Post date: Aug 23, 2011 6:9:33 AM
*రాజధాని నుంచి ఇడుపులపాయ దాకా నీరాజనమే..
*పంజగుట్టలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి బయల్దేరిన ప్రజాప్రతినిధులు
*అనంతరం స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు..
*కార్యదర్శికి అందజేసిన ఇద్దరు టీడీపీ, 23 మంది కాంగ్రెస్, ఒక పీఆర్పీ ఎమ్మెల్యేలు
*అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లయినా రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని ప్రకటన
*జూలై 4న సమర్పించిన రాజీనామాలనే ఆమోదింపజేసుకుంటాం: సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి
*కాంగ్రెస్‌కు కూడా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు
*ఏఐసీసీ, పీసీసీలకు ఫ్యాక్సులో లేఖలు
*ప్రతినిధి ద్వారా గాంధీభవన్‌కు కూడా...
*తర్వాత విమానంలో రేణిగుంటకు, అక్కణ్నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు...
*తిరుపతిలో పూల వర్షంతో ఘనస్వాగతం పలికిన వైఎస్ అభిమానులు, ప్రజలు
*అక్కడి నుంచి దారిపొడవునా అభిమాన సంద్రమే..
జైత్రయాత్ర... కాంగ్రెస్ అధిష్టానం కుయుక్తులపై ప్రజాప్రతినిధుల పోరుయాత్ర. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చినందుకు నిరసనగా రాజీనామాలు ప్రకటించిన ఎమ్మెల్యేలు... సోమవారం అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పంజగుట్ట మీదుగా అసెంబ్లీకి, అక్కడి నుంచి వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు తిరుపతి మీదుగా అర్ధరాత్రి ఇడుపులపాయ దాకా రోజంతా సాగిన వారి యాత్ర అక్షరాలా జైత్రయాత్రను తలపించింది. వైఎస్ అభిమానులు, ప్రజలు వారికి అడుగడుగునా నీరాజనం పట్టారు. ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. వైఎస్సార్ అమర్ రహే, జై జగన్ అంటూ మిన్నంటిన నినాదాలతో ప్రతి చోటా అపూర్వ స్వాగతం పలికారు. నేతలపై పూల వర్షం కురిపించారు. వీర తిలకం దిద్దారు. మంగళారతులు పట్టారు. పదవులను తృణప్రాయంగా వదిలేసిన హీరోలంటూ మనసారా అభినందించారు.
కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలకు చెందిన 29 మంది ఎమ్మెల్యేలు సోమవారం ఉదయ పదింటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వెంటరాగా పంజగుట్టలోని వైఎస్ విగ్రహం వద్దకు బస్సులో బయల్దేరారు. అక్కడికి ఉదయం 8 గంటల నుంచే వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు వారికి జయజయధ్వానాలు పలికారు. వైఎస్ విగ్రహానికి, అనంతరం ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అక్కణ్నుంచి అసెంబ్లీకి చేరుకుని, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఇద్దరు టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు అప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖలు సమర్పించారు. అనంతరం 23 మంది కాంగ్రెస్, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే ఒక్కొక్కరుగా రాజీనామాలు సమర్పించారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి... జూలై 4న తాము సమర్పించిన రాజీనామాలనే ఆమోదింపజేసుకుంటామని ప్రకటించారు. వారితో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, పుల్లా పద్మావతి, ఎస్వీ మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తదితరులు కూడా అసెంబ్లీకి వచ్చారు.
నిలువెల్లా మలినపడి, కుళ్లు కంపు కొడుతున్న కాంగ్రెస్‌లో ఇంకెంతమాత్రమూ ఉండలేమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా ప్రకటించారు. జగన్‌ను అణచేయాలన్న ఏకైక లక్ష్యంతో... మృతప్రాయంగా పడున్న పార్టీకి ప్రాణం పోసిన మహా నేతనే దోషిగా చిత్రించజూస్తున్న కాంగ్రెస్ నైచ్యాన్ని ప్రజలంతా ఛీకొడుతున్నారని మండిపడ్డారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లి రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని ప్రకటించారు. 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. లేఖలను ఏఐసీసీకి, పీసీసీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. వారి ప్రతినిధి గాంధీభవన్‌కు కూడా వెళ్లి రాజీనామా లేఖలు అందజేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాప్రతినిధులంతా ఇడుపులపాయ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో రేణిగుంట బయల్దేరారు.
రేణిగుంటలో చిత్తూరు జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చిన వైఎస్ అభిమానులు, ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. హోరెత్తిన జడి వానకు దీటుగా నేతలపై పూల వాన కురిపించారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో ఇడుపులపాయ వెళ్లే దారి పొడవునా ఊరూరా ప్రజలు వారికి హారతులు పట్టారు. కరకంబాడి, ఆంజనేయపురం, కుక్కలదొడ్డి దాకా ఊరూరా ఘనస్వాగతం పలికారు. ప్రతిచోటా హారతులు, బస్సులు, వాహనాల్లో వెళ్లేవారంతా ఎమ్మెల్యేలను చూసేందుకు కిందకు దిగడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. అక్కణ్నుంచి మామండూరు, రైల్వేకోడూరు, బాలపల్లె, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, కడప... అనంతరం వేంపల్లె మీదుగా ఇడుపులపాయ చేరిన బృందానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం వారంతా వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.