Post date: May 03, 2011 6:21:16 AM
తొడగొట్టడం, మీసం దువ్వడం మాకు రాదు: రోడ్‌షోలో జగన్
‘ కడపలో ఓటింగ్ శాతం తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు కలసి కుట్ర పన్నుతున్నారు. తొడలు చరుస్తూ మీసం దువ్వుతూ ఉద్వేగపూరిత వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొడుతున్నార’ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, కడప పార్లమెంట్ అభ్యర్థి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని పలుగ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో ఆయన స్వగ్రామం బలపనూరు నుంచి మొదలైంది. బలపనూరు జనం ఆయనను ఆప్యాయంగా ఆదరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు కుమ్మక్కయ్యారని, తొడలు కొట్టి మీసాలు తిప్పుతూ జనాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. ఈ గడ్డకు ఉండాల్సిన పౌరుషం ఉంది.. కానీ తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం రాదు. ప్రేమ కురిపించడం, ఆప్యాయతలను పంచడం మాత్రమే మాకు తెలుసు అన్నారు.
ప్రతిపక్షం, పాలకపక్షాలకు లేనిది, తనకు, తన తల్లి విజయమ్మకు మాత్రమే ఉన్నది ఈ గడ్డ ప్రజల ప్రేమ, ఆప్యాయత, అనురాగమని చెప్పారు. కడప నియోజకవర్గంలో వీలైనంత మేరకు పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు మంత్రులు, ప్రతిపక్ష నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో అమాయక ప్రజ లపై అక్రమ కేసులు బనాయిస్తూ, మహిళలపై పౌరుషాన్ని చూపి స్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికలనాటికి ప్రజలను ఓటింగ్‌కు దూరంగా ఉంచవచ్చనే ఆలోచనతో నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభిమానులు, కార్యకర్తలు 10 వేల మందిపై బైండోవర్ కేసులు బనాయించి పోలీసుస్టేషన్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని, విచక్షణారహితంగా కొడుతున్నారని, ఎన్నికల వేళకు ఈ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలకు పూనుకుంటుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మా పుట్టిల్లు బలపనూరులో కాంగ్రెస్, టీడీపీలకు 20 ఓట్లకు మించిరావని అన్నారు. పులివెందుల వైపు తొంగిచూస్తే ఓ వైపు ఇంజినీరింగ్ కళాశాల, మరోవైపు రింగ్‌రోడ్డు, ఇంకో వైపు కృష్ణాజలాలు కనిపిస్తాయని, వాటిని చూసినపుడు దివంగత మహానేత గుర్తుకు వస్తారన్నారు. ఇన్నాళ్లూ పదిమందికి అన్నంపెట్టిన నా తల్లి విజయమ్మ ఇప్పుడు బయటకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని, తనను, తన తల్లి విజయమ్మను ఆశీర్వదించాలని ఆయన కోరారు.