Post date: Aug 18, 2011 5:39:8 AM
వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిళ ఇంట్లో సిబిఐ అధికారులు గురువారం సోదాలు ప్రారంభించారు. సాగర్ సొసైటీలోని ఆమె ఇంట్లో సోదాలు ఉదయాన్నే ప్రారంభించారు. అలాగే సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వివేకానందనగర్లో ఉంటున్న దండమూరి వీరభద్రారావు ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. గాయత్రీహిల్సులోని హెటెరో డ్రగ్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పాటు పలు హెటెరో కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే కాలనీలో నివసిస్తున్న వ్యాపారవేత్త లక్ష్మీరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారి కార్యాలయాలలో, జగన్ కంపెనీలలో సిబిఐ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే కాకుండా బెంగుళూరు, చెన్నై, ముంబయి తదితర ప్రధాన నగరాల్లోనూ సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. బెంగుళూరులోని జగన్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కోల్కత్తా, హౌరా, రాంచీ పట్టణాలలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 22 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.