Post date: Aug 23, 2011 6:17:53 AM
రాజధానిలోని పంజగుట్ట చౌరాస్తాలో ఎమ్మెల్యేలు వైఎస్‌కు నివాళులర్పించిన సందర్భంగా ఆ ప్రాంతమంతా జనసంద్రమే అయింది. ‘వైఎస్సార్ అమర్ రహే... జై జగన్...’ అంటూ నినాదాలు మిన్నంటాయి. ఉదయం 8 గంటల నుంచే విగ్రహం వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు నగరం నలుమూలల నుంచి వేలాదిగా రావటం ప్రారంభించారు. ఎమ్మెల్యేల బస్సు రాగానే పెద్ద పెట్టున నినదిస్తూ వారికి జేజేలు పలికారు. ఎమ్మెల్యేలు బస్సు నుంచి దిగుతుండగా వారిపై గులాబీ పూలు చల్లారు. నైతిక విలువలకు కట్టుబడిన నిజమైన నేతలుగా వారిని కీర్తించారు. వచ్చే ఎన్నికల్లో కడప ఉప ఎన్నికల తరహాలో ఫలితాలు తీసుకువచ్చి ఘన విజయాన్ని సాధించిపెడతామన్నారు.
పిల్లి సుభాష్‌చంద్రబోస్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండా సురేఖ విగ్రహం గద్దెపైకి ఎక్కగానే అంతా జయజయధ్వానాలతో జై కొట్టారు. బస్సులో కూర్చున్న జయసుధ, మిగతా ఎమ్మెల్యేలు వారికి అభివాదం చేశారు. రోజా, జూపూడి, గట్టు రామచంద్రరావు తదితరులు కూడా బస్సులో వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ రాజ్‌సింగ్‌ఠాకూర్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు ద్విచక్రవాహనాల ర్యాలీలు జరిగాయి.
కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, మేకా శేషుబాబు, సి.నారాయణరెడ్డి వెంట రాగా నేతలు అక్కడి నుంచి బయల్దేరి ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. వారిని దారి పొడవునా పెద్ద సంఖ్యలో మోటారు సైకిళ్లు, స్కూటర్లతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తూ ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ వచ్చారు.