Post date: Mar 24, 2012 7:37:6 AM
ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పుకొన్న ప్రజలు
ఆయన ప్రవేశపెట్టిన పథకాలే మమ్మల్ని ఆదుకున్నాయి
ఆరోగ్యశ్రీ ద్వారా అనేక కుటుంబాలకు మేలు జరిగిందంటూ లబ్ధిదారులు..
ఫీజు రీయింబర్స్‌మెంటుతోనే చదువుకుంటున్నామంటూ విద్యార్థులు..
వారి ఆత్మీయ అనురాగాలకు చలించిపోయిన జననేత
‘‘అన్నా.. మీ నాయన దయ వల్ల మా చెల్లెలి బిడ్డ ఆరోగ్యం బాగుపడింది. చెవికి ఆరు లక్షల ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ.. ఒక్క పైసా ఖర్చులేకుండా ఉచితంగా జరిగింది. మా బాబు వినగలుగుతున్నాడంటే.. రాజన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ చలవే. మాలాంటి ఎందరో కుటుంబాలకు మేలు చేసిన మీ నాయనకు జీవితకాలం రుణపడి ఉంటామన్నా’’.. చిలకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో కిరణ్మయి ఉద్వేగం. సర్జరీ జరిగిన దేవరకొండ హేమంత్‌ను కిరణ్మయి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకొచ్చి ఇలా కృతజ్ఞతలు తెలుపుకొంది. ‘‘బిడ్డా.. రాష్ట్రం బాగుండాలంటే నీవు తప్పక ముఖ్యమంత్రివి కావాలి. దీనికోసం ప్రతిరోజూ కన్నీటి ప్రార్థన చేస్తున్నా’’నంటూ జగన్‌కు అదే పట్టణంలో వృద్ధురాలు పాలపర్తి బుసమ్మ ఆత్మీయ దీవెన.
మీ నాయన వల్లే పెన్షన్ పొందామని కొందరు, ఆరోగ్యశ్రీతో మా జీవితాలు బాగుపడ్డాయని ఇంకొందరు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజనీరింగ్ చదువుతున్నానంటూ విద్యార్థులు... శుక్రవారం గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో(74వ రోజు) భాగంగా చిలకలూరిపేట పట్టణంలో పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఇలా ఎందరో వైఎస్ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. మహానేత మరణించి రెండున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన్ను తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్న వారి అభిమానాన్ని చూసి జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలుకరిస్తూ.. పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
రోడ్లన్నీ జనసంద్రం..
ఓ పక్క ఎండ తీవ్రత.. మరోవైపు ఉగాది పండుగ..
సాధారణంగా జనం ఇల్లు వదిలి బయటకు రారు. కానీ ఇదే రోజు తమ పట్టణంలో పర్యటించిన జగన్‌ను చూడ్డానికి జనమంతా రోడ్లపైకి వచ్చారు. ఇసుకవేస్తే రాలనంత చందంగా ఎటువైపుచూసినా జనమే. కాలనీల్లోని వీధులన్నీ జనసమూహంతో నిండిపోయాయి. చిలకలూరిపేట పట్టణంలో ఒకటి కాదు రెండు కాదు 17 విగ్రహాలను ఏర్పాటుచేసి ప్రజలు మహానేతపై తమ అభిమానం చాటుకున్నారు. కాగా పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, రెడ్లబజార్, గుర్రాలచావిడి, వేలూరుడొంక, ఈస్ట్‌మాలపల్లిలో ఏర్పాటుచేసిన ఐదు విగ్రహాలను జగన్ శుక్రవారం ఆవిష్కరించారు. పట్టణంలో పది గంటలకుపైగా జరిగిన రోడ్‌షో ప్రభంజనంలా సాగింది.
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు:
శుక్రవారం వైఎస్ విగ్రహావిష్కరణ సభల సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త తెలుగు సంవత్సరంలో ప్రజలందరికీమేలు జరగాలని, ముఖ్యంగా రైతన్నల పరిస్థితి మెరుగుపడి కష్టాలు తీరాలని జగన్ ఆకాంక్షించారు.
జగన్‌ను కలిసిన నల్లపరెడ్డి:
వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కలిశారు. ఉప ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో జగన్‌ను చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపి అనంతరం ఓదార్పుయాత్రలో పాల్గొన్నారు.
పవర్ కట్‌తో నష్టపోతున్నామని:
‘విచ్చలవిడిగా కరెంట్ కోతల విధించడం వల్ల ఉత్పత్తిలో 40 శాతానికిపైగా తగ్గిపోయి పారిశ్రామిక రంగంతోపాటు రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నా’ అంటూ గణపవరం ఇండస్ట్రీస్ అసోసియేషన్ కన్వీనర్ నాతాని ఉమామహేశ్వరరావు జగన్‌కు విన్నవించారు. గణపవరం పరిసర ప్రాంతాల్లో పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్, కాటన్ బేల్ ప్రెస్సింగ్, ఆయిల్మిల్స్ డీలింటర్స్, స్పిన్నింగ్, వీవింగ్ పరిశ్రమలు సుమారు 300కు పైగా ఉన్నాయని, అసలే సమస్యలతో సతమతమవుతున్న తమను కరెంట్ కోత ఇంకా ఇబ్బంది పెడుతోందని, తమ పక్షాన నిలిచి పోరాడాలని జగన్‌ను కోరారు.