Post date: Aug 24, 2011 4:50:13 AM
*తొమ్మిదో రోజు పల్లెల్లో సాగిన పర్యటన
*గ్రామగ్రామాన అపూర్వ స్వాగతం
*జనాభిమానానికి చలించిపోయిన జననేత
*షెడ్యూల్లో లేని ఊళ్లకూ లాక్కెళ్లిన అభిమానులు
ఓదార్పు యాత్ర నుంచి ‘సాక్షి’ స్పెషల్ బ్యూరో: ఒకవైపు మహానేతపై కాంగ్రెస్, టీడీపీ కుట్రలు.. దానికి నిరసనగా ఎమ్మెల్యేల రాజీనామాలు.. వీరి సంఖ్య ఇంకా పెరుగుతుందన్న వార్తలు.. ఇంకోవైపు ప్రభుత్వం ఉంటుందా? పడిపోతుందా? అంటూ రాష్ట్రవ్యాప్తంగా చర్చ! కానీ.. వీటన్నింటికీ మూలమైన ఓదార్పు యాత్ర సాగుతున్న కృష్ణా జిల్లా గ్రామాల్లో మాత్రం ఈ చర్చే లేదు. అందరిదీ ఒకటే నినాదం.. ‘జై జగన్.. జైజై జగన్’. అంతటా ఒకటే చర్చ.. జగన్ ఇంకా ఎంత దూరంలో ఉన్నాడో అనే! మహానేత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానన్న మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా గొంతు నొప్పినీ లెక్కచేయక వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్విరామంగా పర్యటిస్తుంటే.. ఆయన సాగే ప్రతి దారీ ఆయనకు నీరాజనాలు పలుకుతోంది. ‘హామీలిచ్చి మరచిపోయే నాయకుల్ని చూశాంగానీ.. నీలాంటోళ్లను చూళ్లేదంటూ చూసి మురిసిపోతోంది.
క్లుప్తంగానే ప్రసంగిస్తూ..
జిల్లాలో తొమ్మిదో రోజు మంగళవారం యాత్ర ఉదయం 10 గంటలకు మొదలైంది. చంద్రాలలో దివంగత నేత విగ్రహాలను రెండింటిని ఆవిష్కరించి, మరో విగ్రహానికి పూలమాల వేసిన జగన్మోహన్రెడ్డికి గ్రామమంతా తరలొచ్చి హారతులు పట్టింది. ఒక వైపు గొంతు నొప్పి బాధిస్తున్న నేపథ్యంలో విగ్రహావిష్కరణ సభల్లో జగన్ మంద్రస్థాయిలో క్లుప్తంగా ప్రసంగించారు. అక్కడ నుంచి గణపవరం బయలుదేరిన ఆయన్ను మధ్యలో తోలుకోడు గ్రామస్తులు అడ్డుకుని తమ ఊరికి రావాలని ఒత్తిడి చేశారు. రోజురోజుకూ గాడి తప్పుతున్న షెడ్యూల్, మరోవైపు గొంతు నొప్పి నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆ గ్రామస్తులకు నచ్చజెప్పి ఆయన్ను షెడ్యూల్ మేరకు గణపవరంవైపే తీసుకెళ్లారు.
మా ఊరి మేనల్లుడొచ్చాడు..
గణపవరం గ్రామం జగన్‌ను చూడగానే పులకించిపోయింది. పెద్దపెట్టున బాణసంచా కాలుస్తూ ఆహ్వానం పలికింది. ఆయన మేనత్త విమలమ్మ ఈ ఊరి కోడలే. దీంతో గ్రామస్తులందరూ మా ఊరి మేనల్లుడొచ్చాడంటూ.. మురిపెంగా ఆహ్వానం పలికారు. విమలమ్మ కుమారుడు యువరాజ్ రెడ్డితో కలిసి జననేత గ్రామంలో దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విమలమ్మ ఇంటి సమీపంలో ఇంకో విగ్రహాన్ని ఆవిష్కరించారు. మేనత్త ఇంటిలో కాసేపు బంధువులతో గడిపిన జగన్మోహన్రెడ్డి ఆ తర్వాత చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు.
మహానేత వైఎస్‌పై కుట్రకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, తూర్పుగోదావరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి జగన్‌తో కాసేపు మాట్లాడి వెళ్లారు. అక్కడ నుంచి జననేత కోడూరు వచ్చి రెండు విగ్రహాలను ఆవిష్కరించారు. చిన్న గ్రామమైనా రెండు విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం చూసి వారి అభిమానానికి ముగ్ధుడయ్యారు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనంటూ కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. గ్రామంలోని రామాలయంలో పూజలు చేసి వెల్లటూరువైపు కదిలారు. మార్గమధ్యంలో కండ్రిగ గ్రామస్తులు జగన్మోహన్రెడ్డిని తమ ఊరికి తీసుకెళ్లడానికి విఫలయత్నంచేశారు. జగన్ వారికి నచ్చజెప్పి ముందుకు సాగారు.
వర్షంలోనూ కదలని జనం..
తర్వాత భీమవరప్పాడు ఎస్సీ కాలనీలో దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా జనం ఆయన ప్రసంగాన్ని ఆలకించారు. అనంతరం సమీపంలోని ఆర్సీఎం చర్చిలో జననేత ప్రార్థనలు చేశారు. కొద్దిదూరం రాగానే, వెల్లటూరు జీవన్‌నగర్ వాసులు రోడ్డుకు అడ్డంగా వచ్చి ఆయన్ను చర్చికి తీసుకెళ్లారు. తర్వాత సీఎస్ఐ చర్చిలో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి జననేత ప్రసంగించారు. ఆయన సమక్షంలో పలువురు టీడీపీ స్థానిక నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం గ్రామంలో దివంగత నేత విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. వైఎస్సార్ వీరాభిమాని అయిన గ్రామ మాజీ సర్పంచ్ చామల కృష్ణారెడ్డి జగన్‌ను తన ఇంటికి తీసుకెళ్లి.. కొత్తబట్టలు, బంగారు ఉంగరం పెట్టి ముచ్చట తీర్చుకున్నారు.
అక్కడ నుంచి బయలు దేరిన జగన్ మైలవరం బైపాస్ రోడ్డులోని యరమల కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కృష్ణారెడ్డి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ రాత్రి 8 గంటలకు చంద్రగూడెంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. చంద్రగూడెంలో దాదాపు 500 మంది టీడీపీ కార్యకర్తలు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం.. పుల్లూరు మలుపు వద్ద అప్పిరెడ్డి రాజశేఖర రెడ్డి తన తోటలో ఏర్పాటు చేసుకున్న దివంగత నేత విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.
ఐదు గంటలు ఆలస్యమైనా..
రాత్రి 9 గంటల ప్రాంతంలో పుల్లూరు సెంటర్లో దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించి జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగాలి. ఐదు గంటలు ఆలస్యమైనా జనం ఓపిగ్గా ఎదురు చూశారు. అనంతరం జగన్ కొత్తగూడెం, చిలుకూరువారి గూడెంలలో విగ్రహాలను ఆవిష్కరించారు. అక్కడ నుంచి బయలుదేరిన ఆయన్ను గ్రామ సమీపంలో పుల్లూరు తాండా వాసులు అడ్డుకుని తమ తాండాకు రావాల్సిందేనని పట్టుబట్టడంతో అక్కడకు వెళ్లి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత సమీపంలోని మురుసమల్లి గ్రామస్తులు వచ్చి తమ గ్రామానికి రావాలని పట్టుబట్టి తీసుకెళ్లారు. అక్కడ జగన్ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత పుల్లూరు ఎస్సీ, బీసీ కాలనీల్లో విగ్రహావిష్కరణలు చేసి ప్రసంగించారు. రాత్రి 12గంటలకు మంగాపురం వెళ్లి అక్కడ మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి రాత్రి బసకు రెడ్డిగూడెంలో స్థానిక వ్యాపారి కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి చేరుకున్నారు.
కరచాలనాలతో జననేత చేతికి గాయాలు
ఓదార్పు యాత్రలో జగన్మోహన్రెడ్డి కరచాలనం కోసం జనం ఉత్సాహం చూపడం.. ఆ సందర్భంలో కొందరు తోసుకురావడం.. మీదపడడంతో ఆయన చేతులపై పలుచోట్ల గోర్లు గీసుకుని గాయాలయ్యాయి. ఆ గాయాల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. అయినా ఆ బాధను భరిస్తూనే జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమం ఇలాగే కొనసాగితే గాయాలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, జగన్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వాలన్న కోర్కెను అభిమానులు నియంత్రించుకోవాలని జననేత వ్యక్తిగత సహాయకులు విజ్ఞప్తి చేశారు.
చిన్నారికి ‘వైఎస్సార్’ పేరు
ఓదార్పు యాత్రలో భాగంగా చంద్రాల దళితవాడలో జగన్ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ తన బిడ్డకు నామకరణం చేయాలంటూ ఎనమల పృథ్వీరాజ్ అనే అభిమాని చంటి పిల్లాడిని(ఆరు నెలలు) వేదిక వద్దకు తీసుకు రాగా.. ‘వైఎస్ఆర్’ అని జగన్ పేరు పెట్టారు.