Post date: Mar 01, 2012 4:21:15 AM
వైఎస్ కుటుంబంపై కక్ష ఉంటే మామీదే తీర్చుకోండి
దివంగత నేతపై కోపాన్ని ఆయన పథకాలపై చూపకండి
ప్రజలను ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయకండి
బడ్జెట్‌పై సాధారణ చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు
బడుగు రైతులు, నేత కార్మికులు, రోగులు, విద్యార్థులపై ఎందుకు మీకంత కక్ష?
చనిపోయి రెండేళ్లవుతున్నా వైఎస్‌ను అభిమానిస్తున్నందుకేగా..
పన్నుల పెంపుతో రాబడి భారీగా ఉన్నా సంక్షేమ పథకాలను
ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదు?..
పన్నులు, ధరల పెంపుతో ప్రజల జీవితాలను దుర్భరం చేయడంలో
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి..
వైఎస్ సర్కారు ఐదేళ్లలో పైసా పన్ను వేయలేదు..
కేవలం 26 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయి దీనావస్థలో ఉన్న కాంగ్రెస్‌ను కష్టపడి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై కోపం ఉంటే.. తమపై తీర్చుకోవాలేగానీ ఆయనను అభిమానించే ప్రజలను ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదేళ్లపాటు రూపాయి కూడా పన్ను పెంచకుండానే ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఉచిత వైద్యసేవలు అందించిన విషయం ఆమె గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా అదనంగా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని చెప్పారు. రకరకాల పన్నులు పెంచి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెంచుకుని కూడా సంక్షేమ పథకాలను ఎందుకు సక్రమంగా అమలు చేయలేకపోతున్నారంటూ సర్కారును నిలదీశారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో విజయమ్మ పాల్గొన్నారు. ‘‘రాజశేఖరరెడ్డిగారి మీద కసి ఉంటే మా మీద ఎటువంటి చర్యలు అయినా తీసుకోండి. కానీ బడుగు రైతులు, నిరుపేదలు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రోగులపై మీకెందుకంత కక్ష? చనిపోయి రెండేళు ్లదాటినా వైఎస్ఆర్ను ఇంకా అభిమానిస్తున్నారనేగా? ైవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీకు చేసే వినతి ఒక్కటే. ఆయనమీద ఉన్న కోపాన్ని ఆయన పథకాల మీద, ఆయనను అభిమానించే పేదల మీద చూపించకండి’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.
కేంద్రం గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచినా వైఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆ భారాన్ని ప్రజలపై పడనీయని విషయాన్ని గుర్తు చేశారు. గత మూడేళ్లలో ఏ ఏడాదీ ప్రభుత్వ ఆదాయ వృద్ధి రేటు 20% కూడా తగ్గకపోయినా పన్నులు పెంచాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను విజయమ్మ ప్రధానంగా ప్రస్తావించారు. 15 నిమిషాలకు పైగా సాగిన విజయమ్మ ప్రసంగాన్ని సభ్యులంతా నిశ్శబ్దంగా శ్రద్ధగా ఆలకించారు. ఒక సందర్భంలో టీడీపీ సభ్యులు అడ్డుకోబోగా.. మిగతా సభ్యులు గట్టిగా వారించడంతో వారు మిన్నకుండిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ సమయంలో సభలో లేరు.