Post date: Jan 31, 2011 7:59:13 AM
‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వంద మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితా వెల్లడి
{పథమ స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్. కపాడియా
రెండో స్థానంలో సోనియా, మూడో స్థానంలో మన్మోహన్ 11వ స్థానంలో ఆర్బీఐ గవర్నర్
20వ స్థానంలో వై.ఎస్.జగన్ 28వ స్థానంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
40వ స్థానంలో గణపతి 49వ స్థానంలో జీఎంఆర్ చైర్మన్, 58వ స్థానంలో నరసింహన్
100లో రాష్ట్రం నుంచి ఆరుగురికే స్థానం ‘తెహెల్కా డ్రీమ్ కేబినెట్’లో 12వ సభ్యుడిగా జగన్
దేశంలోకెల్లా అత్యంత శక్తిమంతులైన మొదటి 20 మంది వ్యక్తుల్లో యువనేత, కడప మాజీ ఎంపీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒకరిగా నిలిచారు. ప్రతిష్టాత్మక జాతీయ పత్రికల్లో ఒకటైన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఏటా దేశవ్యాప్తంగా భిన్న రంగాలను పరిశీలించి ‘ది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్’ జాబితాను ప్రత్యేక సం చికగా రూపొందించి పాఠకులకు అందజేస్తోంది. ఈ ఏడాది రూపొం దించిన జాబితాను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం నాటి సంచికతోపాటు వెలువరించింది. ఈ వంద మంది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్‌లో యువనేత జగన్‌ను 20వ స్థానంలో నిలిపింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటుచేసిన ప్రత్యేక జ్యూరీ అన్ని రంగాలను నిశితంగా పరిశీలించి, విస్తృతంగా అధ్యయనం చేసి కూర్చిన ఈ జాబితాలో.. ప్రథమ స్థానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా సొంతం చేసుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (2), ప్రధాని మన్మోహన్ (3), ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ (4), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ (5) ఉన్నారు. వారి తర్వాత 15 స్థానాల్లో రాష్ట్రం నుంచి ఇద్దరు శక్తిమంతమైన వ్యక్తులుగా.. 11వ స్థానంలో ఆర్బీఐ గవర్నర్ డి.సుబ్బారావు, 20వ స్థానంలో వై.ఎస్.జగన్ ఉన్నారు. మొత్తంగా చూస్తే టాప్ ట్వంటీలో రాష్ట్ర రాజకీయాల నుంచి జగన్ ఒక్కరే ఉండటం.. రాష్ట్ర రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
అంతేకాదు.. మొత్తం వంద మంది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాను పరిశీలిస్తే రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురు రాజకీయ రంగం నుంచి, ఒకరు పాలనారంగం నుంచి, ఒకరు ఆర్థిక రంగం నుంచి, ఒకరు కార్పొరేట్ రంగం నుంచి.. వెరసి ఆరుగురే ఉన్నారు. రాజకీయ రంగం నుంచి జగన్ కాకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 28వ స్థానంలో, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి 40వ స్థానంలో శక్తిమంతులైన వ్యక్తులుగా ఉన్నారు. పాలనా రంగం నుంచి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ 58వ స్థానంలో ఉన్నారు. ఆర్థిక రంగం నుంచి ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు 11వ స్థానంలో, కార్పొరేట్ రంగం నుంచి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు 49వ స్థానంలో నిలిచారు. ఇక్కడ మరో విశేషమేమంటే యావత్ భారతదేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల హృదయాల్లో కొలువుదీరిన క్రికెట్ స్టార్ సచిన్ 21వ స్థానంలో.. అంటే జగన్ తర్వాతి స్థానంలో ఉండటం విశేషం. అలాగే.. బీజేపీ అగ్రనేత అద్వానీ 37వ స్థానంలో ఉండగా.. వందో స్థానంలో ‘బళ్లారి బ్రదర్స్’ గాలి జనార్ధన్‌రెడ్డి, గాలి కరుణాకర్‌రెడ్డి, గాలి సోమశేఖరరెడ్డి ఉమ్మడిగా నిలిచారు.
తెహెల్కా డ్రీమ్ కేబినెట్లో జగన్
ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, క్రీడలు అప్పగించాలన్న మేగజీన్
యువనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ‘తెహెల్కా’ మేగజీన్ ఆయనకు తన ‘డ్రీమ్ కేబినెట్’లో కీలక శాఖను అప్పగించింది. పరిశోధనాత్మక కథనాలతో దేశ వెబ్ జర్నలిజం, పత్రికారంగంలో పెనుసంచలనం సృష్టించిన ‘తెహెల్కా’ తాజా సంచికలో జగన్ గురించి ప్రత్యేకంగా పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫిబ్రవరి 5వ తేదీ సంచికలో ‘ది కేబినెట్ అకార్డింగ్ టు తెహెల్కా’ శీర్షికన ఇచ్చిన కథనంలో డ్రీమ్ కేబినెట్లో 12వ సభ్యుడిగా జగన్‌కు స్థానం కట్టబెట్టింది. ఉపాధి అవకాశాల కల్పన, పేదరిక నిర్మూలన (పట్టణ, పల్లె ప్రాంతాలు రెండింట్లోనూ), క్రీడల విభాగాలను కలిపి యువజన వ్యవహారాల శాఖగా మార్చి ఆ శాఖ బాధ్యతలను జగన్‌కు అప్పగిస్తే బాగుంటుందనేది ‘తెహెల్కా’ కథనం సారాంశం. ఈ పదవిని ఆయన సమర్థంగా నిర్వహిస్తే అప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలను అప్పజెప్పవచ్చని ‘తెహెల్కా’ పేర్కొంది. 16 మంది సభ్యులున్న ‘తెహెల్కా డ్రీమ్ కేబినెట్’లో రాహుల్‌గాంధీ, జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్, దయానిధి మారన్, అగాథా సంగ్మా తదితర యువ నాయకులు ఉన్నారు.