Post date: Aug 13, 2011 9:26:54 AM
ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 200 సీట్లు గగనమే
ఇండియా టుడే-నీల్సన్ సర్వేలో వెల్లడి
2009 ఎన్నికల్లో కన్నా యూపీఏకు 6.7 శాతం తగ్గనున్న ఓట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు వస్తే వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్‌లే ప్రధాన ప్రత్యర్థులు
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అగ్రస్థానం
తెలుగుదేశం పార్టీకి దక్కేది మూడో స్థానమే... కాంగ్రెస్‌కు రెండోస్థానం
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: దేశంలో ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే అధికార యూపీఏకు 200 స్థానాలు కూడా దక్కవని ‘ఇండియా టుడే-నీల్సన్’ సర్వేలో తేలింది. యూపీఏకు 187-197 స్థానాలు, విపక్ష ఎన్డీఏకు 175-185 సీట్లు, ఇతర పక్షాలన్నింటికీ కలిపి 167-177 స్థానాలు దక్కుతాయని వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 31 శాతం ఓట్లు, అధికార కాంగ్రెస్ పార్టీకి 27 శాతం ఓట్లు దక్కుతాయని ఈ సర్వే స్పష్టం చేసింది. విపక్ష టీడీపీ 20 శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితం అవుతుందని సర్వే తెలిపింది. మొత్తమ్మీద చూస్తే రాష్ర్టంలో కాంగ్రెస్ బాగా దెబ్బ తింటుందన్నది సర్వే సారాంశంగా ఉంది. ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరిట ‘ఇండియా టుడే’ వారపత్రిక తాజా సంచికలో ఈ సర్వే ఫలితాలను పొందుపరిచారు. అందులోని ముఖ్యాంశాలివీ..
* ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 2009 నాటికన్నా యూపీఏకు ఓట్ల శాతం 6.7% తగ్గుతుంది.
* ఎన్డీఏ ఓట్ల శాతం 1.3 శాతం, ఇతరపక్షాల ఓట్ల శాతం 5.4 శాతం పెరుగుతుంది.
* యూపీఏ కూటమి ఓట్ల శాతం ఇంత భారీగా పడిపోవడానికి ప్రధాన కారణం అవినీతి, కుంభకోణాలే.
*ఇటీవలి కుంభకోణాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఫలితంగా ప్రధాని మన్మోహన్సింగ్ ప్రతిష్ట మసకబారిందని 70 శాతం మంది బదులిచ్చారు.
* దేశంలో ఇప్పటివరకున్న సమర్థ ప్రధానుల జాబితాలో మన్మోహన్ ఆరో స్థానంలో నిలిచారు.
* దేశ ఉత్తమ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయికి 20 శాతం మంది ఓటేయగా.. రాహుల్‌గాంధీ అయితే బాగుంటుందని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు.
* దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తొలిస్థానంలో నిలిచారు.
* ప్రధాని పదవి నుంచి మన్మోహన్‌ను మార్చదలిస్తే ఆ స్థానంలో రాహుల్‌గాంధీ అయితే బాగుంటుందని52% మంది పేర్కొన్నారు. 20 శాతం మంది సోనియాకు, 11% ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికారు. రాహుల్ తన నియోజకవర్గంలో సామాజిక కార్యకర్త అన్నా హజారేపై పోటీకి దిగితే హజారేకు 37% ఓట్లు. రాహుల్‌కు 50% ఓట్లు లభిస్తాయి. బీజేపీ సారథి నితిన్ గడ్కారీ పనితీరు బాగానే ఉందన్నవారు 66 శాతం మంది. బాగోలేదన్నవారు 10%. సుస్థిర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇచ్చేది ఏదన్న ప్రశ్నకు.. 30 శాతం బీజేపీవైపు, 28 శాతం కాంగ్రెస్ వైపు, 42 శాతం ఇతర పక్షాలవైపు మొగ్గారు. గత ఏడాదిలో జీవన ప్రమాణాల్లో ఏమాత్రం మార్పు లేదన్నవారు 55 %. వచ్చే ఆర్నెల్లలో తమ ఆర్థిక పరిస్థితి మారదన్న వారు 51 శాతం.