Post date: Jul 09, 2011 5:47:41 AM
‘ఒక మంచి సీఎం అధికారంలోకి వస్తే ఏమి చేయగలరో వాటిని చేసి చూపించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న తన బిడ్డ జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నా...’ తండ్రిని ఆదరించినట్లే బిడ్డను కూడా ఆదరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ కోరారు. జగన్‌ను వాళ్ల నాయన అన్నివిధాలా తీర్చిదిద్దారని అన్నారు. వైఎస్‌లో ఉన్న ప్రతి లక్షణం జగన్‌లో ఉన్నాయన్నారు.
పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆమె శుక్రవారం అధ్యక్షోపన్యాసం చేశారు. వాళ్ల నాయన అసంపూర్తిగా మిగిల్చిన ప్రతి పనిని జగన్ పూర్తి చేస్తాడు.... మళ్లీ స్వర్ణయుగం తేవటానికి సంసిద్ధులుగా ఉందామని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి క్షణం పేదల అభ్యున్నతి కోసం ఆలోచించేవారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక సుమారు 25 ఏళ్ల ఆయన ఎటువంటి పదవి చేపట్టకుండా ప్రజల సమస్యల కోసం పోరాడారని వైఎస్ విజయమ్మ గుర్తు చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనా, ఎన్ని కుట్రలు జరిగినా ఒంటి చేతితో కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు.