Post date: Aug 14, 2011 5:43:25 AM
మేము కూడా వ్యక్తిగత విమర్శలకు దిగితే ఎంపీ లగడపాటి రాజగోపాల్కు రాజకీయ సన్యాసం తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. విజయవాడలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టక ముందు నుంచే జగన్మోహన్రెడ్డికి జైలు శిక్ష తప్పదని ప్రచారం చేస్తున్నారని, అయితే జగన్ జైలు కెళ్తారా.. లగడపాటి జైలుకెళ్తారా అనేది భవిష్యత్తులో తేలుతుందని అన్నారు. జగన్పై కుట్రను ఎగదోస్తున్నది లగడపాటి లాంటి వారేనని ఆమె దుయ్యబట్టారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయి ఎన్ని ఎత్తుగడలు వేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశించిన మేరకు సమగ్ర విచారణ జరిగితే జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. ఏలేరు స్కాం, మద్యం కుంభకోణాల్లో అవినీతికి పాల్పడినట్లు ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, చంద్రబాబునాయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకొని పబ్బం గడుపుకుంటున్నారన్నారని, కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే కలిగిన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు అక్రమంగా సంపాదించిన చంద్రబాబుకు జగన్ను విమర్శించే హక్కు లేదన్నారు.