Post date: Apr 16, 2011 10:12:10 AM
మండుటెండలో మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన తరలి వచ్చిన వేలాదిమంది జనం.. వైఎస్ అమర్హ్రే.. జగన్ నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ పెద్దఎత్తున నినాదాలు. జనంతో పోటెత్తిన పులివెందుల రోడ్లు.. అభిమానుల ఆశీర్వాదాల నడుమ పులివెందుల శాసనసభాస్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా వై.ఎస్. విజయమ్మ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. యువనేత జగన్మోహన్రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ, సతీమణి భారతితో కలసి శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ సమాధి చెంత నామినేషన్ పత్రాలను ఉంచి ప్రార్థనలు చేశారు. అనంతరం పులివెందులలోని తమ గృహానికి చేరుకుని బంధు, మిత్రులతో కలసి ప్రార్థనలు చేశారు.
ఉదయం 8 గంటల నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పులివెందుల నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిమంది జనం జగన్ ఇంటికి చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు జగన్ నివాసానికి వచ్చారు. ఉదయం 10-35 గంటలకు విజయమ్మతో పాటు జగన్, వై.ఎస్.భాస్కరరెడ్డి తదితరులు నామినేషన్ దాఖలు చేయడానికి ఇంటినుంచి కాలినడకన బయల్దేరారు. నాయకులు, కార్యకర్తల సూచనమేరకు జగన్, విజయలక్ష్మి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, సినీనటి రోజా, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు ప్రచార రథం ఎక్కారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి పాదయాత్రగా వచ్చిన కళా బృందం, ఆముదాల వలస నుంచి వచ్చిన కళాబృందం వాహనం ఎదుట ప్రదర్శనలు చేస్తుండగా రథం ముందుకు సాగింది.
ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌కు చేరుకోగానే అశేషంగా తరలివచ్చిన జనంతో ఆ ప్రాంతం నిండిపోయింది. మండుటెండలో మూడు కిలోమీటర్ల దూరం జనతరంగం ముందుకు సాగింది. పూల అంగళ్ల సర్కిల్, పుల్లారెడ్డి ఆస్పత్రి సర్కిల్, సీఎస్ఐ చర్చి కాంపౌండ్, జూనియర్ కాలేజీల మీదుగా ర్యాలీ మధ్యాహ్నం 12-30 గంటలకు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న అనేకమంది వాహనాలను పోలీసులు పక్కకు మళ్లించడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతాకాలను చేత్తో పట్టుకోరాదని ఆంక్షలు పెట్టడంతో అభిమానులు పోలీసుల మీద తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గి ర్యాలీ సాగడానికి అంగీకరించారు.
మధ్యాహ్నం 12.40 గంటలకు వై.ఎస్. విజయవ్ముతో పాటు జగన్, వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.ప్రకాష్‌రెడ్డి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తిచేసి రిటర్నింగ్ ఆఫీసర్ గోపాల్‌కు విజయవ్ము తన నామినేషన్ పత్రాలు అందచేశారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి, పార్టీ నాయకులు అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజ్‌ఠాకూర్, విజయ్‌చందర్ పాల్గొన్నారు.