Post date: Aug 24, 2011 4:54:43 AM
*వైఎస్ సుపరిపాలనను తిరిగి తెస్తామంటూ ప్రతిన
*విజయమ్మతో మర్యాదపూర్వక భేటీ
*జనసంద్రమైన ఇడుపులపాయ
*ఎమ్మెల్యేలకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
సీబీఐ ఎఫ్ఐఆర్లో మహానేత పేరు చేర్చడాన్ని నిరసిస్తూ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేసిన వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు మంగళవారం ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్ అమర్ రహే.. జోహార్ వైఎస్’ నినాదాలతో వైఎస్ ఘాట్ ప్రాంతమంతా మార్మోగింది. ఎమ్మెల్యేలకు మద్దతుగా ప్రజలు భారీ సంఖ్యలో ఇడుపులపాయకు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. వైఎస్ సుపరిపాలనను తిరిగి తెచ్చేందుకు పునరంకితమవుతామంటూ ఎమ్మెల్యేలు ప్రతిజ్ఞ చేశారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల బృందం సోమవారం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంటకు, అక్కణ్నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకోవడం, ప్రజలు, అభిమానులు వారికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టడం తెలిసిందే.
ఇడుపులపాయ చేరేటప్పటికి అర్ధరాత్రి దాటినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ వారికి సాదర స్వాగతం పలికారు. రాత్రి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లోనే బస చేశారు. మంగళవారం ఉదయం విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని, ఇతర అతిథులను ఆమె పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. దగ్గరుండి అతిథి మర్యాదలు చేశారు. అనంతరం విజయమ్మ ఉదయం ఆరింటికే అందరికంటే ముందుగా వైఎస్ సమాధికి చేరుకున్నారు. ప్రార్థనలు చేస్తూ ఏకాంతంగా గడిపారు. అనంతరం ఎమ్మెల్యేలు నేరుగా వైఎస్ఆర్ ఘాట్ చేరుకున్నారు. సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానేత సమాధి వద్ద ప్రతిజ్ఞ చేశారు.
విమానం టికెట్లు దొరక్క..
రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో 8 మంది సోమవారం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు విమానం టికెట్లు దొరక్క ఇడుపులపాయ వెళ్లలేకపోయారు. ఆళ్ల నాని, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ధర్మాన కృష్ణదాస్, జయసుధ, చెన్నకేశవరెడ్డి, ప్రసాదరాజు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. మిగతా 21 మంది ఎమ్మెల్యేలు... ఆదినారాయణరెడ్డి, అమరనాథరెడ్డి, గురునాథరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి, కె.భారతి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, టి.బాలరాజు, పి.రవి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సుచరిత, శ్రీకాంత్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శోభా నాగిరెడ్డి, కొండా సురేఖ, కుంజా సత్యవతి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, నారాయణరెడ్డి తదితరులు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
ప్రతిజ్ఞ పాఠం ఇదీ...
‘‘మాకు, మాలాంటి వారెందరికో రాజకీయ భిక్ష పెట్టిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మరణించిన రెండేళ్ల తర్వాత కూడా ఆయనను జన హృదయాల నుంచి దూరం చేసే కుట్ర, కుతంత్రంలో భాగంగా సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ప్రస్తావించడం మమ్మల్నందర్నీ కలచివేసింది. రాష్ట్రంలో కుంగి కృశించి నీరసంగా ఉన్న కాంగ్రెస్‌ను తన రెక్కల కష్టం, నిరంతర పోరాటాలతో వైఎస్ పునరుజ్జీవింపజేశారు. అలాంటి మహానేతకు ఇదా మీరిచ్చే ప్రతిఫలమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన ఆశయసిద్ధి కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మేం త్యాగమనుకోవడం లేదు. ఇది మా కనీస ధర్మం. అభిమానులు, కార్యకర్తలు, నేతలందరినీ పేరుపేరునా పలకరించగల రాజకీయ దురంధరుడు వైఎస్. సోనియాగాంధీ గారు కనీసం మన రాష్ట్ర మంత్రులనైనా గుర్తుపట్టగలరా? అభివృద్ధి, సంక్షే మం రెండు కళ్లుగా భావించి వైఎస్ అందించిన సుపరిపాలనను తిరిగి రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు మేమంతా పునరంకితమవుతున్నాం.
మాట తప్పని, మడమ తిప్పని మహానేత ఆదర్శానికి కట్టుబడి ఉంటామని ఆయన సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలుపెరగని పోరాటంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ప్రజల మనోభావాలను, వారి సమస్యలను తెలుసుకోవడానికి రచ్చబండకు వెళుతూ ఆయన మరణించడం దురదృష్టకరం. ప్రస్తుత పాలకులు తమ పంతాలు, అహంకారాలతో రాష్ట్రాభివృద్ధిని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారు. దీనికి కారణం సోనియా నేతృత్వంలోని అధిష్టానం కాదా అని ప్రశ్నిస్తున్నాం. వైఎస్ కుటుంబమే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని సాగుతున్న సోదాలను, దాడులను ప్రజలంతా నిరసిస్తున్నారు. వారి మనోభావాలకు అనుగుణంగానే, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేయడానికి ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టేందుకు సంసిద్ధులమై రాజీనామాలు చేయడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం’’.