Post date: Apr 30, 2011 10:38:50 AM
జెండాలకతీతంగా ‘జాయింట్’ యాక్షన్... ఎజెండా ఆ ఒక్కడే
యువనేత అన్న ప్రతిమాటకూ వక్రభాష్యాలు చెబుతూ మూకుమ్మడిగా దాడి
పథకం ప్రకారం ఒకే రోజున దుష్ర్పచారం
కడపలో బాబు, చిరు.. ఢిల్లీలో ఉండవల్లి, రాజధానిలో వీహెచ్, జీవిత, రాజశేఖర్
జగనే టార్గెట్‌గా విమర్శల పర్వం
హిందుస్థాన్ టైమ్స్‌లో జగన్ ఇంటర్వ్యూకు విలేకరి సొంత వ్యాఖ్యానం
దాన్నే పట్టుకుని యువనేతపై విమర్శలు ఎక్కుపెట్టిన ఉండవల్లి
బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు కృషి చేస్తానన్న మాటల్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించిన తీరు
ఎవరో ఆదేశించినట్లు అకస్మాత్తుగా తెరపైకి జీవిత, రాజశేఖర్... హాస్యాస్పద వ్యాఖ్యలు
నాడు మహాభారత యుద్ధ సమయంలో జరిగిన కుట్ర.. నేడు కడప ఉప ఎన్నికల్లో నయా రూపం దాల్చింది. తన వీర పరాక్రమంతో మహామహులనుకునే వారికే వణుకు పుట్టించిన యువ అభిమన్యుడిని అడ్డుకునేందుకు పద్మవ్యూహం పన్నిన కురువృద్ధుల తరహాలోనే కడపలో అప్రతిహతంగా దూసుకుపోతున్న జగన్‌ను అడ్డుకునేందుకు అన్ని పక్షాల పెద్దలు కొత్త వ్యూహానికి తెరతీశారు. యువనేత అన్న ప్రతి మాటకు వక్రభాష్యం చెబుతూ మూకుమ్మడిగా ‘మాటే’శారు. పథకం ప్రకారం ఒకే రోజున కలసికట్టుగా దుష్ర్పచారానికి తెగబడ్డారు. ఇటు కడపలో చంద్రబాబు, చిరంజీవి.. అటు ఢిల్లీలో ఉండవల్లి.. రాజధానిలో వీహెచ్.. ఇన్నాళ్లూ మూగనోము పట్టి.. ఎవరో ఆదేశించినట్లు అకస్మాత్తుగా ఉప ఎన్నికల ముందు జీవిత, రాజశేఖర్‌లు కూడా యువనేతపై విమర్శలు గుప్పించడం ఈ మూకుమ్మడి వ్యూహంలో భాగమే. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి వెలువడే హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో యువనేత ఇంటర్వ్యూకు రిపోర్టర్ తనదైన సొంత వ్యాఖ్యానాన్ని జోడించి, కథనాన్ని వండివార్చడం.. దాన్ని ఉండవల్లి అందిపుచ్చుకోవడం గమనార్హం. ఎవరెన్ని మాట్లాడినా.. ఏం చేసినా.. వీరందరి టార్గెట్ ఒక్కరే.. జగన్. అందుకే కడపలో చంద్రబాబు మాట్లాడినా.. చిరంజీవి ప్రసంగించినా జగనే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. అక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తోందన్న సంగతిని బాబు.. టీడీపీ తమ ప్రత్యర్థే అన్న విషయాన్ని చిరంజీవి మరిచిపోయారు. అయితే, వారింకో సంగతీ మరిచిపోయారు.. జగన్ అభిమన్యుడనుకొని పద్మవ్యూహం పన్నారు. కానీ ఆయన అర్జునుడిలా దాన్ని ఛేదిస్తాడని జనం ఘంటాపథంగా చెబుతున్నారు.
అవినీతిలో దేశానికే ఆదర్శప్రాయుడని ‘తెహల్కా’ పత్రిక వేనోళ్ల తెగడినా.. దేశంలో అసలైన ‘నల్ల’దొంగ.. అలీబాబా.. చంద్రబాబే అని హసన్ అలీ స్వయంగా చెప్పినా.. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్న రీతిలో చంద్రబాబు మహానేత వైఎస్‌పై అక్కసు వెళ్లగక్కడం ద్వారా మరోసారి ఆకాశంపై ఉమ్మేయడానికి ప్రయత్నించారు. తాను గతంలో బీజేపీని భుజాన వేసుకున్న విషయాన్ని మరిచి.. జగన్‌కు బీజేపీతో లేని బంధాన్ని ముడేయడానికి శతథా యత్నించారు. బాబుగారొస్తే.. ఉచిత కరెంటు 9 గంటలిచ్చేస్తారట..! నారావారి నీరో పాలనలో విద్యుత్ చార్జీలు తగ్గించమన్నందుకే తూటాలతో అమాయకుల గుండెలు చీల్చిన దారుణాన్ని.. ఉచిత కరెంటు ఇస్తే.. తీగలపై బట్టలారేసుకోవాల్సిందే అంటూ ఎకసెక్కాలు ఆడిన గతాన్ని మరిచిపోయారీ గజినీ సారు!
చిరంజీవికి గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా కలిసి చాచి పెట్టి కొట్టిన చెంప దెబ్బ గుర్తొచ్చిందో ఏమో.. కడప ప్రజలు జగన్‌కు చెంపదెబ్బ కొట్టబోతున్నారంటూ డైలాగులు కొట్టారు. రాజకీయాల్లో జీరోనని సొంతపార్టీ వాళ్లతో కూడా అనిపించేసుకున్నాక.. అమ్ముకోడానికి ఇంకేమీ లేక.. అధికారం కోసం ఆత్మగౌరవాన్ని మేడం పాదాల వద్ద తాకట్టు పెట్టిన చిరుకు.. జగన్ నినదిస్తున్న ఆత్మగౌరవం విలువ ఏమిటో తెలియకపోవడం పెద్ద వింతేమీ కాదు. అందుకే తనకు మాత్రమే సొంతమైన అహంకారాన్ని యువనేతకు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఏ నోటితో కాంగ్రెస్ తిట్టారో.. అదే నోటితో తెగ పొగిడేశారు. ఉండవల్లి హిందుస్థాన్ టైమ్స్‌లో రిపోర్టర్ సొంత వ్యాఖ్యానాన్నే ప్రధానంగా తీసుకుని.. జగన్ కాంగ్రెస్‌ను ఎందుకు వీడారంటూ ప్రశ్నలు గుప్పించేశారు. ఈ ఇంటర్వ్యూలో జాతీయ రాజకీయాల గురించి జగన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయడానికి తాను కృషి చేస్తానని చెప్పిన మాటలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ఇంటర్వ్యూలో భాగంగా విలేకరి అడిగిన మరో ప్రశ్నకు జవాబుగా.. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని జగన్ చెప్పారు. తనకు ఎంపీల బలముండి.. ఒకవేళ ఎవరికైనా మద్దతివ్వాల్సిన పక్షంలో ముఖ్యమైన శాఖలు తమిళనాడు, బెంగాల్ లాంటి రాష్ట్రాలు తన్నుకుపోకుండా.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా కీలక శాఖలను అడిగి తీసుకుంటానని చెప్పారు. దీనికి సదరు రిపోర్టర్ జగన్ సోనియాకు మద్దతివ్వడానికి సిద్ధమేనంటూ సొంత కామెంట్రీ జోడించగా.. దీన్ని పట్టుకుని ఉండవల్లి యువనేతపై విరుచుకుపడటం గమనార్హం. ఇక ఏ రోజున ఏ పార్టీలో ఉంటారో తెలియని జీవిత, రాజశేఖర్ గురించి మాట్లాడుకోవడమే దండగ. విజయవాడ దీక్షలో రాజశేఖర్ ప్రజాదరణ చూసి జగన్ ఓర్వలేకపోయారట!! ఆ మాట అన్నప్పుడు అక్కడే ఉన్న విలేకరులు సైతం నవ్వుతారేమో అన్న ఆలోచనే లేకుండా ఏదేదో అనేశారు. వీహెచ్ స్థాయి గల్లీకి ఎక్కువ.. ఢిల్లీకి తక్కువ. ఆయన దయాదాక్షిణ్యాల వల్లే వైఎస్ పీసీసీ అధ్యక్షుడయ్యారట..! మైనార్టీలకు మంచి చేసిన మహానేతను తిడుతూ.. ముస్లింలకు రిజర్వేషన్లు అసాధ్యమని తేల్చేయడం ద్వారా మైనార్టీలపై కాంగ్రెస్‌కున్న ప్రేమను మహదర్జాగా చాటారు.