Post date: Aug 22, 2011 4:37:32 AM
తెరవెనుక పెద్ద కథే నడుస్తోందని అనుమానం
తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇంతటి దిగజారుడా?
ఎఫ్ఐఆర్లో వైఎస్‌ను చేర్చడంపై విస్మయం
ప్రతిపక్షంతో కలిసి మరీ ఇంతటి నైచ్యానికి దిగడమా?
కక్ష సాధించే ప్రయత్నంలో కనుమరుగవుతామా?
పీసీసీ నేతల్లో తీవ్ర అంతర్మథనం
మహానేతకు మకిలి అంటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న వెకిలి వేషాలను సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ మనుగడకే పెను సవాలుగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలాగోలా దెబ్బ తీసే ప్రయత్నంలో ఏకంగా ఇంతకు దిగజారతారని కలలో కూడా ఊహించలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ను కాంగ్రెస్ టార్గెట్ చేయడం వెనక భారీ కుట్రే ఉందని అభిప్రాయపడుతున్నారు. సీబీఐ దాడులు, ఎఫ్ఐఆర్లో మహానేత ప్రస్తావన తదితరాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఈ భావన మరింత బలపడుతోంది.
తమకు రాజకీయ జీవితాన్నివ్వడంతో పాటు రాష్ట్రంలో మృతప్రాయంగా మిగిలిన పార్టీని ఒంటి చేత్తో వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చి, కేంద్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటులో కావాల్సిన ఎంపీలను అందించిన మహా నేతకు ఇచ్చే నివాళి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. తాత్కాలిక రాజకీయావసరాలు, అనిశ్చితి, ప్రతిష్టంభన నుంచి గట్టెక్కడాలే లక్ష్యంగా ఒక ఎత్తుగడ ప్రకారం అధిష్టానమే ఇలా చేయడాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందంటున్నారు. వైఎస్ తనయుణ్ని వేధించడం, కుటుంబాన్ని చీల్చడం చాలదన్నట్టుగా ఏకంగా ఆయన పేరునే అప్రతిష్టపాలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతుండటం వారిని ఆవేదనకు గురిచేస్తోంది.
రాజకీయ కుట్రే
సీబీఐ ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరు చూసి హతాశులయ్యామని పలువురు కాంగ్రెస్ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైఎస్సే తమ నాయకుడని, ఆయనకు అసలైన రాజకీయ వారసులం తామేనని నిన్నటిదాకా గొంతు చించుకుని మరీ ప్రకటించిన నేతలు, అధినేతలు ఇప్పుడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. వైఎస్ మా దేవుడన్న మంత్రులు, ఇతర పార్టీ పెద్దలు నోరెందుకు మెదపడం లేదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డదారి దాడులతో దెబ్బతీయజూస్తున్నారు.
ఆ క్రమంలో పార్టీని కాపాడిన మహానేతనే విలన్‌గా చిత్రించేందుకు తెగబడటం మరీ నీచం’’ అని కరీంనగర్‌కు చెందిన మాజీ మంత్రి ఒకరు ధ్వజమెత్తారు. నిజానికి ఢిల్లీ పెద్దల కన్నా, వైఎస్ కరిష్మా వల్లే కాంగ్రెస్‌కు వరుసగా రెండుసార్లు అధికారం దక్కిందని గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలో వైఎస్ ఫొటోను, ఆయన పథకాలను పెట్టడాన్ని కూడా తప్పుబట్టి, ఆయన తమకే సొంతమని బీరాలు పలికిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకు కూడా వెనకాడటం లేదంటూ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైఎస్ సుపరిపాలన, ఆయన పథకాల క్రెడిటంతా జగన్‌కే దక్కుతోందని, జనం వైఎస్‌ను మరిచేలా చేస్తే తప్ప లాభం లేదనిఆలోచించి ఈ కుట్రకు తెర తీశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ పథకాలను క్రమంగా నీరుగార్చడం, కొత్త పథకాలు తేవడం వంటివన్నీ అందులో భాగమే. ‘‘ఇప్పటిదాకా జగన్ లక్ష్యంగానే వ్యూహాలన్నీ నడుస్తున్నాయనుకున్నాం. కానీ అందులో ఏకంగా వైఎస్‌నే ఇరికించడం చూసి ప్రజలతో పాటు మాకు కూడా పార్టీ పట్ల ఏహ్యభావం కలిగింది. రాజకీయాలు చేయొచ్చు గానీ మరీ ఇంత నీచంగానా! వైఎస్ కుటుంబాన్నే తుడిచి పెట్టేయాలన్నంతగా దిగజారిపోవడమా? ఇంత అన్యాయానికి బరితెగించడం బాధ కలిగిస్తోంది’’ అని కోస్తా, సీమ ప్రాంత ఎమ్మెల్యేలు ఆవేదన వెలిబుచ్చారు. ఇందులో టీడీపీ కుట్ర కూడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోందంటున్నారు. ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణల్లో రెండు పార్టీల పునాదులూ కదిలిపోయేలా కుమ్మక్కై జగన్‌పై దాడికి దిగాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందంటున్నారు.
శంకర్రావు హైకోర్టుకు లేఖ రాయడం, సోనియా చెబితేనే రాశానని బాహాటంగా ప్రకటించడం, ఎర్రన్నాయుడు వంటి టీడీపీ నేత లు ఇంప్లీడ్ అవడం ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టిగా నమ్ముతున్నారు. ఒక్క వ్యక్తిని ఎదుర్కొనేందుకు బద్ధ రాజకీయ ప్రత్యర్థితో చేతులు కలపడంపై తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంది. తామెంతో అభిమానించే వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంతో వారు రగిలిపోతున్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని, రెండు పార్టీలకూ తగిన గుణపాఠం తప్పదని వారంటున్నారు. ‘‘ఇప్పటికే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నంతో కోట్లాది మంది ఆయన అభిమానుల దృష్టిలో పార్టీ దోషిగా నిలిచిం ది. ఇది చివరికి పార్టీని సమాధి చేసినా ఆశ్చర్యం లేదు’’ అని ఓ కాంగ్రెస్ సీనియర్ వ్యాఖ్యానించారు.
మంత్రుల ఆవేదన..
సీబీఐ ఎఫ్ఐఆర్లో రాష్ట్ర ప్రభుత్వం అని కాకుండా వ్యక్తిగతంగా వైఎస్ పేరును చేర్చడం అప్పటి మంత్రులను తప్పించేందుకేనన్న విమర్శ నానాటికీ తీవ్రతరమవుతోంది. వారంతా కూడా దీనిపై లోలోన మథనపడుతున్నా అధిష్టానానికి భయపడి బయట పడలేకపోతున్నారని తెలుస్తోంది. ఏమైనా మాట్లాడితే తమనూ ఇరికిస్తుందేమోనన్న ఆందోళన వారిలో స్పష్టంగా కన్పిస్తోంది. ఎఫ్ఐఆర్లో వైఎస్ ప్రస్తావనపై ఆయన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా చేసిన రోశయ్యను శనివారం గాంధీభవన్‌లో మీడియా కదిలించగా మాట్లాడేందుకే ఇష్టపడలేదు. ‘‘నో కామెంట్. ఈ కేసుపై మాట్లాడేందుకు సిద్ధంగా లేను’’ అంటూ తప్పుకున్నారు! మరో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా ‘‘ప్లీజ్. నన్నొదిలేయండి’’ అంటూ వెళ్లిపోయారు. వైఎస్‌కు మద్దతుగా మాట్లాడితే అధిష్టానం ఆగ్రహిస్తుందనే భయంతోనే వారిలా ముఖం చాటేస్తున్నారన్న విమర్శలు కాంగ్రెస్ నేతల నుంచి విన్పించాయి. వైఎస్‌తో ఆత్మీయానుబంధం ఉన్న పలువురు మంత్రులు దీనిపై బయటకు స్పందించకపోయినా, ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరు అన్యాయమేనని వ్యాఖ్యానిస్తున్నారు.