపు వైఎస్ ను అభిమానించే నాయకులంతా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబోస్ పిలుపునిచ్చారు.