Post date: Apr 14, 2011 7:38:20 PM
సీఎం ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు
కడప ప్రజలకు కాంగ్రెస్‌పై కసి తీర్చుకునే సమయం వచ్చింది
ఫలితాల తర్వాత సీఎం, మంత్రులు రాజీనామా చేయాల్సిందే
కుట్ర పన్ని వైఎస్‌ను పొట్టన పెట్టుకున్నారని ఇప్పటికీ జనం నమ్ముతున్నారు
కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ న్యాయవాదుల సదస్సు
కాంగ్రెస్‌కు తెలుగు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ తదితరులు మండిపడ్డారు. కడప ఉప ఎన్నికల్లో ప్రభుత్వం కనీవినీ ఎరగనంత నీచానికి దిగజారి ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. ఫలితాలతో ఢిల్లీకి దిమ్మ తిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని జోస్యంచెప్పారు. రాయలసీమ జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ లీగల్‌సెల్ న్యాయవాదుల సదస్సును మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున నిర్వహించారు. నేతలంతా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అంబటి మాట్లాడారు.
‘‘వైఎస్‌కు సిసలైన వారసునిగా యువనేత జగన్మోహన్రెడ్డి ఎదగడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను ఏదోలా తొక్కేసే లక్ష్యంతో పన్నాగాలు పన్నుతున్నారు. ఈ ఉప ఎన్నికలు ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య జరుగుతున్నాయి. వైఎస్ మరణానంతరం ఇష్టానికి మాట్లాడుతున్న ఉండవల్లి, వీహెచ్, కేకే తదితరులు... రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బతికించిన వీరుడు ఆయనేనని గుర్తుంచుకోవాలి. ఓదార్పు యాత్ర విషయంలో సోనియా తీరు వల్ల జగన్ పార్టీని వీడితే, దానిపైనా దుష్ర్పచారం చేస్తున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన వారంతా సీఎంలు కాలేరు. ప్రజా బలమున్న జగన్ లాంటి నేతలకే అది సాధ్యం. తిరుగులేని ప్రజాకర్షక నేతగా ఎదిగిన వైఎస్‌ను చూసి ఈర్ష్య పడ్డ కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు జగన్ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు. వైఎస్‌ను కుట్ర చేసి పొట్టన పెట్టుకున్నారని జనం ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇప్పుడు జగన్‌కు కావాలని భద్రత తగ్గించడం కూడా అనుమానాలకు తావిస్తోంది’’ అన్నారు.
పోస్టుమెన్ సీఎంలు: శోభ
వైఎస్ తర్వాత వచ్చిన సీఎంలు కేవలం పోస్టుమెన్ ఉద్యోగాలు చేస్తున్నారని శోభా నాగిరెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం కిరణ్ సచివాలయం మొత్తాన్ని కడపకు మార్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ప్రజలకు ఎంతైనా అవసరమని తెలిపారు. ప్రజలు ఇప్పుడున్న పార్టీలను నమ్మడం లేదని, జగన్ వైపే మొగ్గుతున్నారని వివరించారు. కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు సోనియా ఫొటోతో ప్రచారం చేసి గెలవగలరా అని గట్టు సవాలు విసిరారు. వైఎస్ ఉన్నప్పుడు ముత్యపు చిప్పలా ఉన్న కాంగ్రెస్ ఆయన మృతితో చిప్పగా మిగిలిందని ఎద్దేవా చేశారు. ‘‘వైఎస్ ఉండగా నోరు మెదపని డీఎల్, ఇప్పుడు పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు. కడప ప్రజలకు కాంగ్రెస్‌పై కసి తీర్చుకునే సమయం వచ్చింది. కడపకు సీఎం కిరణ్ భారీగా మంత్రులను తరలించినా, ఓటర్లకు భయపడి ప్రచారానికి రావడానికే వాళ్లు భయపడుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం, మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని రెహ్మాన్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ ఎన్.నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, సతీశ్‌రెడ్డి, కాంతారెడ్డి, కేపీస్వామి, సెల్ రాష్ట్ర నాయకుడు రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.