Alexander Graham Bell

సరిగ్గా 134 సంవత్సరాల క్రితం సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు ప్రాంతాల మధ్య ఒక తీగ ద్వారా 'మాటలు' ప్రయాణించాయి.

- చిన్నపిల్లలు సైతం సెల్‌ఫోన్లలో మాట్లాడుతున్న ఈనాడు ఇదొక వింతగా అనిపించకపోవచ్చు కానీ, అప్పటికి మాత్రం అదొక అద్భుతమే! అలా 1876లో తొలిసారిగా మాటల్ని వినిపించిన ఆ పరికరాన్ని ఆనాడు 'విద్యుత్‌ భాషణ యంత్రం' అని పిలిచారు. అదే మొదటి టెలిఫోన్‌.

ఇప్పటి సెల్‌ఫోన్‌కే కాదు, ఆధునిక సమాచార ప్రసార సాధనాలకు కూడా పునాదిగా చెప్పే ఆ టెలిఫోన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలగ్జాండర్‌ గ్రాహంబెల్‌. దాన్ని కనిపెట్టేనాటికి అతడి వయసు 29 సంవత్సరాలు. ఇప్పటికి 163 సంవత్సరాల క్రితం స్కాంట్లాండ్‌లోని ఎడింబరోలో 1847 మార్చి 3న పుట్టిన గ్రాహంబెల్‌ చిన్ననాటి నుంచే ఏవేవో ప్రయోగాలు చేసేవాడు. మరోవైపు కళలు, కవిత్వం, సంగీతంలో అభిరుచి చూపేవాడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం చేసేవాడు.

గ్రాహంబెల్‌ తాత, తండ్రి వక్తృత్వం, సంభాషణల విషయాలపై పరిశోధన చేస్తుండేవారు. ప్రాథమిక విద్యను తండ్రి వద్దే అభ్యసించిన గ్రాహంబెల్‌ ఎడింబరోలోని రాయల్‌ హైస్కూల్లో చదువుకుని, పదహారేళ్లకల్లా అక్కడే వక్తృత్వం, సంగీతాలను నేర్పించే పనిలో చేరాడు. తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు. ఆమె నుదిటి ఎముకకు దగ్గరగా ఒక రకమైన ఉచ్ఛారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని (Acoustics) అర్థం చేసుకున్నాడు.

ఆపై ఎడింబరో విశ్వవిద్యాలయంలో ధ్వని, వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో 'గాత్ర సంబంధిత శరీర శాస్త్రం' (వోకల్‌ ఫిజియాలజీ)లో ప్రొఫెసర్‌గా చేరాడు. భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బధిరుల కోసం పరిశోధనలు చేసి, వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించాడు. పగలంతా బోధిస్తూ, రాత్రంతా మేలుకుని ప్రయోగాలు చేసేవాడు. ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్‌ను కనిపెట్టగలిగాడు. దీనిపై 1876లో ఆయనకు లభించిన పేటెంట్‌ అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది. ఆపై ఆప్టికల్‌ టెలికమ్యూనికేషన్స్‌, హైడ్రోఫాయిల్స్‌, ఏరోనాటిక్స్‌ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశాడు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ వ్యవస్థాపకుల్లో గ్రాహంబెల్‌ కూడా ఒకరు.