Post date: Aug 23, 2011 6:14:38 AM
* రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల ఉద్ఘాటన.. కుట్రదారుల సంగతి ప్రజాకోర్టులోనే తేలుస్తాం
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న ద్రోహచింతన, అవమానాలపై ప్రజల్లో ఇప్పటికే ఆవేదన, ఆగ్రహం పెల్లుబుకుతోందని, ఈ ప్రజాచైతన్యంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోక తప్పదని శాసనసభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలు ఉద్ఘాటించారు. దీనిపై తాము ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాజీనామాలు సమర్పించిన అనంతరం ఆయా ఎమ్మెల్యేలు వేర్వేరుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించక తప్పదు: శోభానాగిరెడ్డి
కుట్రపన్ని జగన్మోహన్రెడ్డిని కాంగ్రెస్‌నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు వైఎస్‌ను అవమానించి ఎమ్మెల్యేలను బయటకు పంపిస్తున్నారు. వైఎస్‌కు జరిగిన అవమానంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఆగ్రహ జ్వాలలకు బలవ్వక తప్పదు. సీబీఐ వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తమున్నట్లు ప్రజలు స్పష్టంగా గమనించారు. ఆ పార్టీ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
బొత్స ఎంతటి నీతిమంతుడో ప్రజలకు తెలుసు: మేకపాటి చంద్రశేఖరరెడ్డి
జగన్‌పై, మాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బొత్స ఎంతటి నీతిమంతుడో ప్రజలందరికీ తెలుసు. మమ్మల్ని విమర్శించే స్థాయి బొత్సకు లేనేలేదు.
కాంగ్రెస్‌కు ప్రాణం పోసిన వైఎస్‌కే అన్యాయమా?: గొల్ల బాబూరావు
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మండుటెండల్లో పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటించి కొనఊపిరితో ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరి పోసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది. ఆయన పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చే ర్పించి ద్రోహిగా చిత్రీకరించడం దారుణం.
రాజీనామాల ఆమోదానికి పట్టుబడతాం: జయసుధ
సీబీఐ విచారణను పక్కదారి పట్టించడానికి మేము రాజీనామాలు చేయడం లేదు. విచారణలకు భయపడేది లేదని ఇదివరకే జగన్ స్పష్టంచేశారు. మేము ఇదివరకే తెలంగాణ కోసం రాజీనామాలు చేశాం. వాటిని ఆమోదించాలని స్పీకర్‌ను పట్టుబడతాం.
వైఎస్ పేరు ప్రతిష్టలను దెబ్బతీసే యత్నం: టి.బాలరాజు
వైఎస్ పేరు ప్రతిష్టలను మసకబరిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆయన అభిమానులుగా, ఆయన బొమ్మతో గెలిచిన వారిగా మాకు బాధకలుగుతోంది. టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ జగన్‌ను అణచడానికి చేయని ప్రయత్నంలేదు. అందులో భాగంగానే సీబీఐ ఎఫ్ఐఆర్లో మహానేత పేరు ప్రస్తావించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని సమాధి చేస్తాం: కాపు రామచంద్రారెడ్డి
త్వరలో ప్రజల్లోకి వెళ్లి మహానేత కుటుంబంపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను ఎండగడతాం. దేవుడు లాంటి వైఎస్‌పై అభాండాలు వేసినందుకు ఈ కాంగ్రెస్‌పార్టీని రాష్ట్రంలో లేకుండా సమాధి చేస్తాం.
సంఖ్య పెరగడమే కానీ తగ్గడం ఉండదు: కాటసాని రాంభూపాల్‌రెడ్డి
సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో దివంగత వైఎస్ పేరు ప్రస్తావించడాన్ని నిరసిస్తూ... ఆ బాధను తట్టుకోలేక మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నాం. ఈ సంఖ్య రోజు రోజుకు పెరగడమే కానీ తగ్గడం ఉండదు. నా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత దిగజారిన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు.
కాంగ్రెస్ తీరు బాధ కలిగించింది: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వైఎస్ జగన్ మాటకోసం ఓదార్పు యాత్ర చేపడితే కాంగ్రెస్‌పార్టీ ఓర్వలేకపోయింది. పార్టీలో ఉన్ననాళ్లు అనేక అడ్డంకులు సృష్టించి బయటకు పోయేలా చేసింది. ఇప్పుడు జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతోంది. మేము ఎమ్మెల్యేలుగా గెలిచామంటే కేవలం వైఎస్ వల్లే. అలాంటి కుటుంబంపై కాంగ్రెస్, టీడీపీ కలిసి చేస్తున్న కుట్రలను తట్టుకోలేక పోయా. అందుకే ఆ పార్టీ వల్ల వచ్చిన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా.
సిగ్గుంటే రాజీనామా చేస్తారు: బాలినేని శ్రీనివాసరెడ్డి
వైఎస్ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు సిగ్గుంటే రాజీనామా చేస్తారు. అది లేకుంటే పదవులు పట్టుకొని వేలాడతారు. అలా అని రాజీనామాలు చేయాలంటూ ఎవర్నీ బలవంత పెట్టం. ఇప్పుడు వచ్చిన వారందరూ కూడా వారి ఇష్టపూర్వకంగానే వచ్చారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరగడమే కానీ తగ్గడమంటూ ఉండదు. మాది వైఎస్ సైన్యం.. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు.