Post date: Jul 25, 2011 6:11:1 AM
మళ్లీ మళ్లీ అదేతీరు చందాన వైఎస్ జగన్‌పై బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన ఆరోపణలకు సంక్షిప్త సమాధానాలను దిగువనిస్తున్నాం. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబం ధించి వివరణలు గడిచిన మూడేళ్ళలో ‘ఏది నిజం’ ద్వారా పలుమార్లు వెలువడ్డాయి. స్థలాభావం దృష్ట్యా వాటినిక్కడ ఇవ్వలేకపోయినా... సమగ్రంగా ‘సాక్షి’ వెబ్ ఎడిషన్ www.sakshi.com లో చూడవచ్చు.
ఆరోపణ:తండ్రి అధికారంతో పలు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు భూములు, గనుల కేటాయింపు, లెసైన్సులు మంజూరు చేయించటం ద్వారా జగన్ భారీగా ముడుపులు స్వీకరించారు.
జగన్ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వానికి నష్టం అంటే సమాజానికే. అంటే ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లే. అందువల్ల ఈ వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.
సమాధానం:వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న అయిదు సంవత్సరాల మూడునెలల కాలంలో జగన్ ఏనాడూ సెక్రటేరియట్‌కు వెళ్లింది లేదు. ఏ ఒక్క అధికారినీ కలిసింది లేదు. కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసింది లేదు. లెసైన్సుల మంజూరు, భూ కేటాయింపుల వంటివన్నీ మంత్రివర్గ నిర్ణయాలే తప్ప ముఖ్యమంత్రి కుమారుడి ప్రమేయం ఇందులో ఏకొశానా ఉండదు.
ఆరోపణ:అవినీతి ఆర్జితంగా వచ్చిన నల్లధనాన్ని వివిధ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టించి తెల్లధనంగా మార్చుకున్నారు. హవాలా, మనీ ల్యాండరింగ్ ద్వారా డబ్బు మారిషస్‌కు తరలించి, మళ్లీ వెనక్కి తీసుకువచ్చి సొంత కంపెనీల్లో అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారు.
సమాధానం:ఎలాంటి ఆధారాలూ లేకుండా చేసే ఇలాంటి ఆరోపణలకు విలువ ఉండదు.
ఆరోపణ:అక్రమ సొమ్ము మళ్లింపులతో జగతి పబ్లికేషన్స్‌ను, ఇందిరా టెలివిజన్‌ను నెలకొల్పారు.
2008-09 ఆర్థిక సంవత్సరానికి జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ రూ.250 కోట్ల నష్టాన్ని చూపింది. ఇలాంటి సంస్థలో భారీగా ప్రీమియం చెల్లించి వాటాలు తీసుకున్నారు. ప్రయోజనానికి ప్రతిఫలంగానే ఈ పెట్టుబడులు పెట్టారు.
సమాధానం:ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి నిజాలను కనీసం పది సందర్భాల్లో ‘ఏది నిజం’ పాఠకుల ముందుంచింది. సాక్షిలో పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టినది ఈ ప్రాజెక్టు సాకారం అవుతున్న దశలో మాత్రమే. ఇది జగన్ సొంత పెట్టుబడులతో ప్రారంభమైన సంస్థ. ఇతర పారిశ్రామికవేత్తలు ఈ భారీ ప్రాజెక్టు విజయానికి ఉన్న అవకాశాలను గమనించి, ప్రారంభానికి కొద్ది నెలల ముందు పెట్టుబడులతో ముందుకు వచ్చారు. ఇక్కడే కొన్ని ఆసక్తికర అంశాలను చెప్పుకోవాలి.
ఈనాడుకు పది లక్షల సర్క్యులేషన్ చేరుకోవటానికి అది ప్రారంభమైన తరవాత దాదాపు పాతికేళ్లు పట్టింది. అదే సాక్షికి ప్రారంభ సంవత్సరంలోనే సర్క్యులేషన్ 12.5 లక్షలకు పైగా ఉంది. ఇప్పుడు సాక్షి సర్క్యులేషన్ 14.5 లక్షలకు, రీడర్షిప్ 1.39 కోట్లకు చేరింది. దేశంలోనే తొమ్మిదో అతిపెద్ద పత్రికగా అవతరించింది. నష్టాల్లో ఉన్న ఈనాడు గ్రూపు తన ఆస్తి విలువను 7,000 కోట్లుగా నిర్ణయించి వాటాలు అమ్మింది. ఏ పత్రిక అయినా లాభాల బాటలోకి రావాలంటే కనీసం మూడు నుంచి అయిదేళ్లు పడుతుంది. సాక్షి భవిష్యత్తులో పబ్లిక్ ఇష్యూకు వెళ్లినప్పుడు అంతకు మించి విలువ దక్కుతుందన్నది అనుమానానికి తావేలేని అంశం. అలాంటప్పుడు తమకు లభించే లాభాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే వార్తాపత్రికల్లో పెట్టుబడులు పెడతారు. కాబట్టి ఇప్పటికిప్పుడు లాభాలు రాలేదన్న వాదనకు విలువే లేదు.
ఆరోపణ:రాంకీ గ్రూపునకు చెందిన ఏరిస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జగతి పబ్లికేషన్స్‌లో అధిక ప్రీమియంతో షేర్లను కొనుగోలు చేయగా ఆ సంస్థకు తక్కువ ధరకు గచ్చిబౌలీలో విలువైన హౌసింగ్ బోర్డు స్థలాన్ని, విశాఖలో సెజ్‌ను కేటాయించారు.
సమాధానం:ఇది పచ్చి అబద్ధం. రాంకీ గ్రూపునకు భూకేటాయింపు ప్రక్రియ తెలుగుదేశం హయాంలోనే మొదలయింది. రాంకీని అర్హుల జాబితాలో చేర్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే.
హెటిరో గ్రూపునకు నక్కపల్లి, జడ్చర్ల సెజ్‌లలో 240 ఎకరాలను కేటాయించగా, ఆ సంస్థ జగతిలో వాటాలను కొనుగోలు చేసింది.
సమాధానం:హెటిరో గ్రూపు జడ్చర్లలో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన ఫార్మా సిటీలో 75 ఎకరాలను 33 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఇదొక్కటే కాదు ఎన్నో కంపెనీలు ఆ సెజ్‌లో భూములు లీజుకు తీసుకున్నాయి. భూముల కేటాయింపులపై ప్రచారం అసత్యం. జగతిలో వాటా కొనుగోలు హెటిరో సొంత నిర్ణయం.
ఆరోపణ:నాదర్గుల్లో 595 ఎకరాల కొనుగోలు వ్యవహారంలో లబ్ధి పొందిన పీవీపీ బిజినెస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జగన్సంస్థలో భారీ ప్రీమియంతో వాటాలు కొనుగోలు చేసింది.
సమాధానం:నాదర్గుల్ వ్యవహారంలో పొట్లూరి వరప్రసాద్‌కు ఒక్క పైసా లబ్ధి కూడా చేకూరలేదు. పొట్లూరి వరప్రసాద్ దక్షిణ భారతదేశంలో మీడియా పరిశ్రమలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన వ్యక్తుల్లో ఒకరు. ఆయన పెట్టుబడులు పూర్తిగా వ్యాపార నిర్ణయంలో భాగం మాత్రమే.
ఆరోపణ:జగన్ కారణంగా గాలి జనార్ధన్‌రెడ్డికి ప్రభుత్వం ఓబుళాపురం గనులు కేటాయించింది. తక్కువ ధరకు బ్రహ్మణీ స్టీల్‌ప్లాంట్, ప్రైవేటు విమానాశ్రయానికి 10,760 ఎకరాలను కేటాయించింది. దీనికి ప్రతిఫలంగా పలు బినామీ కంపెనీల ద్వారా జగన్‌కు భారీగా డబ్బు సమకూరింది.
సమాధానం:గాలి జనార్దనరెడ్డి సాక్షిలో గాని, జగన్ సంస్థల్లో గాని ఒక్క పైసా పెట్టుబడి పెట్టింది లేదు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల వద్ద ఎలాంటి ఆధారాలూ లేవు.
ఆరోపణ:సాండూర్ పవర్కంపెనీని 2001లో స్వాధీనం చేసుకున్న జగన్... వైఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే కంపెనీలోకి అక్రమ పద్ధతుల్లో నిధులు తరలించారు.
సమాధానం:సాండూర్ పవర్లో పెట్టుబడులు పెట్టిన ఇతర కంపెనీలపై అధికారంలో ఉన్న వారు కత్తిగట్టడంతో, ఆ కంపెనీల పెట్టుబడులను వెనక్కు ఇచ్చేశారు. ఈ కంపెనీలు పెట్టుబడులకన్నా 10 శాతం లాభంతో తమ పెట్టుడులను వెనక్కి తీసుకున్నాయి. కాబట్టి, అక్రమ పద్ధతుల్లో నిధుల తరలింపు అనే ఆరోపణకు అర్థమే లేదు.
ఆరోపణ:దాల్మియా, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు సర్కారు వల్ల పొందిన లబ్ధికి ప్రతిఫలంగా భారతి సిమెంట్స్‌లో వాటాలు కొనుగోలు చేశాయి.
సమాధానం:దాల్మియా, ఇండియా సిమెంట్స్ సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏలబ్ధీ చేకూర్చలేదు. ప్రపంచ సిమెంటు రంగంలోని అగ్రగామి కంపెనీల్లో ఒకటి అయిన వికా అనే ఫ్రెంచి కంపెనీకి భారతి సిమెంట్‌లో మెజారిటీ వాటా అమ్మి, ఈ కంపెనీలో తనతో బాటు పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ కంపెనీలకు జగన్ మూడేళ్లలోనే లాభాల పంట పండించారు. భారతిలో పెట్టుబడుల ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్‌కు రూ. 265 కోట్లు, దాల్మియా సిమెంట్స్‌కు రూ.41 కోట్లు, ఇండియా సిమెంట్స్‌కు రూ. 25 కోట్లు లాభాలు వచ్చాయి. ప్రభుత్వం ద్వారా వచ్చిన లబ్ధికి ప్రతిఫలంగా పెట్టుబడులు పెట్టి ఉంటే... అవి రామోజీ సంస్థల్లో పెట్టుబడుల మాదిరి గోడకు కొట్టిన సున్నంలా వెనక్కు వచ్చేవి కావు.
ఆరోపణ:అవినీతి నిరోధక చట్టం కింద, మనీల్యాండరింగ్ చట్టాల కింద నేరాలకు పాల్పడిన జగన్‌పై ఇప్పటి వరకూ ఏవైనా చర్యలు తీసుకున్నట్లయితే స్థాయీ నివేదిక సమర్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐ, ఏసీబీలను ఆదేశించాలి.
రాజశేఖరరెడ్డి 2004లో తన ఆస్తుల విలువ రూ. 2.12 కోట్లుగా ఎన్నికల కమిషన్ ముందు ప్రకటించారు. 2003-04లో జగన్ తన వార్షిక ఆదాయాన్ని రూ.9,19,951గా ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో పేర్కొన్నారు. 2009లో కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన సమయంలో జగన్ తన ఆస్తుల విలువను రూ. 77.40 కోట్లుగా ప్రకటించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మే, 2004 నుంచి 36 కంపెనీలను జగన్ ఏర్పాటు చేశారు.
సమాధానం:జగన్ ఆస్తుల్లో పెరుగుదల అసాధారణం అంటూ తెలుగుదేశం, ‘ఈనాడు’లతోపాటు కాంగ్రెస్‌లో కొందరు నాయకులూ గడచిన కొన్నేళ్ళుగా గగ్గోలు పెడుతున్నారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి కాక మునుపూ తెలుగుదేశం, రామోజీలది ఇదే బాణీ. జగన్ కంపెనీలు, ఆస్తులకు సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం సాక్షాత్తు శాసన సభలోనే రాజకీయం మొదలుపెట్టారు.
పారిశ్రామిక వేత్తగా తన ఎదుగుదలకు సంబంధించి జగన్ గడచిన నాలుగేళ్ళలో అనేక పర్యాయాలు పూసగుచ్చినట్టు వివరణలిచ్చారు. 2003-04 నాటికే సాండూర్ కంపెనీ దాదాపుగా పూర్తి అయింది. అంటే అది పెట్టుబడులు పెడుతున్న దశ. ఆ దశలోనూ జగన్ ఆస్తుల విలువ దాదాపు 20 కోట్లకు పైనే.ఒక కంపెనీ స్థాపిస్తున్న దశలో దాని విలువకు, నిర్మాణం పూర్తి అవుతున్న దశలో దాని విలువకు, పూర్తి అయి ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న దశలో దాని విలువకు మధ్య ఎంతో తేడా ఉంటుంది. కార్పొరేట్, పారిశ్రామిక రంగాలమీద అవగాహన ఉన్న అందరికీ తెలిసిన నిజమే ఇది. అదీకాక... పెట్టిన పెట్టుబడులకు ఎన్నో రెట్లు మార్కెట్లో విలువను పొందిన అనేక సంస్థలు కనిపిస్తాయి.
ఆస్తికి, ఆదాయానికి మధ్య తేడా కూడా తెలియని వారు 2003-04 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జగన్మోహన్రెడ్డి రిటర్నుల విషయంలో చేస్తున్న దుష్ర్పచారానికి అంతే లేదు. ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలుగుదేశం చేస్తున్న ప్రచారం... నాటికి ఆయన ఆస్తి తొమ్మిది లక్షలన్నది. అప్పట్లో జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో పోటీచేయలేదు.
కాబట్టి, ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. ఐటీ రిటర్నుల్లో పేర్కొన్న రూ.9.19 లక్షలు ఇన్‌కం (ఆదాయం). ఇది ఆదాయమే తప్ప ఆస్తికాదు. 2009లో కడప లోక్‌సభ నియోజక వర్గానికి పోటీపడుతున్నప్పుడు ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించినది వ్యక్తిగత ఆస్తుల వివరాలను. చంద్రబాబు అయినా మరే నాయకుడు అయినా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సింది వ్యక్తిగత ఆస్తుల వివరాలను మాత్రమే. ఉదాహరణకు, హెరిటేజ్ చంద్రబాబుదే అయినా చట్టం ప్రకారం కంపెనీ ఆస్తులు వేరు... చంద్రబాబు ఆస్తులు వేరు.
2003-04లో ఐటీ రిటర్నుల్లో జగన్మోహన్రెడ్డి పేర్కొన్నది ఆదాయాన్ని. 2009లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించినది ఆస్తులను. అప్పట్లో జగన్ మొత్తం ఆస్తుల్లో బాండ్లు/డిబెంచర్లు/మ్యూచువల్ఫండ్ యూనిట్లు లాంటి చరాస్తుల విలువ రూ.37.99 కోట్లు. తాజా వివరాల ప్రకారం చరాస్తుల విలువ రూ. 359.55 కోట్లు. అదనంగా కనిపిస్తున్న రూ.312 కోట్లు జగన్మోహన్రెడ్డి అదనంగా పెట్టుబడులు పెట్టిన సొమ్ము. భారతి సిమెంట్‌లో వాటా అమ్మకం ద్వారా వచ్చిన లాభాన్ని ఇలా జగన్ చరాస్తుల్లో పెట్టుబడి పెట్టారు. ఈ చరాస్తులు మినహాయిస్తే 2009తో పోల్చినపుడు జగన్ ఆస్తుల విలువ పెరిగింది లేదన్నది స్పష్టం అవుతుంది. చరాస్తులు పెరిగింది కూడా భారతి సిమెంటులో మెజారిటీ వాటా అమ్మగా వచ్చిన నగదును పెట్టుబడిగా పెట్టినందువల్ల మాత్రమే.
ఆరోపణ: నిబంధనలకు విరుద్ధంగా వాన్‌పిక్ ప్రాజెక్టులకు ప్రభుత్వం 15,000 ఎకరాలను కేటాయించింది. ప్రతిగా వాన్‌పిక్‌కు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ జగతిలో రూ.650 చొప్పున 21.42 లక్షల వాటాలు కొనుగోలు చేశారు.
సమాధానం:వాన్‌పిక్ ప్రాజెక్టును ప్రారంభించినది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే. చెక్ రిపబ్లిక్ వాన్‌పిక్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాంతం లాభసాటి కాదని వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలోనే రస్ అల్ ఖైమా (ఆర్ఏకే) రంగప్రవేశం చేసింది. స్థానికంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని కలుపుకొని వెళ్లే క్రమంలో నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టులో యాదృచ్ఛికంగా భాగస్వామి అయ్యారు. జగతిలో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులను ప్రశ్రీనస్తున్న వారు మరో అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీడియా పరిశ్రమలో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు కేవలం సాక్షికి మాత్రమే పరిమితం కావు. ఉదాహరణకు, మా టీవీలో నిమ్మగడ్డ ప్రసాద్ మెజారిటీ షేర్ హోల్డర్.