Yalavarthi Nayudamma

యలవర్తి నాయుడమ్మ (1922 - 1985) ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో సెప్టెంబరు 10, 1922 నాడు జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాధమిక విద్య చదివిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజిలో ఉన్నతవిద్యనభ్యసించి మద్రాసు చర్మ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విద్యగరపి అదే సంస్థలో అంచలంఛలుగా ఎదిగి డైరెక్టరు అయ్యాడు. 1958 నుండి 1971 వరకు సుదీర్ఘకాలము డైరెక్టరుగా ఉన్నాడు. తన ఆధ్వర్యములో చర్మపరిశోధనా సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాడు.

జననం-1922. మరణం-1985.

1985లో జరిగిన కనిష్క విమాన దుర్ఘటనలో మరణించాడు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నాయుడమ్మ అవార్డును ప్రదానం చేస్తారు. విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పేరిట ఏటా బహుకరించే అవార్డుకు 2009 సంవత్సరాని కి ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయకుమార్ సారస్వత్‌ను ఎంపిక చేశారు.

పదవులు, పురస్కారాలు

ఢిల్లీలోని జవహర్లాలు నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలరు గా, భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థానానికి డైరెక్టరు జనరల్ గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందాడు. భారత ప్రభుత్వము నుండి పద్మశ్రీ పురస్కారము, రాజలక్ష్మీ సంస్థనుండి శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం పొందాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సంస్థలలో సభ్యులుగా ఉన్నాడు.