Post date: Apr 15, 2011 6:12:35 AM
కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ‘దళిత సంక్షేమ రథయాత్ర’ను ప్రారంభించనున్నట్లు మాలమహానాడు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, మాజీ మంత్రి ఎం.మారెప్ప, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున, బీఎస్పీ(ఏపీ) మాజీ అధ్యక్షుడు ఎన్.సూర్యప్రకాశ్‌రావులు తెలిపారు. ఈ యాత్రను 12న ఇడుపులపాయ నుంచి ప్రారంభిస్తామని, వచ్చే నెల 6 దాకా నిర్వహిస్తామని వారు గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జూపూడి మాట్లాడుతూ ‘కడప వర్సెస్ ఢిల్లీ’ మధ్య జరిగే ఈ పోరులో వైఎస్ కుటుంబాన్ని భారీ మెజార్టీతో గెలిపించి కడప ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌కు జీవం పోసిన వైఎస్ కుటుంబాన్ని అనేక అవమానాలకు గురిచేసిన ఢిల్లీ పెద్దలకు, సోనియాగాంధీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు ఇచ్చారు.
జగన్‌ను ఒంటరి చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయని, ఈ కుట్రను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. దళితుల సంక్షేమంకోసం పాటుపడే యువనేత జగన్‌కు ప్రతి దళిత కుటుంబం మద్దతు ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్ బలమైన శక్తిగా ఎదుగుతున్న తరుణంలో ఆయన మరణం ఓ కుట్రలా చోటు చేసుకుం దని జూపూడి అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మరణించి 18 నెలలు కావొస్తున్నప్పటికీ ప్రజల్లో నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం ఎందుకు నివృత్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఉపఎన్నికలు విశ్వసనీయతకు, నయవంచనకు మధ్య జరిగే పోరని మారెప్ప అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్, విజయమ్మలు నల్లేరుపై నడకలాగా విజయం సాధించడం ఖాయమన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన దళిత సంక్షేమ పథకాలు కొనసాగాలం టే డైనమిక్ లీడర్ అయిన జగన్ సీఎం కావాల్సిందేనన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత యావత్ రాష్ట్రప్రజలూ జగన్‌వైపు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు.